అతిసారపై అఖిలపక్షం

Jun 28,2024 23:40 #Akhilapaksha, #diarrhoea

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు డిమాండ్‌
– మృతులకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి
– జగ్గయ్యపేట ప్రాంతంలో సిపిఎం బృందం పర్యటన
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి :రాష్ట్రంలో అతిసార వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి వ్యాధి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అతిసార ప్రబలిన ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో శుక్రవారం సిపిఎం బృందం పర్యటించింది. వత్సవాయి పిహెచ్‌సి, జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట హెల్త్‌ సెంటర్‌, జగ్గయ్యపేటలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను పరిశీలించింది. వ్యాధికి గల కారణాలను స్థానికులను, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను సిపిఎం నేతలు అడిగి తెలుసుకున్నారు. జగ్గయ్యపేట పట్టణంలో అతిసారితో మృతి చెందిన రంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి. కృష్ణతో కలిసి బాబూరావు మీడియాతో మాట్లాడారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న జగ్గయ్యపేట మున్సిపాల్టీకి రూ.ఐదు కోట్లు, రాష్ట్రంలోని మేజర్‌ పంచాయతీలకు రూ.25 లక్షలు, మైనర్‌ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్ధల్లో పారిశుధ్యం, తాగునీటి పథకాల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి ప్రభుత్వమే వారికి వేతనాలు చెల్లించాలన్నారు. జగ్గయ్యపేట పట్టణంతోపాటు ఇతర మున్సిపాల్టీల్లో ఆగిన ఏషియన్‌ ఇన్‌ప్రాస్ట్రెక్చర్‌ బ్యాంకు (ఎఐబిఐ) పనులను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వాస్పత్రులు, పిహెచ్‌సిల్లో అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయని, వీటిలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్యం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️