సవ్యసాచి మోటూరు హనుమంతరావు – నేడు ఎం హెచ్‌ 23వ వర్ధంతి

అందరూ ప్రేమగా ఎంహెచ్‌ అని పిలుచుకునే కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు వర్థంతి ఈ రోజు. సరిగ్గా ఇరవై మూడేళ్ల క్రితం 2001 జూన్‌ 18న ఆయన 84వ ఏట కన్ను మూశారు. కుడి చేతితో వేసినంత కచ్చితత్వంతో ఎడమ చేతితోనూ బాణం వేయగలవాడు అర్జునుడని, అందుకాయనను సవ్యసాచి అంటారని నిఘంటువులో పేర్కొంటారు. ఏకకాలంలో బహుముఖ రీతిలో ప్రతిభను కనపర్చిన ఎంహెచ్‌ గారికి ఇది అక్షరాలా వర్తిస్తుంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో 1937లో సభ్యునిగా చేరిన ఆయన ఆ తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా, తదనంతరం పొలిట్‌బ్యూరో సభ్యునిగా పని చేశారు. తొలుత మితవాదంతో, ఆ తరువాత అతివాదులతో రాజకీయ, సైద్ధాంతక విభేదాలు తలెత్తినపుడు నికరంగా నిలిచిన మార్క్సిస్టు ఆయన. శాసన సభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా అదే విధంగా రాజ్యసభ సభ్యునిగా చట్టసభల్లో కూడా సేవలందించారు. కమ్యూనిస్టు పాత్రికేయునిగా ఆయనది అందెవేసిన చెయ్యి. దిన, వార పత్రికల్లో రాయడంతోపాటు ప్రచార కరపత్రం మొదలుకొని గ్రంథాల వరకూ ఆయన రాశారు. కలం బలం చూపడమేగాక ఆయన అనర్గళమైన ఉపన్యాసకర్త. ఆయన కార్యకర్తలను ఎంతో ఆప్యాయంగా చూసేవారు. ఎన్నో సుగుణాల కలబోతయైన కామ్రేడ్‌ ఎంహెచ్‌ మనకు దూరమై నేటికి 23 ఏళ్లు గడచిపోయాయి. ఈ సందర్భంగా ఆయనను స్మరించు కుంటూ కొన్ని అంశాలను పాఠకుల ముందుంచే యత్నమిది.

బాల్యం… విద్యాభ్యాసం
గుంటూరు (ప్రస్తుతం బాపట్ల) జిల్లా వెల్లటూరు ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు మోటూరు లక్ష్మీనారాయణ, రుక్మిణమ్మ. 1917లో జన్మించిన ఎంహెచ్‌ పల్లెకోనలో చదువుకున్నారు. హైస్కూలు దశలో దేశభక్తితో ఉర్రూతలూగిన హనుమంతరావు హెడ్‌మాస్టర్‌ బెదిరింపులకు వెరవకుండా భగత్‌సింగ్‌ ఉరితీతకు అసమ్మతిగా సమ్మె చేయడం, హరిజన సహపంక్తి భోజనాలు, కల్లుగీత కుండలు పగులకొట్టడం వంటి జాతీయోద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయవాదిగా 1935 వరకు వున్న ఆయన క్రమంగా కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ వైపు, ఆ తరువాత 1937లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు.

కమ్యూనిస్టుగా…. నిర్బంధాలు..
గుంటూరు విద్యార్థి ఉద్యమ కార్యకర్త. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధ ప్రచారం. అప్పుడు జరిగిన చారిత్రాత్మక విద్యార్థి సమ్మె నాయకుల్లో ఒకరు. భాగస్వామి. 1940 మార్చి 18వ తేదీన యుద్ధ వ్యతిరేక ప్రచారంలో స్వతంత్ర భారత్‌ అనే రహస్య పత్రికను స్టూడెంట్స్‌ ఎంపోరియం ద్వారా పంచుతున్నారన్న అభియోగంతో అరెస్టు వారంటు వచ్చింది. ఆనాటి నుండి 1942 ఆగస్టు మొదటివారం వరకు రహస్య జీవితం. మళ్లీ 1947 జనవరి 21 నుండి 1947 ఆగస్టు 15 వరకు ప్రకాశం ఆర్డినెన్స్‌ కింద అరెస్టు వారంటు. అందువలన 1949 మే 10వ తేదీన పట్టుబడేవరకు హనుమంతరావు రహస్యజీవితం గడిపారు. 1951 సెప్టెంబర్‌ వరకు కడలూరు సెంట్రల్‌ జైలులో డిటెన్యూగా ఉన్నారు. 1962 నవంబరు 21 నుండి 1963 మే వరకు హైదరాబాద్‌ చంచలగూడ జైలులో డిటెన్యూగా నిర్బంధం. మళ్లీ 1964 జూన్‌ 14 నుండి 29 వరకు విజయవాడ, కైకలూరు జైళ్లలో రిమాండ్‌. తిరిగి 1964 నవంబర్‌లో కలకత్తాలో మార్క్సిస్టు పార్టీ ప్రారంభ మహాసభ జరిగిన అనంతరం 1964 డిసెంబర్‌ 31 నుండి 1966 జూన్‌ వరకు చంచలగూడ జైల్లో డిటెన్యూగా నిర్బంధం. తర్వాత రైల్వే స్ట్రయిక్‌, విశాఖలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం జరిగిన ఆందోళనల సందర్భంగా రెండుసార్లూ రెండు మాసాలు రహస్య జీవితం ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్‌ 26 నుండి 1977 ఫిబ్రవరి 18 వరకు 20 మాసాలపాటు రహస్య జీవితం. ఆవిధంగా బ్రిటిషు వాళ్ల పరిపాలన కింద రెండుసార్లు, కాంగ్రెస్‌ పాలనలో నాలుగుసార్లు మొత్తం ఐదున్నర సంవత్సరాల రహస్య జీవితం గడపవలసి వచ్చింది. మొత్తం నాలుగున్నర సంవత్సరాలపాటు జైలు జీవితం గడపవలసి వచ్చింది.

పార్టీ బాధ్యతలు
సభ్యుడుగా చేరినది 1937లో. 1938 నుండి 43 వరకు గుంటూరుజిల్లా కమిటీ సభ్యునిగా, 1943 నుండి 1948 వరకు జిల్లా కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు. 1948 నుండి 1964 వరకు ఉమ్మడి పార్టీలో ఒకటి రెండు సంవత్సరాలు మినహా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు. 1953 మదురై పార్టీ కాంగ్రెస్‌ నుండి 64 వరకు కేంద్ర కమిటీ, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు. 1964 నుండి సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులుగా, 1994నుండి 2001లో తుదిశ్వాస విడిచేవరకు పొలిట్‌బ్యూరో సభ్యునిగా పని చేశారు. 1964 నుండి 1982 వరకు సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుండి 2001 వరకు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా కొనసాగారు.

సంపాదకుడు… రచయిత
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పత్రిక విశాలాంధ్ర ప్రధాన సంపాదకులుగా 1953 నుండి 1962 వరకూ మధ్యలో రాజకీయ కారణాల వల్ల రెండు సంవత్సరాలు మినహా మిగతా ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు. తర్వాత సిపిఐ(ఎం) ఆధ్వర్యాన నడిచిన జనశక్తి వారపత్రికకు, దినపత్రికకు, ప్రజాశక్తి వార పత్రికకూ తాను సంపాదకుడిగా పేరుకు లేకపోయినా వాటి సంపాదక బాధ్యతల్ని నిర్వహించారు. 1981 నుండి దినపత్రికగా ప్రచురితమవుతున్న ప్రజాశక్తికి ఆయన వ్యవస్థాపక సంపాదకుడు. ఆ బాధ్యతల్లో 2001 వరకు కొనసాగారు.
ఉద్యమాలు జరుగుతున్న సందర్భాల్లో ప్రజలను ఉర్రూతలూగించేలా కానీ, పార్టీపై ఎదురుదాడి జరిగిన సందర్భాల్లో సైతం పార్టీ వైఖరిని వివరించి ప్రజా విశ్వాసం పొందే రీతిలో కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాజకీయ శత్రువులను వారి వైఖరులను ఎండగడుతూ కూడా ప్రచార కరపత్రాలు (బుక్‌లెట్లు) శక్తివంతంగా రాసేవారు. రాజధాని రభసకు కారకులు ఎవ్వరు?, శత్రువుల కులుకుకు మిత్రుల ఆవేదనకు కారకులెవ్వరు?, పీడిత ప్రజలపై పాలకుల రాక్షసహస్తం, వీర తెలంగాణా కోరింది విచ్ఛిత్తిగాదు- విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాలాంధ్రలో విషాదచ్ఛాయలు వంటివి వాటిలో కొన్ని. దిగంబర కవిత్వం మార్క్సిజం గాదు, సాహిత్యోద్యమంలో మార్క్సిస్టు అవగాహన, సాహిత్య రంగంలో మార్క్సిస్టు అవగాహన వంటివి ఇప్పటికీ రిఫరెన్స్‌ పుస్తకాలే! రాబందుల రాజ్యం, రోజన్‌బర్గులు, మహావీరుడు అలెండి, స్టాలిన్‌ యుగం వంటి సుబోధకమైన అనువాదాలు ఎంహెచ్‌ కలం నుండి వెలువడ్డాయి.

చట్టసభల్లో ప్రజా వాణి
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు 1952లో రేపల్లె నియోజకవర్గం నుండి, 1978-84 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యత్వం, 1988- 94 వరకు రాజ్యసభ సభ్యుడుగా ఆయన సేవలందించారు. ఆయా సందర్భాల్లో ఆ పదవులకు ఆయన వన్నె తెచ్చారు. ఏ అంశం మీద చట్ట సభల్లో ప్రసంగించినా లోతైన సమాచారంతోపాటు ఆయా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పక చర్యలు చేపట్టేవిధంగా ఒప్పించేవారు. ప్రజా కంటకమైనౖ ప్రభుత్వ విధానాలను దునుమాడేవారు. ఇతర పార్టీలకు చెందిన సహచర సభ్యులతో సుహృద్భావ సంబంధాలు నెరిపేవారని ఆయనతో సన్నిహితంగా వున్నవారు చెబుతుంటారు. ఆయన పార్టీ ప్రతినిధిగా రుమేనియా, చైనా, సోవియట్‌ యూనియన్‌ తదితర సోషలిస్టు దేశాల్లో పర్యటించారు. తానా ఆహ్వానంపై 1983 లో ప్రపంచ తెలుగు మహాసభకు అమెరికా వెళ్లారు.

కార్యకర్తలపట్ల వాత్సల్యం
రాజకీయ సిద్ధాంత విషయాల్లో ఘర్షణ పడేటపుడు ఎంత నిశితంగా, కచ్చితంగా ఉండేవారో వ్యక్తిగత విషయాల్లో సహచరులపట్ల చాలా ప్రేమగా ఉండేవారని ఆ తరం కమ్యూనిస్టులు ఎంహెచ్‌ని కొనియాడుతారు. కార్యకర్తలపట్ల ఎంతో వాత్సల్యం కురిపించేవారు. వయసులో అంతరం ఎక్కువైనా గాని కార్యకర్తల్ని చేరదీయడం, వారికి వివిధ అంశాలను బోధపర్చి అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేసేవారు. నా అనుభవమే తీసుకుంటే ఆంధ్రా యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక శ్రీకాకుళం జిల్లాకు పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లి పని చేయాలని చెప్పింది ఆయనే! ఆ జిల్లాలో ఒకప్పుడు బలమైన ఉద్యమం ఉండేది నగ్జలిజం మూలంగా తీవ్రంగా నష్టపోయామని, విలువైన కార్యకర్తల్ని కోల్పోయామని ఎంతగానో బాధ పడ్డారు. రాష్ట్ర పార్టీ గైడెన్సు, విశాఖపట్నం జిల్లా సహాయంతో శ్రీకాకుళం జిల్లాలో పని చేయాలని ఆనాటి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వున్న ఆయన సుమారు గంటకుపైగా వివరించారు. తరువాతి కాలంలో శ్రీకాకుళం నుండి రాష్ట్ర కేంద్రంగావున్న విజయవాడకు నేను వచ్చినపుడల్లా కామ్రేడ్‌ ఎంహెచ్‌ను కలవకుండా వెళ్లింది దాదాపు లేదు. ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ, తరువాత ప్రజాశక్తి సంపాదకునిగానూ ఉన్న సందర్భాల్లో కూడా మాట్లాడడం పూర్తయ్యాక నేను వెళ్తానని చెప్పిన వెంటనే ‘ఛార్జీలకు డబ్బులున్నాయా?’ అని ఎంతో ఆప్యాయంగా అడిగేవారు. తొలినాళ్లలో కొన్నిసార్లు రాష్ట్ర కార్యాలయం నుండి ఇప్పించారు కూడా!
రాజకీయ విషయాల్లో యువ కార్యకర్తలకు వచ్చిన సందేహాలు తీర్చడంలోనూ ఆయనది ప్రత్యేకమైన శైలి. ఎవరైనా ఉత్తరం రాస్తే ఆయన స్వహస్తాలతో కుదురైన గొలుసుకట్టు రాతలో సమాధానాన్ని పోస్టుకార్డుపై రాసేవారు. సందేహాలు పటాపంచలైపోయేవి. అది మహాసభలో కానీ జనరల్‌బాడీ సమావేశాల్లో కానీ చర్చల్లో వచ్చిన అనేకానేక అంశాలను సమ్‌అప్‌ చేసి సమాధానం చెప్పడంలో ఎంహెచ్‌ ఒరవడే వేరు! ఆయన చూపిన బాటలో నడిచి, ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయడమే కామ్రేడ్‌ ఎంహెచ్‌ కి మనం ఇచ్చే నివాళి. జోహార్‌ కామ్రేడ్‌ ఎంహెచ్‌!

బి తులసీదాస్‌

➡️