ఎన్ని బాంబులు వేస్తే అంతగా లాభాలు !

Feb 7,2024 07:10 #Editorial

గత సంవత్సరం అమెరికా విదేశాలకు అమ్మిన ఆయుధాల విలువ 238 బిలియన్‌ డాలర్లు. ఉక్రెయిన్‌ సంక్షోభం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా తేలింది. ఐరోపాలోని అనేక దేశాలు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి కొత్తవాటిని కొనుగోలు చేస్తున్నాయి. ఐరోపా వెలుపల ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌, కెనడా, కతార్‌ తదితర దేశాలు ఎక్కువగా కొనుగోలు చేశాయి. ఆయుధాల అమ్మకం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇస్తున్నది. అమెరికా ప్రభుత్వం నేరుగా అమ్ముతున్న ఆయుధాలు, మిలిటరీ సేవల విలువ 2022తో పోలిస్తే గతేడాది 51.9 బి.డాలర్ల నుంచి 80.9కి పెరిగింది. ఆయుధ వ్యాపారులు నేరుగా అమ్మిన వాటి విలువ 157.5 బి.డాలర్లు. ప్రభుత్వమే నేరుగా ఆయుధ వ్యాపారం చేస్తున్నదంటే యుద్ధాలను ప్రోత్సహించే విదేశాంగ విధానాలను మరింతగా కొనసాగిస్తున్నదనేందుకు సూచిక.

                 ‘అక్కడ మిగిలిందేమీ లేదు’ ఐరాస సహాయ సంస్థ గాజాలో పరిస్థితి గురించి తాజాగా చెప్పిన మాట ఇది. ఇజ్రాయిల్‌ ధ్వంసంగావించిన తమ ఆసుపత్రి చిత్రాన్ని చూపుతూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. ఇజ్రాయిల్‌ నౌకల నుంచి జరుపుతున్న దాడుల కారణంగా తమ ఆహార సరఫరా వాహనాలకు ఆటంకం కలుగుతున్నదని సంస్థ డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నాడు. గాజాలో బందీలకు బదులుగా ఇజ్రాయిల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా వాసుల విడుదల గురించి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ మధ్య ప్రాచ్య దేశాల పర్యటనలో ఉన్నాడు. అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు గాజాలో 27,478 మందిని హత్య చేసిన ఇజ్రాయిల్‌ 66,835 మందిని గాయపరచింది. వారిలో 70 శాతం పైగా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఇరాక్‌, సిరియా, ఎమెన్‌లపై దాడులకు పూనుకున్న అమెరికా యుద్ధాన్ని విస్తరిస్తున్నదని భద్రతా మండలిలో రష్యా విమర్శించింది. తమ దాడులు ఆరంభం మాత్రమేనని అమెరికా అంతకు ముందు ప్రకటించింది. నాటోతో కలసి తమకు ముప్పు తలపెట్టిన ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 713వ రోజుకు చేరుకుంది. ఎంతగా వర్షాలు పడితే అంతగా పంటలు పండుతాయని రైతాంగం, జనం మురిసిపో తారు. కానీ యుద్ధోన్మాదులకు ఎన్ని బాంబులను కురిపిస్తే అంతగా లాభాలు వస్తాయని చరిత్ర రుజువు చేసింది. అందుకే ఏక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధాల వరకు కొనిపోవటం నిత్యకృత్యంగా మారింది. ఐరోపాలో ఉక్రెయిన్‌ సంక్షోభం, మధ్య ప్రాచ్యంలో గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండ సారమిదే. 1990 దశకంలో ప్రచ్ఛన్న యుద్ధంలో తామే గెలిచామని అమెరికా ప్రకటించుకున్నప్పటికీ వర్తమానంలో తిరిగి నాటి పరిస్థితిని అది సృష్టిస్తున్నది. దాని విదేశాంగ విధాన వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ ప్రపంచ మిలిటరీ ఖర్చు కూడా పెరుగుతున్నది. ఎనిమిది సంవత్సరాల వరుస పెరుగుదలలో 2022లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.24 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.

గత సంవత్సరం అమెరికా విదేశాలకు అమ్మిన ఆయుధాల విలువ 238 బిలియన్‌ డాలర్లు. ఉక్రెయిన్‌ సంక్షోభం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా తేలింది. ఐరోపాలోని అనేక దేశాలు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి కొత్తవాటిని కొనుగోలు చేస్తున్నాయి. ఐరోపా వెలుపల ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌, కెనడా, కతార్‌ తదితర దేశాలు ఎక్కువగా కొనుగోలు చేశాయి. ఆయుధాల అమ్మకం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇస్తున్నది. అమెరికా ప్రభుత్వం నేరుగా అమ్ముతున్న ఆయుధాలు, మిలిటరీ సేవల విలువ 2022తో పోలిస్తే గతేడాది 51.9 బి.డాలర్ల నుంచి 80.9కి పెరిగింది. ఆయుధ వ్యాపారులు నేరుగా అమ్మిన వాటి విలువ 157.5 బి.డాలర్లు. ప్రభుత్వమే నేరుగా ఆయుధ వ్యాపారం చేస్తున్నదంటే యుద్ధాలను ప్రోత్సహించే విదేశాంగ విధానాలను మరింతగా కొనసాగిస్తున్నదనేందుకు సూచిక. ఆయుధాలను అమ్ముతూ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన రష్యాను దెబ్బ తీసేందుకే తామీపని చేస్తున్నట్లు చెప్పుకొంటున్నది. పుతిన్‌ దళాల నుంచి ఐరోపాను రక్షించే పేరుతో ఉక్రెయిన్‌కు 50 బిలియన్‌ డాలర్ల నిధులు ఇవ్వాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది. అక్టోబరు ఏడున గాజాపై మారణకాండను ప్రారంభించిన ఇజ్రాయిల్‌ చర్య కూడా మిలిటరీ ఖర్చు, ఆయుధ విక్రయాలు పెరిగేందుకు దారి తీస్తున్నది.

అమెరికా తన ఆయుధాలను ఇతర ప్రాంతాలలో నేరుగా ప్రయోగించి వాటి పనితీరును ఎలా పరీక్షిస్తున్నదో ఇజ్రాయిల్‌ కూడా తన ఆయుధాలు, నిఘా పరికరాలను గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలలో పాలస్తీనియన్లు ప్రయోగ సమిధలుగా వాడుకుంటున్న దుర్మార్గానికి పాల్పడుతున్నది. హైఫా నగర కేంద్రంగా ఉన్న ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌ అనే సంస్థ తాను రూపొందించిన ఐరన్‌ స్టింగ్‌ అనే మోర్టార్‌ బాంబు ఎలా పని చేసేదీ 2021 నుంచి తన వెబ్‌సైట్‌లో ప్రచారం చేసుకుంటున్నది. గాజాలో ఇప్పుడు హమాస్‌ను అణచే పేరుతో వాటిని ప్రయోగించి చూస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో కూడా నిర్ణీత లక్ష్యాలను చేరే విధంగా వీటిని తయారు చేశారు. గాజా జనసమ్మర్ధం గల పట్టణ ప్రాంతమన్నది తెలిసిందే. గురి తప్పకుండా ఇక్కడ లక్ష్యాలను చేరితే ప్రపంచవ్యాపితంగా ఎవరికి కావాల్సివస్తే వారికి అమ్మేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగాల్లో మారణకాండను సృష్టించిన అనేక ఆయుధాలను ఇప్పుడు ఇజ్రాయిల్‌ ఎగుమతి చేస్తున్నది. అలాంటి వాటిలో ఏకంగా నలభై గంటల పాటు ప్రయాణించి నాలుగు క్షిపణులను మోసుకుపోగల ఇటాన్‌ అనే డ్రోన్‌ను ఇజ్రాయిల్‌ 2007లో గాజా పౌరుల మీద ప్రయోగించింది, అప్పుడు కూడా వీటి దాడిలో పిల్లలే ఎక్కువగా మరణించారు. ఇప్పుడు వాటిని భారీగా విక్రయిస్తున్నది. మన దేశం వందకు పైగా వీటిని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయిల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్న 130కి పైగా దేశాలలో కొలంబియా ఒకటి. అక్కడి అధ్యక్షుడు గుస్టావ్‌ పెట్రో గాజాలో జరుపుతున్న మారణకాండను ఉగ్రవాదంగా వర్ణిస్తూ ఖండించాడు. దాంతో కొలంబియాకు ఆయుధ విక్రయాలను ఇజ్రాయిల్‌ నిలిపివేసింది. ఆయుధ వ్యాపార ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ఆమోదించలేదు. మారణకాండ, మానవాళిపై నేరాలకు పాల్పడేవారికి ఆయుధాల విక్రయాన్ని ఆ ఒప్పందం నిషేధిస్తున్నది. అందువలన ఇజ్రాయిల్‌ జరిపే లావాదేవీలన్నీ రహస్యంగానే ఉంటాయి. ఎవరు, ఎవరికి అమ్మిందీ చెప్పదు, కొనుగోలు చేసిన వారు కూడా వెల్లడించరని 2019లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. అందువలన లావాదేవీలు ఎంత అన్నది కూడా అంచనా కష్టం. దక్షిణాఫ్రికాలో స్థానిక ఆఫ్రికన్‌ జాతీయులను అణచివేసిన జాత్యహంకార పాలకులకు విక్రయించింది. అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఇచ్చేందుకు సిద్ధపడినట్లు బహిర్గతం కావించిన పత్రాలు వెల్లడించాయి. ఎల్‌ సాల్వడార్‌లో తిరుగుబాటుదార్లను అణచివేసేందుకు అక్కడి నియంతలకు నాపాం బాంబులు, ఇతర ఆయుధాలను విక్రయించింది, వాటితో 75 వేల మంది పౌరులు మరణించారు. ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన రువాండా మారణకాండలో కూడా ఇజ్రాయిల్‌ తయారీ తుపాకులు, బుల్లెట్లు, గ్రెనేడ్‌లు వాడినట్లు తేలింది. బోస్నియా మీద దాడులు చేసిన సెర్బియాకూ, మయన్మార్‌ మిలిటరీ పాలకులకూ, అజర్‌బైజాన్‌కూ ఆయుధాలను విక్రయించింది. అమెరికా, ఐరోపా దేశాల మాదిరి ఎలాంటి ఆంక్షలనూ విధించదు గనుక ఇజ్రాయిల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలని 2018లో నాటి ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ప్రకటించాడు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఆయుధాలను విక్రయించవచ్చు. ప్రస్తుతం గాజాలో మరణించిన, గాయపడిన పాలస్తీనియన్లను పరీక్షించినపుడు కాలిన, ఇతర గాయాలను చూసినపుడు అవి ఎలా జరిగాయన్నది వైద్యులకు సమస్యగా మారింది. గతంలో ఇలాంటి వాటిని చూడలేదని చెప్పారు. దీన్ని బట్టి కొత్త ఆయుధాలను ప్రయోగించారని అనుమానిస్తున్నారు.

యుద్ధం అనేక అనర్ధాలకు మూలం అవుతున్నది. ప్రత్యక్షంగా ఎన్ని ప్రాణాలు పోతాయో, ఎంత మంది దిక్కులేనివారౌతారో, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతాయో, ఎంత బాధ, వేదన కలుగుతుందో చెప్పలేము. పరోక్షంగా జనాల మీద ప్రత్యేకించి కష్టజీవుల మీద విపరీత భారాలను మోపుతుంది. కార్పొరేట్‌ మీడియా వార్తలను ఇస్తుంది తప్ప అది యుద్ధానికి వ్యతిరేకం కాదు. ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండను ఆత్మరక్షణ పేరుతో సమర్థిస్తున్న వారికి మద్దతు ఇస్తున్నది. రష్యాకు నాటో తలపెట్టిన ముప్పును మూసిపెట్టి అది జరుపుతున్న సైనిక చర్య మీద చిలవలు పలవలుగా వార్తలు ఇస్తున్నది. దీనంతటికి అమెరికా, దాన్ని సమర్ధించే దేశాల లాభాల కాంక్ష, యుద్ధోన్మాదమే కారణం. ఏ నేతా శాంతి వచనాలు వల్లించటంలో వెనుకబడటం లేదు. ఆచరణలో ఏదో ఒక సాకుతో మిలిటరీ ఖర్చు పెంచుతున్నారు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను మాత్రమే బూచిగా చూపే వారు, ఇప్పుడు రష్యా, చైనాలను పేర్కొంటూ ఆయుధాలను మరింత ఎక్కువగా అంటగట్టేందుకు పూనుకున్నారు. 2020లో డెమోక్రటిక్‌ పార్టీ మిలిటరీ ఖర్చును తగ్గిస్తామని చెప్పింది. గతంలో రిపబ్లికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి జో బైడెన్‌ అధికారానికి వచ్చిన తరువాత ప్రతి ఏటా పెంచి మరోసారి ఎన్నికలకు సిద్ధమౌతున్నాడు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ యుద్ధాలను రెచ్చగొట్టటం, ఆయుధాల వ్యాపారం, లాభాలు పిండుకోవటం మామూలే. మిలిటరీ ఖర్చు విషయానికి వస్తే 230 దేశాల్లో ఒక్క అమెరికా చేస్తున్న ఖర్చు 227 దేశాల మొత్తాని కంటే ఎక్కువ. ఆయుధాల ఎగుమతుల్లో కూడా అదే విధంగా ఉంది. నాటో దేశాలు మిలిటరీ ఖర్చును పెంచాలని డోనాల్డ్‌ ట్రంప్‌ తెచ్చిన ఒత్తిడిని జో బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా చేస్తున్న ఖర్చులో రష్యా మొత్తం పదిశాతం కంటే తక్కువే.

తాము ఎదురులేని శక్తి అని విర్రవీగుతున్న అమెరికాకు ప్రతి చోటా పరాభవమే మిగులుతోంది. దాన్ని నమ్మితే ఇంతే సంగతులని అనేక దేశాలు అంతర్గతంగా భావిస్తున్నప్పటికీ మిలిటరీ శక్తిగా ఉన్నందున భయపడుతున్నమాట వాస్తవం. చైనా, రష్యాల ముందు అమెరికా పప్పులుడకవని తేలిపోయింది. ఈ పూర్వరంగంలోనే ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందని చెప్పి నాటోను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే చెబుతూ రష్యాను చుట్టుముట్టేందుకు పూనుకున్నారు. దాన్ని మరింత బలపరుస్తున్నారు. మరోవైపు చైనా నుంచి ఆసియాకు ముప్పు అని ఏ క్షణంలోనైనా తైవాన్‌ను ఆక్రమిస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఈ దశాబ్ది చివరికి చైనా వెయ్యి అణ్వాయుధాలను సమకూర్చుకోనుందని అమెరికా రక్షణ శాఖ తప్పుడు నివేదికలను ప్రచారంలో పెట్టింది. ఇవన్నీ ‘చైనా ప్రపంచ మిలిటరీ శక్తిగా ఎదుగుతోంది జాగ్రత్త’ అని ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలను ఆయుధ పోటీకి ప్రోత్సహించే ఒక వ్యూహంలో భాగమే. అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పు అన్నది నిజం, ముందుగా ఎవరు మీట నొక్కినా కొద్ది క్షణాల్లో ఇతరులు కూడా అదేపని చేస్తారన్నది కూడా తెలిసిందే. అదే జరిగితే ప్రపంచం మిగలదు. ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర దేశాలన్నీ తమ మీద కుట్ర చేస్తున్నట్లు, ముప్పు తలపెట్టినట్లు స్వజనాన్ని నమ్మించటం అమెరికా నిత్యకృత్యాలలో ఒకటి. ఆ పేరుతో అన్ని ఖండాలలోని 80 దేశాలలో 800కు పైగా చిన్నా, పెద్ద సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంటే ఎక్కడికైనా కొద్ది గంటల్లోనే తన మిలిటరీని దింపగలదు. ఇంతవరకు అమెరికా మీద దాడి చేసిన దేశం ఒక్కటంటే ఒక్కటీ లేదు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1,776 నుంచి ఇప్పటి వరకు అమెరికా 68 దేశాల మీద దాడి చేసింది. అందువలన ముప్పు అమెరికా నుంచి రావాలి తప్ప మరొక దేశం నుంచి వచ్చే అవకాశమే లేదు.

ఎం. కోటేశ్వరరావు
ఎం. కోటేశ్వరరావు
➡️