నిరంకుశత్వం దిశగా..

Mar 16,2024 07:15 #Editorial

                  దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు నిరంకుశత్వానికి దారితీస్తాయి. ఎనిమిది భాగాలుగా 18,626 పేజీలతో రూపొందించిన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కమిటీ అందజేసింది. బిజెపి, బిజెడి తదితర 32 పార్టీలు జమిలికి మద్దతివ్వగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, డిఎంకె వంటి 15 పార్టీలు వ్యతిరేకించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసిపి, టిడిపి, బిఆర్‌ఎస్‌ వంటి కొన్ని పార్టీలు అసలు తమ అభిప్రాయమే వెల్లడించలేదు. కమిటీ తొలుత లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్‌ నిర్వహించాలని, ఆ తరువాత 100 రోజులకు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగానికి, ఇతర చట్టాలకు 18 సవరణలు చేయాల్సి వుంటుంది. రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఉభయ సభలలో 2/3వ వంతు మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. కాబట్టి, ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. పదవీకాలాన్ని మాత్రమే కాదు.. అన్నింటిని కూడా చూడాలి. కమిటీ సిఫార్సులు అమలు చేస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, అలాగే ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కుకు కూడా కత్తెర పడుతుంది. ఉదాహరణకు, 18వ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా 19వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా వాటి పదవీకాలాలు తగ్గించాలని ప్రతిపాదించారు. అంటే 2026లో ఎన్నికలు జరగాల్సిన పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలం సగానికన్నా ఎక్కువే కుదించబడుతుంది. ఐదేళ్లపాటు పరిపాలన సాగించడానికి ప్రజలెన్నుకున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను ఇలా రద్దు చేయడం ప్రజల అధికారాన్ని గుంజుకోవడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కదా !
లోక్‌సభ, అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించిన వంద రోజుల్లోగా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించి, నిర్వహిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ మొదలుపెట్టి అన్నిటా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను గుంజుకోవడమే కదా! లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏర్పడిన అసెంబ్లీలు, స్థానిక సంస్థలు ఏదైనా కారణాలతో ముందే రద్దయితే వాటికి మిగిలిన లోక్‌సభ కాలపరిమితి వరకే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలంది. అంటే దేశంలో ఎన్నికయ్యే అన్ని సంస్థలూ లోక్‌సభ కాలపరిమితి చుట్టూ పరిభ్రమిస్తాయన్నమాట. అన్ని ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితాలు, అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అధికారాలు కేంద్రీకృతమవుతాయి. అసలు పంచాయతీలు, స్థానిక సంస్థల ప్రాథమిక సూత్రమైన వికేంద్రీకరణ స్ఫూర్తికే ఇది పూర్తి విరుద్ధమైనది. గల్లీ నుండి ఢిల్లీ వరకూ ఏకీకృతమైన రీతిలో ఎన్నికలు జరిగితే మౌలికమైన స్థానిక స్వపరిపాలన మాటేమిటి? కీలకమైన ‘స్థానికత’ మాయమవుతుంది కదా! గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నెలకొల్పేది ఇలానా ?
పార్లమెంటు మొదలు గ్రామ పంచాయతీ వరకు గల ఎన్నికయ్యే సంస్థలన్నిటి అధికారాలకు, కాల వ్యవధికి జమిలి ఎన్నికలు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. గత 75 ఏళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో, పార్లమెంట్‌, శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో మనం చూశాం. స్థానిక సంస్థలకు, వాటికి నిధులు, విధులు, అధికారాల కల్పనకూ సాగిన ఉద్యమాలు, చేసిన పాలనా సంస్కరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. వాటన్నిటికీ పాతర వేసే ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుంది. అది ఏక పార్టీ పాలనకూ ఆ తరువాత ఏక వ్యక్తి నియంతృత్వానికి దారి తీసే ప్రమాదం ఏర్పడుతుంది. గతంలో రాజ్యాంగ సమీక్ష పేరిట సాగించిన మాదిరిగానే ఇప్పుడు జమిలి ప్రహసనం ముందుకొచ్చింది. పేరు ఏదైనా సారాంశం ఒకటే! అప్రజాస్వామికమైన జమిలి ఎన్నికల ప్రతిపాదనను అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, యావత్‌ దేశ పౌరులు ఐక్యంగా వ్యతిరేకించడం అవసరం. తద్వారా భారత రాజ్యాంగాన్ని, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోగలం.

➡️