భద్రత గాలికి!

Jun 19,2024 05:40 #editpage

రైలు ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు, బుల్లెట్‌ ట్రైన్స్‌, అమృత్‌ స్టేషన్స్‌ అంటూ… ప్రధాని మొదలు ఛోటా మోటా నేతల వరకూ తమ హయాంలో రైల్వేలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లామంటూ చంకలు గుద్దుకుంటూంటారు. రైల్వే ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెడుతూ..ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ…అభివృద్ధి పేరుతో ప్రచారార్భాటం చేస్తున్నారు. అంతలోనే… ఢకొీట్టే రైళ్లు..పల్టీ కొట్టే బోగీలు…గాలిలో కలిసిపోయే ప్రాణాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, మిన్నంటే రోదనలు, హృదయ విదారక దృశ్యాలు… ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల తరువాత అతి పెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన భారత్‌లో నిత్యం ప్రమాదాలెందుకు జరుగుతున్నాయి? ప్రకృతి విపత్తులు, టెర్రరిస్ట్‌ దాడులు లాంటివి జరిగినప్పుడు శాటిలైట్‌ సంకేతాల ఆధారంగా అనేక దేశాలు క్షణాల్లో దారిమళ్లిస్తూ… ప్రయాణికుల భద్రతకు భరోసానిస్తుంటే… మన దేశంలో ఈ దుస్థితి ఎందుకు? ప్రతి రోజూ రెండున్నర కోట్ల మంది ప్రయాణికులను, 33 లక్షల టన్నులకుపైగా సరుకులను 22 వేలకుపైగా రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. సామాన్యుడు ప్రయాణించే జనరల్‌ బోగీలు, స్లీపర్లు కుదించేస్తూ… ఎసి బోగీలు, ట్రైన్లు పెంచేస్తున్నారు. రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించి, సామాన్యులకు భద్రత, భరోసాతో కూడిన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో లోపించడం విస్మయకరం.
గత పదేళ్ల మోడీ పాలనలో లక్ష కోట్లు కేటాయించిన అహ్మదాబాద్‌-ముంబై బుల్లెట్‌ రైళ్లు పరుగులు దీస్తున్నాయి. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దేశంలో ఎక్కడ ప్రారంభమైనా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లి, ఘనంగా జెండా ఊపుతారు. వాటి గరిష్ట వేగానికి తగినట్టు ట్రాకుల ఆధునీకరణకు మాత్రం మరో ఐదారేళ్లు పడుతుందట. ఈ బుల్లెట్‌ రైళ్లు, వందే భారత్‌లో టిక్కెట్లు ఇంచుమించు విమాన ఛార్జీలకు సరిసమానంగా ఉంటూ…సామాన్యుడికి అందని ద్రాక్షగానే మిగిలాయి. ఇదే సమయంలో ప్రయాణికుల భద్రత నానాటికీ తీసికట్టుగా మారింది. 2014 నుంచి ప్రతి నెలా సగటున 11 రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌ 2న ఒరిస్సాలోని బాలాసోర్‌లో జరిగిన ప్రమాదంలో 296 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. తాజాగా జరిగిన కాంచనగంగా ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
ఈ ప్రమాదాలకు రైల్వే భద్రతపై ఉదాసీనతే ప్రధాన కారణంగా ఉంటోంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఢకొీనకుండా రక్షణ కల్పించే ట్రైన్‌ యాంటీ కొలిజియం సిస్టమ్‌ (కవచ్‌) మన దేశానికి ఉంది. దేశవ్యాప్తంగా లక్ష కిలోమీటర్లకుపైగా రైల్వే ట్రాక్‌లు ఉంటే, వాటిలో 1500 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌లపైనే ఆ వ్యవస్థను అనుసంధానం చేశారు. ఈ ఏడాది చివరికి మూడు వేల కిలోమీటర్లకు అందుబాట్లోకి వస్తుందని తాజాగా ప్రకటించారు. అంటే మిగతా 97 వేల కిలోమీటర్లలోన వెళ్లే రైళ్లలో ప్రయాణికుల భద్రతకు భరోసా ఇచ్చేదెవరు? రైల్వే భద్రతపై మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని 2022 కాగ్‌ ఎండగట్టింది. రైల్వే ట్రాక్‌ల ఇన్‌స్పెక్షన్లు 50 శాతం జరగడం లేదు. దెబ్బతిన్న పట్టాల స్థానంలో కొత్త పట్టాల ఏర్పాటుకు బడ్జెట్‌లో భారీగా కోత విధించారు. 26 శాతం ప్రమాదాలకు కొత్త పట్టాలు ఏర్పాటు చేయకపోవడమే కారణం. రైల్వేల్లో 2.74 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న దృష్టే లేదు. రైల్వే వ్యవస్థలో అతి కీలకమైన పాత్ర పోషించే లోకోపైలట్‌ పోస్టులు సైతం భర్తీ చేయడం లేదు. ఉన్నవారిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. 12 గంటలకు మించి డ్యూటీలు వేయకూడదన్న నిబంధనలను సైతం తుంగలో తొక్కి డ్యూటీలు వేస్తున్నారు. ఇక గ్యాంగ్‌మెన్‌ పోస్టులు, సిగల్‌ వ్యవస్థ ఆధునీకరణ, ట్రాక్‌ల రెన్యువల్‌, మెయింటెనెన్స్‌, ఇన్‌స్పెక్షన్‌…తదితర పనుల న్నింటినీ గాలికొదిలేశారు. దీనిఫలితంగానే తరచూ భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ ప్రయాణికుల భద్రతకు, సౌకర్యవంతమైన ప్రయాణానికి పూచీ పడాల్సింది, అందుకు అనుగుణంగా రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే!

➡️