ఇవిఎంలపై అనుమానాలు

Jun 26,2024 21:15

ప్రజాశక్తి-సాలూరు: ఎన్నికల్లో ఇవిఎంల వినియోగంపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఉందని మాజీ డిప్యూటీ సిఎం రాజన్నదొర అభిప్రాయ పడ్డారు. జాతీయ స్థాయిలో ఇవిఎంలపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలు, సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుని పోరాడాలని వైసిపి అధిష్టానాన్ని కోరారు. బుధవారం పట్టణంలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ఇవిఎంల పనితీరుపై అనేకమంది నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు కూడా తనకు ఫోన్‌ చేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎక్స్‌ సోషల్‌ మీడియా కంపెనీ యజమాని ఎలాన్‌ మస్క్‌ బలంగా అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. ఇవిఎంలను ఇప్పుడున్న టెక్నాలజీతో హ్యాకింగ్‌ చేయొచ్చునని ఎలాన్‌ మస్క్‌ గట్టిగా అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. 2019 ఎన్నికల తరువాత మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపికి చెందిన ఐటి నిపుణులు కూడా ఇవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. దేశంలో 20 లక్షల ఇవిఎంలు కనిపించడం లేదని కొన్ని రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయని చెప్పారు. మాజీ ఎమ్‌పి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కూడా 20 లక్షల ఇవిఎంలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారని గుర్తుచేశారు. ఇవిఎంలపై రాజకీయ పార్టీల గుర్తుల్లో బిజెపి, టిడిపి గుర్తులు స్పష్టంగా కనిపించాయని, వైసిపి గుర్తు ఫ్యాన్‌ చాలా మసకగా కనిపించిందని చెప్పారు. దీనివల్ల చాలామంది అయోమయానికి గురై ఫ్యాన్‌కి బదులుగా నోటాకి ఓటు వేశారని చెప్పారు. ఫ్యాన్‌ గుర్తును పోలిన విధంగా నోటా ఉండడం, అది మసకగా కనిపించడంతో పార్టీకి నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇవిఎంల పనితీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలను దృష్టిలో పెట్టుకొని తగిన ఆధారాలు సేకరించి న్యాయ పోరాటం చేయాలని వైసిపి అధిష్టానానికి సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలలో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలు నివృత్తి చేసేలా, భరోసా కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో వైసిపి పాచిపెంట మండల సీనియర్‌ నాయకులు పి.చినబాబు, మాజీ కౌన్సిలర్‌ తాడ్డి శంకరరావు, వైసిపి నాయకులు మద్దిల గోవిందరావు పాల్గొన్నారు.

➡️