ఈ భూ హక్కు చట్టంతో ముప్పు !

Dec 8,2023 07:18 #Editorial

న్యాయస్ధానాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి, టైటలింగ్‌ ఆఫీసర్‌ అయితే అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు పనిచేస్తారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జిల్లా కోర్టులు 151, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు 131, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు 271లతో కలిపి రాష్ట్రం మొత్తం మీద 553 సివిల్‌ కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే…ఈ 553 కోర్టుల్లో సివిల్‌ కేసులు దాఖలు చేయడానికి వీలుండదు. వీటి స్ధానంలో ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక్కో ట్రిబ్యూనల్‌ చొప్పున 26 ట్రిబ్యూనళ్లలో కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. 553 కోర్టుల్లో చేయలేని పనిని 26 ట్రిబ్యూనల్స్‌ ఎలా పరిష్కరిస్తాయో ప్రభుత్వమే ప్రజలకు చెప్పవలసి ఉంది.

              ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కుల చట్టం (ఎ.పి. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం 27/2023) అక్టోబరు 31 నుండి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నెంబరు 512 జారీ చేసింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదించడంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై న్యాయవాదులు కోర్టులు బహిష్కరిస్తున్నారు. ఈ చీకటి చట్టం నిజస్వరూపం తెలియని వారు అ చట్టం న్యాయవాదులకు నష్టమేమో అనుకొని మనకు సంబంధం లేదని ప్రజలు భావిస్తున్నారు. అసలు భూహక్కుల చట్టం అంటే ఏమిటి? ఎవరికోసం ఈ చట్టం తీసుకొచ్చారు, న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టంలో అంశాలు ఎవరికి నష్టం తదితర అంశాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా తెచ్చిన ఈ చట్ట ఉద్దేశ్యం ప్రజల స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు….ఆ వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్‌ కోర్టుల పరిధి నుండి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్ధాయి ట్రిబ్యూనల్‌కు అధికారాలివ్వడం. ట్రిబ్యూనల్‌ ఉత్తర్వులపై నేరుగా హైకోర్టుకు అప్పీలు చేసుకునే అధికారాలిచ్చారు. ఈ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించే ల్యాండ్‌ టైటలింగ్‌ అధికారి నమోదు చేసే హక్కు రిజిస్టరులో ఒక్క సారి భూహక్కు దారుడు పేరున నమోదైన తరువాత….ఎవరికైనా అభ్యంతరముంటే జాయింట్‌ కలెక్టరు నేతృత్వంలో జిల్లా స్ధాయిలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యూనల్‌లోనే తేల్చుకోవలసి ఉంటుంది. ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. ప్రపంచ బ్యాంకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే ( 2019) ప్రకారం భారత దేశం 154వ స్ధానంలో ఆస్ధి రిజిస్ట్రేషన్‌ విషయంలో ఉంది. అంతేకాక సివిల్‌ కేసుల్లో అత్యధికం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అందువల్ల ఈ సమస్య సత్వర పరిష్కారం కోసం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా ప్రభుత్వం చెపుతోంది. చట్టాలను అమలు చేసే విషయంలో భారతదేశం 163వ స్థానంలో ఉంది. అదే విధంగా సివిల్‌ కోర్టుల అధికారాన్ని తీసివేస్తే త్వరగా వ్యాపారం జరుగుతుందనే ఉద్దేశ్యంతో నీతి ఆయోగ్‌ తీసుకొచ్చిన దేశవ్యాప్త ప్రతిపాదన ఇది. మహారాష్ట్రలో ఇప్పటికే ఈ చట్టం ఉంది.

అధికార పార్టీ ఆదేశాల ప్రకారం నిర్ణయాలు తీసుకునే రెవెన్యూ అధికారులు, ఇతర యంత్రాంగం ప్రజల ఆస్తులకు, హక్కులను నిర్ణయిస్తారని, అలా నిర్ణయించిన హక్కులను టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారని, భూహక్కుదారులకు ఇది శాశ్వతంగా హక్కును కల్పిస్తుందని ఎ.పి. ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు ద్వారా చెప్పడం శోచనీయం. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు చేసిన, చేస్తున్న తప్పుడు రికార్డుల్లో చిన్న, సన్నకారు రైతులు వారి భూహక్కులను కోల్పోతూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ ఆ అధికారులకే భూములకు శాశ్వత హక్కులను కల్పించడానికి ఈ చట్టం ద్వారా అధికారాలను కట్టబెట్టడం… అదే శాశ్వతం అనడం చాలా అన్యాయం. కేవలం చిన్న, సన్నకారు రైతులు, దళిత, గిరిజన భూములను కబ్జా చేయడానికి ఈ భూహక్కుల చట్టం అవకాశమిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రకాల రికార్డులు (ఉదాహరణకు పట్టాదారు పాస్‌ బుక్‌, టైటిల్‌ డీడ్‌, అడంగళ్‌, 1బి లాంటివి) రద్దు కానున్నాయి. జాయింట్‌ కలెక్టరు హోదాకు తగ్గని టైటిలింగ్‌ ఆఫీసరు భూ యజమాని పేరున టైటిల్‌ రిజిస్టర్‌ రికార్డు చేస్తారు. ఆ భూ యజమానే శాశ్వత హక్కుదారుగా ఉంటారు. రిజిస్టర్‌లో నమోదైన వ్యక్తి భూ యజమాని కాదని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే…. టైటిల్‌ రిజిస్టరులో యాజమాని పేరు నమోదైన రెండేళ్ల లోపు జిల్లా స్ధాయి ట్రిబ్యూనల్‌లో కేసు దాఖలు చేయాలి. ఆన్‌లైన్‌లో యజమాని పేర కనిపించకపోవడం వల్ల చాలా మంది చిన్న, సన్నకారు రైతులు టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదైన రెండేళ్ల లోపు వివరాలు తెలియక శాశ్వతంగా భూమిని కోల్పోయే ఆవకాశం ఉంటుంది. జిల్లా స్ధాయిలో ఉండే ట్రిబ్యూనల్‌లో న్యాయం జరగలేదని భావిస్తే….అక్కడ తీర్పు వెలువడిన 15 రోజుల్లో రాష్ట్ర స్ధాయి ట్రిబ్యూనల్‌లో అప్పీల్‌ చేయవలసి ఉంటుంది. అక్కడ కూడా న్యాయం జరగలేదని భావిస్తే… హైకోర్టులో కేసును దాఖలు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడమనేది చిన్న, సన్నకారు రైతులకు ఆచరణలో సాధ్యమయ్యే పనికాదు. ఇదంతా జరిగే సరికి ఆస్తి కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో సి.పి.సి. (సివిల్‌ ప్రోసీజర్‌ కోడ్‌) ప్రకారం ఆయా ప్రాంతాల పరిధిలో ఉన్న కోర్టులో మనకు తెలిసిన న్యాయవాదితో భూమి హక్కును నిర్ధారణ చేసుకోవచ్చు. తాజా చట్ట ప్రకారం మనకు అందుబాటులో ఉన్న కోర్టులో కేసు వేయడానికి వీలులేదని ఈ చట్టంలో నిబంధన ఉండటం ప్రజా వ్యతిరేకం. ఈ నిబంధన వల్ల చిన్న, చిన్నకారు రైతులు…తమకు ఉండే కొద్దిపాటి భూముల విషయంలో వారి హక్కును నిర్ధారించుకోవడానికి అవకాశం లేక శాశ్వతంగా భూమిని కోల్పోవలసి ఉంటుంది. ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టిన తరువాత తీర్పులిస్తున్న కోర్టులను కాదని అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు చెప్పే మాటలు విని తీర్పులు చెప్పడానికి అవకాశం ఉన్న ట్రిబ్యూనల్స్‌ నమ్ముకోమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టం చెపుతోంది. ఈ చట్టం వల్ల చిన్న, సన్నకారు రైతులు భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయి రాచరిక పాలనకు దారి తీస్తుందనే విషయం గుర్తుంచుకోవలసి ఉంది. కనుక ఈ చట్టం ప్రమాదం..న్యాయవాదులకు కాదు, సన్న, చిన్న కారు, దళిత, గిరిజన, పేద వర్గాలకు చెందిన వారికనే విషయం గుర్తించాలి.

న్యాయవ్యవస్ధ స్వతంత్రంగా పనిచేసే విధంగా మన రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచారు. తీర్పులను త్వరగా వచ్చే విధంగా అధిక సంఖ్యలో జడ్జీలను, కోర్టులను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవ్యవస్ధను ప్రజలకు దూరం చేసి ఈ చట్టం ద్వారా భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తులు, కార్పొరేట్లకు భూములు ధారాదత్తం చేసే విధంగా… భూ హక్కు చట్టం -2023ను తీసుకురావడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అవుతుంది.

భూ యజమాని పేరును టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేయడానికి రాష్ట్ర వ్యాపితంగా ప్రతీ మండలానికి జాయింట్‌ కలెక్టర్‌ స్ధాయికి తగ్గని ఒక టైటిలింగ్‌ అధికారిని రాష్ట్ర స్ధాయిలో ఉండే ల్యాండ్‌ అథారిటీ నియమిస్తుంది. ఈ అధారిటీని అధికార పార్టీ నియమిస్తుంది. చైర్మన్‌, కమిషనర్‌తోపాటు ముగ్గురు సభ్యులు ఉండేదే ఈ అథారిటీ. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా ఉండే ల్యాండ్‌ అథారిటీ వారు నియమించబోయే మండల టైటలింగ్‌ అధికారి ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికార పార్టీ చెప్పుచేతల్లోనే టైటలింగ్‌ అధికారి ఉంటారనేది నిర్వివాదాంశం. ఇప్పుడున్న తహశీల్దార్లు, వి.ఆర్‌.ఓలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఇప్పటి వరకు చేపట్టిన తప్పుడు భూసర్వేల వివరాలను ల్యాండ్‌ టైటలింగ్‌ అధికారికి అందిస్తారు. అవే శాశ్వత హక్కులుగా మారే ప్రమాదముంది. భూహక్కుల చట్టం 27/2023 అమల్లోకి వస్తే రెవెన్యూ అధికారులు చేసే ఏ తప్పుడు పనినైనా ప్రశ్నించే నాధుడే ఉండడు.

ఇప్పటి వరకు స్ధానికంగా ఉండే సివిల్‌ కోర్టులు రెవెన్యూ అధికారుల తప్పులను ప్రశ్నించి ప్రజలకు కొంతమేరకైనా న్యాయం చేస్తున్నాయి. ఈ చట్టం అమలు చేస్తే.. రెవెన్యూ అధికారులందరూ న్యాయమూర్తులవుతారు. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు జేబులు నింపుకుంటారు. వీరిద్దరి కుమ్మక్కుతో ఆగడాలకు అడ్డూ అదుపూ ఉండదు సరికదా, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితి. గౌరవ సుప్రీంకోర్టు వారు పలు సందర్భాల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైనంత మాత్రాన ఆస్తికి అతను యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్‌ హయాం నుండి రాసుకున్న లెక్కల పుస్తకాలు. అందులో పన్ను ఎంతకట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి మీద ఎవరికి హక్కు ఉంటుందని చెప్పలేదు. ఈ చట్టం అమల్లోకొస్తే భారత పౌరుని టైటిల్‌ ప్రాపర్టీ హక్కుకే నష్టం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ చట్టం తేవడానికి ముఖ్య ఉద్దేశ్యం ప్రజలు స్ధిరాస్తి హక్కులను న్యాయ వ్యవస్ధ పరిధి నుండి తొలగించి రాజకీయ కబంధహస్తాల్లోకి తీసుకుపోవడం. అందువల్ల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సాధారణ మానవులకు న్యాయం అందకపోగా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువుగా ఉంది. లక్షలాది రూపాయలు జీతాలు చెల్లించి ప్రతీ మండలానికి ఒక టైటిలింగ్‌ ఆఫీసర్‌ నియమించే బదులు అదే స్ధానంలో మండల న్యాయస్ధానాలు ఏర్పాటు చేసి న్యాయమూర్తులను ఏర్పాటు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేసినట్లయితే సివిల్‌, క్రిమినల్‌ కేసులు సత్వర పరిష్కారం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మన పాలకులు ఇలా చెయ్యరు.. ఎందుకంటే….న్యాయస్ధానాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి, టైటలింగ్‌ ఆఫీసర్‌ అయితే అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు పనిచేస్తారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జిల్లా కోర్టులు 151, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు

131, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు 271లతో కలిపి రాష్ట్రం మొత్తం మీద 553 సివిల్‌ కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే…ఈ 553 కోర్టుల్లో సివిల్‌ కేసులు దాఖలు చేయడానికి వీలుండదు. వీటి స్ధానంలో ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక్కో ట్రిబ్యూనల్‌ చొప్పున 26 ట్రిబ్యూనళ్లలో కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. 553 కోర్టుల్లో చేయలేని పనిని 26 ట్రిబ్యూనల్స్‌ ఎలా పరిష్కరిస్తాయో ప్రభుత్వమే ప్రజలకు చెప్పవలసి ఉంది.

ఈ చట్టం అమల్లోకి వస్తే మొట్టమొదటగా నష్టపోయేది ప్రజలు. పేదల భూములను అక్రమ రికార్డులతో ఆక్రమించే భూ కబ్జాదారులకు ఇది ఉపయోగం. ఈ చట్టం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని మాయ మాటలు చెప్పడమేకాక ఈ సమస్య న్యాయవాదులకు సంబంధించిందనీ, ప్రజలకు ఎలాంటి సంబంధమే లేదనీ దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ నల్లచట్టాన్ని సన్న, చిన్నకారు, దళిత, బలహీన వర్గాలు, ఇతర భూ యజమానులందరూ వ్యతిరేకించి ఈ చట్టం రద్దు చేసేవరకూ పోరాటం చేయాల్సి ఉంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాల్సిన బాధ్యత న్యాయవాదులతోపాటు వివిధ వర్గాల ప్రజలు, సంస్ధలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలపై ఉంది.

-వ్యాస రచయిత అడ్వకేట్‌, మాజీ శాసనసభ్యులు. సెల్‌ నెం.9848024831దిగుపాటి రాజగోపాల్‌
-వ్యాస రచయిత అడ్వకేట్‌, మాజీ శాసనసభ్యులు. సెల్‌ నెం.9848024831దిగుపాటి రాజగోపాల్‌
➡️