అంగన్‌వాడీల పోరాట ఘనవిజయం

Jan 27,2024 07:15 #Editorial

అంగన్‌వాడీలు గత రెండేళ్ళల్లో హర్యానా, ఢిల్లీ, బీహార్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మంచి పోరాటాలను నడిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్మా ప్రయోగించినా ఎదిరించి విజయం సాధించేవరకు పోరాడారు. దేశవ్యాప్తంగా జరిగిన అంగన్‌వాడీల సమ్మెలన్నింటిలో ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన ఒప్పందం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌జిఓలకు పిఆర్‌సిలో కోత వేసింది. విద్యుత్‌ ఉద్యోగులను దగా చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ అమలు చేస్తామన్న మాట తప్పింది. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీలు సాధించుకున్న విజయం సాపేక్షంగా మెరుగైనది. అంగన్‌వాడీ పోరాట అనుభవాలను యావత్తు కార్మికవర్గం ఆదర్శంగా తీసుకుందాం.

డిచిన డిసెంబరు 12 నుండి 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేసిన నిరవధిక సమ్మె పోరాటం చారిత్రాత్మక విజయం సాధించింది. లక్షా 5 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు, మినీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపారు. దశలవారీగా రోజు రోజుకు పోరాటాన్ని ఉధృతం చేసి రాష్ట్ర బంద్‌ పిలుపునకు కూడా సిద్ధమయ్యారు. 24 గంటల దీక్షలు చేశారు. నాయకత్వం నిరవధిక దీక్షలకు దిగింది. ఈ విధంగా అన్ని రకాల పోరాటాలను ప్రభుత్వానికి రుచి చూపారు. ఎన్ని రోజులైనా పోరాటం సాగించాలని నిర్ణయించారు. సమస్యలు పరిష్కరించేవరకూ ‘తగ్గేదే లేదని’ ప్రభుత్వాన్ని పదేపదే హెచ్చరించారు. అంగన్‌వాడీల అకుంఠిత దీక్ష, పట్టుదల ఈ పోరాట విజయానికి కీలకం. పైగా లబ్ధిదారుల, ప్రజల మద్దతు విస్తృతంగా లభించింది. ఇదే కాలంలో రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికులు 12 రోజులపాటు సమరశీల పోరాటం నడిపారు. వారి పట్టదలకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఒప్పందం చేసింది. అంతేగాక, ఎస్‌ఎస్‌ఎ కార్మికులు ఈ కాలంలో జరిపిన సమరశీల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వారితో ఒప్పందం చేయవలసి వచ్చింది. పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గమని మరోమారు నిరూపితమైంది.

జనవరి 22 ఒప్పందం జరిగే రోజు వరకూ పోలీసుల జోక్యం లేకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేస్తే అంగన్‌వాడీలు మరింతగా తిరగబడతారని ప్రభుత్వానికి తెలుసు. జగనన్నకు కోటి సంతకాలు సమర్పించడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యమం తారాస్ధాయికి చేరింది. ప్రభుత్వం దిగి వచ్చింది. అన్ని క్రమశిక్షణా చర్యలూ ఆగిపోయాయి. షోకాజ్‌లు, టెర్మినేషన్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. కార్మికులు నూరు శాతం డ్యూటీలో చేరారు. డిమాండ్లు సాధించారు. పోలీస్‌ కేసులు ఎత్తివేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. మైలవరంలో పోలీసు కేసుల్లో వున్న అంగన్‌వాడీలతో సహా రాష్ట్రమంతటా అంగన్‌వాడీలు డ్యూటీలో చేరారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరిగిన అంగన్‌వాడీల పోరాటాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన విజయం సాధించారని అఖిల భారత అంగన్‌వాడీ నాయకులు ఎ.ఆర్‌.సింధు కొనియాడారు.

అంగన్‌వాడీలు ఎన్ని రోజులు పోరాడతారో చూద్దామని ఆరు సార్లు చర్చలు జరుపుతూ జాప్యం చేసే ఎత్తుగడ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఎ.పి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఇచ్చిన ప్రతి పిలుపునకు కార్మికులు స్పందించారు. కార్మికుల్లో 90 శాతం బలం వున్న సిఐటియు ఇతర ఎఐటియుసి, ఐఎఫ్‌టియు యూనియన్‌లను ఐక్య కార్యచరణతో కలుపుకున్నారు. విజయం సాధించేవరకూ ఎన్ని రోజులైనా పోరాడతామని రుజువు చేశారు. ఆదర్శప్రాయమైన ఈ పోరాటాన్ని అభినందించాలి. అంగన్‌వాడీలు ప్రతి రోజూ చార్జీలు పెట్టుకొని మారుమూల గ్రామాల నుండి వచ్చి సమ్మె శిబిరంలో కూర్చొన్నారు. కొంత మంది కార్మికుల ఇళ్ళల్లో భర్తలు కొట్టినా తిరగబడి సమ్మెల్లో పాల్గొన్నారు. ప్రతి ప్రాజెక్టులో తమ సొంత డబ్బులు పెట్టుకొని శిబిరాలు నడుపుకున్నారు. బయట రాజకీయ నాయకులు పోరాటానికి డబ్బులు ఇస్తామన్నా తిరస్కరించారు.

కార్మికులు ఏం సాధించారు ?

  • సమ్మె ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు ‘డబ్బులు పెంచం’ అని జనవరి 22 వరకూ ఒకే మొండి వైఖరి తీసుకున్నది. పోరాట ఫలితంగా మెరుగైన వేతనాన్ని యూనియన్‌లతో చర్చించి 2024 జులై నుంచి అమలు జరుపుతామని జనవరి 22వ తేదీ రాత్రి జరిగిన చర్చల్లో అంగీకరించడం ఈ పోరాట విజయంలో కీలకం. లక్ష మంది అంగన్‌వాడీలకు జీతాలు పెంచితే మరో 2 లక్షల మంది స్కీమ్‌ కార్మికులకు పెంచవలసి వస్తుందని ప్రభుత్వ వాదన. వేతనాల పెంపు ఒప్పందంలో అంకెలు కానరావు. కానీ ఈ ఒప్పందం వలన ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా యూనియన్లతో తప్పక చర్చించి 2024 జులై నుండి వేతనాలు పెంచాలి.
  • సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్‌మెంట్‌ అయిన తరువాత వర్కర్‌కు ఇచ్చే గ్రాట్యూటీ తక్షణం రూ. 1.20 లక్షలు (తెలంగాణలో లక్ష), ఆయాకు రూ. 60 వేలు (తెలంగాణలో 50 వేలు) ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యూటీ చెల్లించడానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్‌ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో చట్ట ప్రకారం మిగిలిన సుమారు రూ.50 వేలు కూడా పెంచుతామని అంగీకరించారు.
  • రాష్ట్రంలో 5,600 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మినీ అంగన్‌వాడీలను ‘మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు’గా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అంగీకరించాయి. ఇది 30 సంవత్సరాల డిమాండ్‌. జనాభా పెరిగినా మినీ సెంటర్లను ఇప్పటి వరకూ మార్చలేదు. ఇప్పుడు మినీ వర్కర్లుగా వున్న వారందరూ వర్కర్లుగా మారతారు. వారి జీతం నెలకు రూ.7 వేల నుండి నేరుగా రూ.11,500కు పెరుగుతుంది. జులై నుండి పెరిగే జీతం కూడా వారికి అదనంగా వస్తుంది. సుమారు 5 వేల మంది కొత్త వారికి ఆయాలుగా ఉద్యోగాలు వస్తాయి. ఇది మంచి విజయం.
  • అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు, మినీ వర్కర్లందరికీ రిటైర్‌మెంట్‌ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలుగా మారుతుంది. అంగన్‌వాడీలందరికీ 2 సంవత్సరాలు అదనంగా పని చేసే హక్కు లభించడంతోపాటు జీతాలు పెరగడంవలన వారి జీవితాలు మెరుగవుతాయి. ప్రభుత్వ ఇతర విభాగాలలో పని చేసే ఉద్యోగులు కూడా రిటైర్‌మెంట్‌ వయస్సు పెంచాలన్న ఏకైక డిమాండ్‌తో పోరాడుతున్నారు. వారు సాధించలేనిది అంగన్‌వాడీలు పోరాటం వలన సాధించుకున్నారు.
  • అంగన్‌వాడీ హెల్పర్ల ప్రమోషన్‌ వయస్సు 45 నుండి 55 సంవత్సరాలకు పెంచడానికి ప్రభుత్వం జివో ఇచ్చింది. ఇప్పటి వరకూ ఆయాలకు ప్రమోషన్‌ వయస్సు అడ్డం వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకున్నారు.
  • అంగన్‌వాడీ వర్కర్లు ప్రతి నెలా ప్రాజెక్టు మీటింగ్‌లకు వెళ్ళడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు 2017 నుండి ప్రభుత్వాలు ఎగ్గగొట్టాయి. ఇప్పటి నుండి చెల్లించడానికి జివో వచ్చింది. అంతేకాకుండా గతంలో లేనిది ఆయాలకు రెండు నెలలకు ఒకసారి మీటింగ్‌లకు వెళ్ళడానికి రవాణా చార్జీలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం జివో ఇచ్చింది. పాత బాకీలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
  • సర్వీస్‌లో చనిపోయిన అంగన్‌వాడీల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సర్వీస్‌లో మరణించిన వారి కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ బీమా అమలు చేస్తారు. చనిపోయిన వారి కుటుంబాలకు దహన (మట్టి) ఖర్చులు రూ. 20,000 సాధించుకున్నారు.శ్రీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లుకు పరీక్షలు రాసిన వారికి పోస్టులు ఇవ్వడానికి లా సెక్షన్‌లో ఆమోదించారు. త్వరలో వారికి నోటిఫికేషన్‌ వస్తుంది.
  • నాలుగు యాప్‌లు కలిపి ఒక యాప్‌గా మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. మార్చి నెల నుండి అమల్లోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.శ్రీ అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్‌పై వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు, మెనూ పెంపు, గ్యాస్‌ తదితర సమస్యల పరిష్కారానికి కమిటీ వేశారు. కమిటీ సిఫార్సుల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

సమ్మె కాలపు జీతాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సమరశీల పోరాటాలు జరిగిన చోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా జీతాలు చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, టిటిడి కార్మికులతో సహా సమ్మె కాలంలో జీతాలు కోల్పోయినప్పటికీ కార్మికులు త్యాగం చేసి పోరాటాలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కార్మికులు సమ్మె కాలపు జీతాలు సాధించడం మంచి విజయం. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే మినిట్స్‌ కాపీ తయారు చేశామని తెలిపారు. మంత్రుల ఆమోదం తీసుకొని యూనియన్‌లకు తర్వలో ఇస్తారు. సంపూర్ణ సన్నాహాలు చేస్తేనే విజయం సాధిస్తామని, ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలని కార్మికులు ముందుగానే నిర్ణయించుకున్నారు. గట్టి పట్టుదలతో నిలబడ్డారు. జగన్‌ ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం సాగించారు. లబ్ధిదారుల మద్దతు కూడగట్టడం ఈ పోరాట విజయంలో ముఖ్య ఘట్టం. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు బద్దలుకొట్టడాన్ని సెంటర్లు తెరవడాన్ని లబ్ధిదారులు అడ్డుకున్నారు. మా టీచర్‌ ఆయా వస్తేనే మేము సెంటర్లకు వస్తామని పిల్లలు నిలబడ్డారు. యావత్తు కార్మికవర్గం అంగన్‌వాడీల పక్షాన నిలబడింది. రాష్ట్రంలోని కార్మిక వర్గం అంగన్‌వాడీల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 9 మరియు 20న అన్ని జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. జాతీయ రహదారిపై బైటాయింపులు చేపట్టారు. నిరసనలు తెలిపారు. నిధులు వసూళ్ళు చేసి అపూర్వ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చిన తరువాత సకాలంలో పోరాటాన్ని ముగించారు. అంగన్‌వాడీలు గత రెండేళ్ళల్లో హర్యానా, ఢిల్లీ, బీహార్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మంచి పోరాటాలను నడిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్మా ప్రయోగించినా ఎదిరించి విజయం సాధించేవరకు పోరాడారు. దేశవ్యాప్తంగా జరిగిన అంగన్‌వాడీల సమ్మెలన్నింటిలో ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన ఒప్పందం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌జిఓలకు పిఆర్‌సిలో కోత వేసింది. విద్యుత్‌ ఉద్యోగులను దగా చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ అమలు చేస్తామన్న మాట తప్పింది. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీలు సాధించుకున్న విజయం సాపేక్షంగా మెరుగైనది. అంగన్‌వాడీ పోరాట అనుభవాలను యావత్తు కార్మికవర్గం ఆదర్శంగా తీసుకుందాం.

/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /సిహెచ్‌. నరసింగరావు
/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /సిహెచ్‌. నరసింగరావు
➡️