లింగ సమానత్వంతోనే మహిళా సాధికారత

savitri bai pule article women empowerment importance
  • మహిళల హక్కుల కోసం తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన ఆదర్శమూర్తి సావిత్రిబాయి ఫూలే. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయినిగా, మహిళలు చదువుకోవడం ద్వారానే సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారిత సాధిస్తారని, వారి హక్కులను స్వేచ్ఛాయుత వాతావరణంలో పొందడానికి కావలసిన పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించాలని గొంతెత్తి పోరాడిన ధీరవనిత. అటువంటి సావిత్రిబాయి ఫూలే జయంతి ప్రతి యేటా జనవరి 3న జరుపుకుంటున్నాం. ఈ జయంతి ఉత్సవాల ద్వారా సావిత్రిబాయి ఫూలే సాధించిన విజయాలను మననం చేసుకుంటూ రాజ్యాంగం కల్పించిన సమాన పనికి సమాన వేతనం, సమాన హక్కులను సాధించుకోవడానికి కృషి చేద్దాం.

 

  • రాజ్యాంగంలో మహిళలు

ఆర్టికల్‌-14 ప్రకారం మతం, జాతి, కులం, లింగ, జన్మస్థలం ఆధారంగా వివక్షత కూడదు. ఆర్టికల్‌-15 ప్రకారం మహిళల, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక కేటాయింపులు ఉండాలి. సమాజంలో, పనిచేసే ప్రదేశంలో గౌరవం, మర్యాదలతో బాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, సమాన పనికి సమాన వేతనం, రాజకీయ భాగస్వామ్యం, గృహ హింస వ్యతిరేక హక్కు, మన రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు. మాటల్లో మహిళలను దేవతలుగా చూపుతూ, ఆచరణలో వంటింటికి మాత్రమే పరిమితమయ్యేలా నేటి పాలకులు చట్టాలు రూపొందిస్తున్నారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసమే తమ ప్రభుత్వాలు పని చేస్తుంటాయని ప్రతి సందర్భంలో చెబుతుంటారు. మహిళలపై దాడులు, హింస, హత్యలు జరిగినప్పుడు హడావుడి చేయటం, కొత్త కొత్త చట్టాలు తీసుకురావడం, తర్వాత వాటిని అమలు పరచకపోవడం వీరి నైజం. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు నేడు ఏర్పడుతున్నాయి. ఎప్పుడో 18వ శతాబ్దంలో సావిత్రిబాయి ఫూలే చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు రాజ్యాంగంలో మహిళలకు కనీసం హక్కులైనా పొందుపరిచారు.

 

  • విద్య ఒక ప్రయోగశాల

1986 నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్య, అందుబాటులో విద్య, బాలికల అక్షరాస్యత పెంపుదల లక్ష్యాలుగా ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డ్‌, డిపిఇపి, ఎపెప్‌… తెరమీదకు వచ్చాయి. వీధి వీధిన పాఠశాల ఏర్పాటు చేశారు. బాలికలలో విద్యను పెంపొందించేందుకు పాఠశాలలకు ప్రధానో పాధ్యాయుల పోస్టులు ఏర్పాటు చేశారు. పాఠశాలలు ఒక ఉపాధ్యాయుడు వుంటే ఇద్దరు, ఇద్దరుంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా ఏర్పాటు చేసారు. క్రమంగా రాజకీయ నాయకుల ప్రమేయంతో పేట, వీధి, గూడెంలో పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అనేక పాఠశాలలు వెలిశాయి. ఈ ప్రయోగాల అమలు కోసం స్వచ్ఛంద సంస్థలు, విద్యారంగ నిపుణులు, రకరకాల కన్సల్టెంట్లు, రిసోర్స్‌ పర్సన్లు పుట్టుకొచ్చారు. కొత్త కొత్త గ్రంథాలు, లెక్కలేనన్ని ట్రైనింగ్‌లు, పరిమితికి మించిన బోధన సామగ్రి సిద్ధమయ్యాయి. ప్రాజెక్టును సమీక్షించడానికి లక్షలాది ఫారాలు నింపడం, నింపిన ఫారాన్ని మరలా మరలా నింపడం, సంవత్సరంలో సగం రోజులు ఉపాధ్యాయులు బోధన కంటే శిక్షణకు పరిమితం కావడం నిత్యకృత్యమైంది. అంతిమంగా ఉన్న విద్యా వ్యవస్థకు సమాంతరంగా మరో వ్యవస్థను నిర్మించడం ద్వారా వున్న వ్యవస్థల్ని నీరుగార్చారు. ఫలితంగా రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్‌సిఇఆర్‌టి), డైట్‌ (డిఐఇటి) లు బలహీన పడ్డాయి. ఈ క్రమంలో నూతన జాతీయ విద్యా విధానం-2020 ముందుకు వచ్చింది. మరిన్ని ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. అందుబాటులో పాఠశాల, నాణ్యమైన విద్య, బాలికలకు ప్రత్యేక విద్య అనే లక్ష్యాలు కనుమరుగై అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయటం అనే లక్ష్యం ముందుకు వచ్చింది. గతంలో జరిగిన ప్రయోగాల ఫలితం ఏమిటనేది సమీక్షించకుండానే పాఠశాలలు బలహీనమయ్యాయి కనుక పిల్లల సంఖ్య తగ్గింది అనే పేరుతో బడులను కుదించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాల పోస్టులను సర్దుబాటు పేరుతో తగ్గిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో 50 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటన చేస్తే ఇక్కడ రాష్ట్రంలో 25 వేల పోస్టులు అదనంగా ఉన్నాయని రేషనలైజేషన్‌ చేసి కుదించారు. పాఠశాలల విలీనం పేరుతో 4750 ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను కిలోమీటర్‌ లోపు ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీనితో 14 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. సుమారు 500 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఒక్క విద్యార్థి కూడా పాఠశాలలో చేరలేదు. సుమారుగా మూడున్నర లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి వెళ్లారు. వీరిలో సగానికి పైగా బాలికలే. భవిష్యత్తులో ఈ పాఠశాలలన్నీ మూసివేతకు గురవుతాయి. మరోవైపు జిఓ 117 అమలు పరచి ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించారు. ఈ విధంగా విద్యారంగాన్ని ఒక ప్రయోగశాలగా మార్చడం ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలహీన పడుతున్నది.

 

  • పాలకుల వైఖరి

72, 73 రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశారు. స్థానిక సంస్థలలో 33 శాతం మంది వార్డు మెంబర్లుగాను, సర్పంచులు గాను, ఎంపిటిసిలుగాను, జడ్‌పిటిసి లుగాను వచ్చారు. పరిపాలన బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆచరణలో మాత్రం వారి భర్తలు లేదా తండ్రులు చేస్తున్నారు. ఇప్పుడు చట్ట సభల్లో సైతం 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశారు. కాని, అమలు మాత్రం 2029 సార్వత్రిక ఎన్నికల నుండే వర్తింపజేస్తారట. మరోవైపు రాజ్యాంగంలో 30కి పైగా చట్టాలు మహిళల హక్కుల పరిరక్షణ కోసం చేయబడ్డాయి. మహిళపై దాడులు జరిగితే వెంటనే దిశ, నిర్భయ లాంటి చట్టాల్ని తీసుకొచ్చారు. అయితే ఈ చట్టాలన్నీ కాగితాలకే పరిమితం. ఎక్కడ ఏ దాడి జరిగినా అది కుల, మత, ప్రాంతీయ, రాజకీయ ఘర్షణగానో లేదా కుల దురహంకార హత్యగానో ఉంటున్నది. వీటిలో బలవుతున్నది ప్రధానంగా మహిళలే. నిన్నగాక మొన్న నాగాలాండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో మహిళలపై జరిగిన దారుణ సంఘటనలు, జమ్ము కాశ్మీర్‌లో మత ఘర్షణలు, ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, మహిళపై దాడులు ఆగటం లేదు. ప్రధాన కారణం మహిళ పట్ల పాలకుల దృక్పథం. మహిళలు వంటింటికే పరిమితం కావాలన్నది పాలక వర్గాల ఆలోచన ధోరణి. వీటికి తార్కాణంగానే కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయ నాయకులు మహిళల వస్త్రధారణ మీద, ఆహారపు అలవాట్ల మీద, స్వేచ్ఛ స్వాతంత్య్రాల మీద ఆంక్షలు విధించాలని బహిరంగంగా మాట్లాడుతున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా పాలకుల చిత్తశుద్ధి లేకుండా మహిళలపై దాడులను అరికట్టడం సాధ్యం కాదు.

 

  • పిల్లల కోసం మనం

రాజ్యాంగంలో మహిళల హక్కుల కోసం చట్టాలు చేయబడ్డాయి. మహిళలపై దాడులేమైనా జరిగినప్పుడు కొత్త కొత్త చట్టాలు ముందుకు వస్తున్నాయి. విద్యలో రకరకాలు ప్రయోగాలు దేశంలో, రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మహిళా అక్షరాస్యత శాతం 64 శాతానికి మించలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అక్షరాస్యత శాతం 50 లోపు గానే ఉన్నది. ఇప్పటికి చాలా పాఠశాలలు మూసివేత దశలో ఉన్నాయి. చాలామంది పిల్లలు డ్రాప్‌ అవుట్‌ అవుతున్నారు. ఐదవ తరగతి చదివేటువంటి పిల్లలకు రెండవ తరగతి పాఠ్య పుస్తకాలు చదవటం రాయటం రావటం లేదని అసర్‌, అంతర్జాతీయ విద్య సంస్థల సర్వే నివేదికలు తెలుపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేకుండా పోయింది. దీనికి ప్రభుత్వ విధానాలు, పర్యవేక్షణ పేరుతో పాఠశాలలు బలహీనపరచడం కారణాలుగా ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు నమ్మకంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఆ పిల్లవాడు ప్రాథమిక పాఠశాల స్థాయి విద్య పూర్తయ్యే నాటికి తెలుగు, ఇంగ్లీష్‌ భాషలలో చదవటం, రాయడం, మాట్లాడడం, గణిత చతుర్విధ ప్రక్రియలు వస్తున్నాయా? ప్రతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లీషులలో చదవడం, రాయడం మాట్లాడడం, గణితం చతుర్విధ ప్రక్రియలు వచ్చేందుకు ప్రత్యేక కషి ఉపాధ్యాయులు చేయాలి. పిల్లల్లో ఈ సామర్ధ్యాలు పెంపొందించడానికి అవసరమైతే ఒక గంట అదనంగా పాఠశాలలో పనిచేయటం కోసం సమయాన్ని హెచ్చించాలి. ఇప్పటికే పాఠశాలలో బోధనేతర పనుల ఒత్తిడి, అధికారుల పర్యవేక్షణ పేరుతో మానసిక ఒత్తిడి ఎన్ని ఉన్నా పిల్లల్లో చదవటం రాయటం గణిత సామర్ధ్యాలను సాధించడంలో మనం కృషి చేయాలి. సమాజానికి ప్రభుత్వ పాఠశాల మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి. ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవడం ద్వారానే ప్రభుత్వ విద్యారంగాన్ని తద్వారా భవిష్యత్తులో తయారయ్యే పౌరులకు నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యత, సమిష్టి విధానం, ఈ దేశం మన అందరిదీ అనే భావన కలిగించడానికి కృషి చేయాలి. తల్లిదండ్రులతో మమేకమయ్యే కార్యక్రమాలు రూపొందించుకొని అమలు చేయాలి.

 

  • మహిళా సాధికారత

యునెస్కో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి లింగ సమానత్వం సాధించడం ద్వారా మహిళల్లో ఆర్థిక సాధికారతను సాధించాలని ప్రకటన చేసింది. మహిళా ఆర్థిక సాధికారత సాధించడమంటే విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మహిళలకు అందించడంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవడమే.

  •  అన్ని హంగులతో ప్రతి పంచాయతీకి ఒక ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలి
  • ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రాథమిక పాఠశాలతో అనుసంధానం చేయాలి.
  • సమాంతర మీడియం వ్యవస్థను కొనసాగించాలి.
  • ఏ మీడియంలో చదువుకోవాలనేది విద్యార్థులకు స్వేచ్ఛనివ్వాలి.
  • ఉపాధ్యాయ ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి.
  • బాలికా విద్య కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి.
  • రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగం కోసం 30 శాతం కేటాయించాలి.

చదువు చైతన్యాన్ని ఇస్తుంది. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తుంది. సమాజంలో నూతన ఉత్పత్తుల తయారీకి మార్గాన్ని సుగమం చేస్తుంది. ప్రజలు మరింత సుఖవంతంగా బతకడానికి కావలసిన పునాదిని ఏర్పరుస్తుంది. అలాంటి విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండడం ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగ విలువల్ని పరిరక్షించుకుందాం. సమానత్వపు భావాలను పెంపొందించుకుందాం. ఈ దేశం అందరిదీ అనే భావన మరింత బలపరుచుకుందాం.

 

  • వ్యాసకర్త : నక్కా వెంకటేశ్వర్లు,  యు.టి.ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు
➡️