విష వ్యర్థాలు

Apr 4,2024 03:29 #editpage

భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో పేరుకుపోయిన విషపూరిత రసాయనిక వ్యర్థాలను తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) కొద్ది రోజుల క్రితం చేసిన ఆదేశాలు ఆహ్వానించదగినవి. అయితే, ఈ ఆదేశాలు అమలు కావడమే ప్రశ్నార్ధకం! ఎందుకంటే .. ఆ వ్యర్థాలకు సంబంధించి ఈ తరహా ఆదేశాలు ఇంతకుముందు
ఎన్నో వెలువడ్డాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానమూ జోక్యం చేసుకుని ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏర్పాటయి కూడా దశాబ్ద కాలం దాటి పోయింది. సుప్రీంకోర్టు జోక్యానికి ముందు, ఆ తరువాత కూడా ఈ తరహా ఆదేశాలు ఎన్నో వెలువడ్డాయి. అయినా ఫలితం శూన్యం. దీంతో ఆ కోవలోనే ఎన్‌జిటి ఇచ్చిన తాజా ఆదేశాలు కూడా చేరిపోతాయేమోనన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. యూనియన్‌ కార్బైడ్‌ ఫ్య్యాక్టరీ ప్రాంగణంలో పడి ఉన్న ఈ వ్యర్థాలు 1984 నాటి గ్యాస్‌ లీకేజి దుర్ఘటన నాటివి అంటే విస్మయం కలగక మానదు! వేలాది మంది ప్రజల ప్రాణాలను బలిగొన్న ఆ దుర్ఘటన తరువాత కూడా మన ప్రభుత్వాలు పాఠాలు నేర్వలేదనడానికి 40 ఏళ్లుగా అక్కడే నిల్వ ఉన్న విషపూరిత వ్యర్థాలే నిలువెత్తు నిదర్శనం. గ్యాస్‌ దుర్ఘటన దుష్పలితాలను ఇప్పటీకి అనుభవిస్తున్న స్థానిక ప్రజానీకం, ఈ వ్యర్థాల కారణంగా కూడా అనేక బాధలకు గురవుతోంది. వీటిని తొలగించాలని వారు కొన్ని దశాబ్ధాలుగా డిమాండ్‌ చేస్తున్నారు.
వీరి ఒత్తిడి కారణంగా 1990వ దశకంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిర్వహించిన సర్వేలో 337 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉన్నాయని, ఇవన్నీ విషపూరితమైనవని నిర్ధారించింది. జాతీయ పరిశోధన సంస్థలు
2009లో నిర్వహించిన అధ్యయనంలో ఒక టన్నుకుపైగా పాదరసం ఆ ప్రాంతమంతా చిందిందని, ఫలితంగా ప్రాంగణంలోని మట్టి పెద్ద ఎత్తున కలుషితమైందని తేలింది. ఎన్‌జిటి స్వయంగా నిర్వహించిన అనేక సర్వేల్లో పరిసర ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల దూరం భూగర్భజలాలు పూర్తిగా విషపూరితమయ్యాయని నిర్ధారించింది. అయినా, స్థానికంగా ఉన్న వేలాది మంది ప్రజానీకానికి నేటికీ ఆ నీరే దిక్కు కావడం బాధాకరం! మూడు తరాల తరువాత కూడా 1984 నాటి విషవాయువు లీకేజి దుర్ఘటన ప్రభావం స్థానికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారి తరపున పోరాడుతున్న సంఘాల ప్రతినిధులు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న 337 మెట్రిక్‌టన్నులు కాకుండా, ప్రాంగణంలోని మరో 23 చోట్ల ప్రధాన వ్యర్థాలను పూడ్చి వేశారని, ప్లాంటుకు సమీపంలో ఉన్న ఒక చెరువులో కూడా వేల టన్నుల విష వ్యర్థాలను పూడ్చిపెట్టారని చెబుతున్నారు. వీటిని కూడా వెలికితీసి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మూలించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈ వ్యర్థాల ఉనికిని ప్రభుత్వం ఇంకా నిర్ధారించాల్సి వుంది. అంటే, ఈ సమస్య పరిష్కారం కావడానికి ఇంకా ఎన్ని తరాలు మారాలో, ఎందరు ప్రజలు నష్టపోవాలో ఊహించుకోవాల్సిందే!
యూనియన్‌ కార్బైడ్‌ అనే కాదు. పారిశ్రామిక వ్యర్థాలను నిర్మూలించడానికి దేశ వ్యాప్తంగానే స్పష్టమైన విధానం లేదు. కార్పొరేట్లకు, పాలకవర్గాలకు కొనసాగుతున్న అపవిత్ర బంధం ఈ పరిస్థితికి కారణం. ఒక అంచనా ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది 1.20 కోట్ల టన్నుల పారిశ్రామిక వ్యర్థాలు పోగుపడుతున్నాయి. వీటిలో 71,833 టన్నుల వ్యర్థాలు విషపూరితమైనవని అంచనా! వీటిలో అధికభాగాన్ని సమీపంలో ఉన్న చెరువులు, నదులు, సముద్రాల్లో కలిపేస్తున్నారు. మరికొంత భాగాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేస్తున్నారు. తీర ప్రాంతంలో ఏర్పాటవుతున్న అనేక పరిశ్రమలు వ్యర్థాలను సముద్రంలోకి వదిలివేస్తున్న సంగతి తెలిసిందే. వీటి కారణంగా చేపలు గణనీయంగా తగ్గిపోతున్నాయంటూ మత్స్యకారులు ఆందోళనలకు దిగుతున్నారు.
అభివృద్ధి కార్పొరేట్లకు కాసులు కురిపించేదిగానూ, సామాన్యులకు ప్రాణ సంకటంగానూ, పర్యావరణానికి, జీవావరణానికి హాని చేసేది గానూ ఉండకూడదు. ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశ్రామిక వ్యర్థాలు, ముఖ్యంగా విషపూరిత వ్యర్థాల నిర్వహణ విషయాన్ని విస్మరిస్తున్నట్లుగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్న విధానాలకు చెల్లుచీటి పలకాలి. తక్షణమే వీటి నిర్వహణకు కచ్చితమైన విధానాన్ని రూపొందించి అమలు చేయాలి.

➡️