ఏకపార్టీ వ్యవస్థ ఏర్పాటే ధ్యేయం ! – ప్రతిపక్షాలే లక్ష్యం

కాంగ్రెస్‌, మరికొన్ని ప్రతిపక్ష పార్టీల నుండి ఫిరాయింపులు జరిపేందుకు బిజెపి పూర్తి స్థాయిలో ఆపరేషన్‌ చేపట్టింది. నితీష్‌ కుమార్‌కి చెందిన జెడి(యు), జయంత్‌ చౌదరికి చెందిన ఆర్‌ఎల్‌డిలను బిజెపిలోకి లాక్కున్న తర్వాత, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, పలువురు నేతలు వరుసగా బిజెపిలోకి ఫిరాయిస్తున్నారు.

కేవలం గత నెల రోజుల కాలంలోనే, అస్సాంలో ఇరువురు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు రాష్ట్ర బిజెపి ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. వారిలో ఒకరు అస్సాం కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా వున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ బిజెపిలోకి ఫిరాయించారు. రాజస్థాన్‌లో, నాలుగుసార్లు ఎంఎల్‌ఎ, కాంగ్రెస్‌ గిరిజన నేత మహేంద్రజీత్‌ సింగ్‌ మాలవీయ అకస్మాత్తుగా బిజెపితో సైద్ధాంతిక అనుబంధాన్ని పెంచుకున్నారు. గుజరాత్‌లో అసెంబ్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌తో సహా ఇద్దరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు బిజెపిలో చేరారు. పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ ఎంపి, ఐదుసార్లు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపి, గిరిజన నేత నారన్‌ రత్వా, ఆయన కుమారుడు వీరిని అనుసరించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో, బిజెపిలోనే ఫిరాయింపుదారులు వున్నారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పిపి)కి చెందిన మరో ఇద్దరు ఎంఎల్‌ఎలతో కలిసి బిజెపిలో చేరారు. బీహార్‌లో, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇద్దరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు, ఆర్‌జెడి ఎంఎల్‌ఎ పాలక పక్షం వైపునకు మళ్లారు. అంతకు ముందు విశ్వాస పరీక్ష సందర్భంగా ముగ్గురు ఆర్‌జెడి ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయించారు. జార్ఖండ్‌లో ఏకైక కాంగ్రెస్‌ ఎంపి గీతా కొడా బిజెపిలో చేరారు.

నేతలు మరిన్ని అవకాశాల కోసమే ఈ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని భావిస్తే అదొక పొరపాటే అవుతుంది. కాంగ్రెస్‌ను మొత్తంగా ధ్వంసం చేయడానికి మరీ ముఖ్యంగా బిజెపికి ప్రధాన ప్రతిపక్షంగా వున్న రాష్ట్రాల్లో నాశనం చేయడానికి, అలాగే యావత్‌ ప్రతిపక్షాలను బలహీనపరచడానికి ఉద్దేశించబడిన ఫిరాయింపుల పర్వంలో ఇదొక భాగంగా జరుగుతోంది.

కాంగ్రెస్‌, కొంతమంది ప్రతిపక్ష నేతలను బిజెపిలోకి ఫిరాయించేలా, ఆ పార్టీలో చేరేలా బిజెపి ద్వంద్వ ఎత్తుగడలకు పాల్పడుతోంది. ఇందుకోసం బలవంతపు చర్యలను ఉపయోగించడం, రాయితీల ఆశ చూపడం- అంటే బెదిరించడం, ప్రలోభ పెట్టడం రెండూ ప్రయోగిస్తోంది. ఇందులో బెదిరింపు అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను నేతలకు గురిపెట్టడం, ఇక ప్రలోభపెట్టడమంటే నేతలపై గల అన్ని అవినీతి ఆరోపణల నుండి విముక్తిని ప్రసాదించడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లు ఇవ్వడం, పెద్ద మొత్తంలో ఉదారంగా డబ్బులు ఇవ్వడం వంటివి వున్నాయి. బిజెపిలో చేరడం వల్ల కలిగే లాభాలను కనుగొన్న వారిలో అనేకమంది అవినీతికి సంబంధించిన కేసులను లేదా దర్యాప్తును ఎదుర్కొంటున్న వారే. ఇందుకు అశోక్‌ చవాన్‌ ప్రధాన ఉదాహరణ. ఆదర్శ్‌ గృహ నిర్మాణ కుంభకోణంలో ఆయన నిందితుడుగా వున్నారు. అంతకుముందు, ఎన్‌సిపిలో చీలిక వచ్చి విడిగా పార్టీ ఏర్పాటు చేసిన వారిలో అనేకమంది నాయకులు, బిజెపితో చేతులు కలిపిన వారు అందరూ ఇ.డి చేపట్టిన అనేక కేసుల దర్యాప్తులను ఎదుర్కొంటున్న వారే. ఇతరులకు సంబంధించి, ఇక ఈ ప్రోత్సాహకాలన్నీ కూడా పూర్తిగా బేరసారాలతో కూడినవే. తమకు, తమ కుటుంబ సభ్యులకు మరిన్ని మెరుగైన అవకాశాల కోసమే వారు బిజెపిలో చేరారు.

ఇడి, సిబిఐ వంటి బెదిరింపు, బలవంతపు ఎత్తుగడలకు కూడా లొంగని వారికి జైలు ఊచలు వేచి చూస్తుంటాయి. జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా వున్న హేమంత్‌ సోరెన్‌ విషయంలో జరిగింది అదే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు బెదిరింపులు కూడా అవే.

ప్రతిపక్షాన్ని మొత్తంగా నిర్మూలించి, ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పాలన్నదే బిజెపి నాయకత్వ లక్ష్యంగా వుంది. ‘అస్సాంలో నిజమైన ప్రతిపక్షమంటూ ఏమీ లేదు’ అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వా శర్మే స్వయంగా వ్యాఖ్యానించారు. ఎంఎల్‌ఎలందరూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మద్దతునిచ్చే రాష్ట్రం ఇదే కానుందంటూ ఆయన ప్రగల్బాలు పలికారు.

హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో జరిగింది చూస్తే ఇదంతా కూడా ఒక మాస్టర్‌ ప్లాన్‌ అని, దాని ప్రకారమే బిజెపి వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది.

ఉత్తరాదిన ఏకైక కాంగ్రెస్‌ ప్రభుత్వం వున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో 68మంది సభ్యులు గల అసెంబ్లీలో 40మంది కాంగ్రెస్‌కు చెందినవారు కాగా, 25మంది బిజెపికి చెందినవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతునిచ్చే ముగ్గురు ఇండిపెండెంట్లు వున్నారు. అయినా కూడా ఇక్కడ బిజెపి అభ్యర్ధి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరుగురు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు, ముగ్గురు ఇండిపెండెంట్లు బిజెపి అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో, అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంలో సుఖు ప్రభుత్వం ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడింది.

ఉత్తరప్రదేశ్‌లో, 10 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా, సమాజ్‌వాదీ పార్టీకి అసెంబ్లీలో బలాన్ని బట్టి మూడు సీట్లు గెలుచుకోవచ్చు, కానీ ఎస్‌పికి చెందిన ఏడుగురు ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయించి బిజెపికి ఓటు వేశారు. వీరిలో ఎస్‌పి చీఫ్‌ విప్‌ కూడా వున్నారు. ఆ రకంగా బిజెపి అదనంగా రెండు రాజ్యసభ స్థానాల్లో గెలుపొందింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ముప్పుగా కూడా మారింది.

ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీకి, దాని నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగించింది. బిజెపి అవినీతికర విన్యాసాలను ఎవరైనా నిరసించవచ్చు, కానీ తన కార్యకర్తల్లో, నేతల్లో ఏం జరుగుతోందో తెలుసుకోలేనంతగా కాంగ్రెస్‌ ఎలా నిద్రపోతోందన్నది ఇక్కడ ప్రశ్నగా వుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా పార్టీ విభజించిన ఇల్లుగానే కొనసాగుతోందనేది స్పష్టమైంది.

కమల్‌నాథ్‌ లైక్స్‌్‌ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత దుస్థితి మరింత బాగా అర్ధమైంది. సీనియర్‌ నేత, పైగా మధ్యప్రదేశ్‌లో పార్టీకి సారధ్య బాధ్యతల్లో వున్న వ్యక్తి బాహాటంగానే హిందూత్వ ప్రమాణాలను ప్రశంసించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత, బిజెపితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయన సుముఖత చూపారు. కారణాలేమైనా కానీ అక్కడ పనవ్వలేదు. కాంగ్రెస్‌ నేతల్లో ఇలాంటి వైఖరి, పరిస్థితి వుంటే, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌కి వ్యతిరేకంగా ధృఢమైన, తీవ్రమైన పోటీ ఎన్నటికీ ఇవ్వలేదు.

బిజెపిని ఎదుర్కొనాలంటే హిందూత్వ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సాహసోపేతమైన, నిలకడతో కూడిన పోరాటాన్ని సౖౖెద్ధాంతికంగా, రాజకీయంగా చేయాల్సి వుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇదొక అస్తిత్వ పోరాటమని ప్రతిపక్ష పార్టీలు గ్రహించాలి. రాబోయే ఎన్నికల సందర్భంగా మతోన్మాద-కార్పొరేట్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా, వారి వల్ల ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ప్రమాదానికి వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రచారాన్ని చేపట్టాలి. తద్వారా మాత్రమే ప్రజలను చైతన్యవంతులను చేసి బిజెపిని ఓడించగలుగుతాం.

  • (ఫిబ్రవరి 28 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)
➡️