క్రిమినల్‌ చట్టాలలో తుగ్లక్‌ సంస్కరణలు

Dec 22,2023 07:19 #Editorial

ఈ కొత్త చట్టం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుండి విచారణ పూర్తి, తీర్పు ప్రకటన వరకు లేదా అప్పీలేట్‌ కోర్టు ప్రక్రియలలో ఎలాంటి మార్పును ప్రవేశ పెట్టింది లేదు. నేరాలు, శిక్షలను నిర్వచించే భారతీయ శిక్షాస్మృతి విషయంలోనూ నేరాలు, శిక్షల నిర్వచనాలను అచ్చం అదే విధంగా తిరిగి రాసి…విభాగాలను అటూ ఇటూ పునర్విభజించారు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ లోనూ పేరు మార్పు, శాఖల మార్పు మాత్రమే చోటు చేసుకున్నాయి. రాజధానిని అటూ ఇటూ చేసిన తుగ్లక్‌ సంస్కరణల తరహాలోనే ఈ మొత్తం విభాగాలను అటూ ఇటూ చేశారు. ఆర్భాటంగా జరిగిన భారతీయీకరణ ప్రహసనం కాస్త్తా పేరు మార్చడం, శాఖల పరస్పర మార్పిడిగా తయారైంది.

హత్యా నేరం, దానికి శిక్షలు ఐపిసి లోని సెక్షన్లు 299 నుండి 311 వరకు వుండేవి. కొత్త చట్టంలో వాటిని సెక్షన్లు 98 నుండి 111 వరకు తీసుకొచ్చారు. హత్యా నేరానికి సంబంధించిన సెక్షన్‌ 302ని సెక్షన్‌ 102గా మార్చారు. మహిళలపై నేరాలు కూడా అలాగే నెంబర్లు మారాయి. మోసం, ఫోర్జరీ, దొంగతనం వంటి దాదాపు అన్ని విభాగాలు పెద్ద మార్పులు లేకుండా కొత్త విభాగాలుగా పునర్‌ విభజన జరిగింది. అయితే, దీనితో పాటు, సుప్రీంకోర్టు స్తంభింపచేసిన దేశద్రోహం నేరం, యుఎపిఎ చట్టం కింద ఉగ్రవాదం, పోక్సో చట్టం కింద పిల్లల వేధింపులు మరియు ఇతర చట్టాలలో పేర్కొన్న ఆర్థిక నేరాల సెక్షన్లు కొత్త శిక్షాస్మృతిలో భాగంగా చేశారు. వీటివల్ల సామాన్యులకు కలిగే న్యాయపరమైన చిక్కులు వర్ణనాతీతం.

              భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), సాక్ష్యాధారాల చట్టం, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ మొదలైనవాటి పేర్లను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యా బిల్లు, భారతీయ పౌర భద్రతా సంహితగా మార్చింది. క్రిమినల్‌ చట్టాలలో సమగ్ర సంస్కరణలు తీసుకువస్తున్నట్టు, భారతదేశంలో వలస కాలపు చట్టాలను సంస్కరిస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంది. ఇటీవల పార్లమెంటుపై జరిగిన దాడిలో భద్రతా ఉల్లంఘన గురించి చర్చించాలని డిమాండ్‌ చేసిన 143 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసిన సమయంలోనే ఇటువంటి ముఖ్యమైన బిల్లు చర్చకు చేపట్టడం నిజానికి పూర్తి అప్రజాస్వామికం. బిల్లుపై చర్చను నీరుగార్చడానికి చేపట్టిన ఉద్దేశపూర్వక చర్య.

దేశంలో క్రిమినల్‌ లా (నేర చట్టాలు) వ్యవస్థ బ్రిటిష్‌ పాలన నాడు ప్రారంభమైంది. 1872లో, ఐపిసి మరియు ఎవిడెన్స్‌ చట్టం అమలులోకి వచ్చింది. 1898లో సిఆర్‌పిసి కూడా రూపొందించబడింది. అంతకు ముందున్న రాచరిక పాలన సమయంలో లేదా ఇంకా ముందు నేర చట్ట అమలు వ్యవస్థలు ఎలా వుండేవో చట్టాలు లేదా విధానాల స్వరూపమేమిటో మనకు తెలియదు. బ్రిటిష్‌ రాజ్య న్యాయ వ్యవస్థలను స్వల్ప మార్పులతో వారు భారతదేశంలో అమలు చేశారు. చట్టబద్ద పాలనను అమలు చేయడానికి ఈనాడున్న న్యాయమూర్తులు, న్యాయవాదులతో కూడిన న్యాయ వ్యవస్థ, పోలీసింగ్‌ వ్యవస్థ ఆ విధంగానే ఉనికిలోకి వచ్చింది.

తరువాత కాలంలో ఎన్నో శాసన సవరణలు కోర్టు తీర్పుల ద్వారా ఈ చట్టాలు అనేక విధాల రూపాంతరం చెందాయి. ఈ మార్పులతో ఇది లోపరహిత వ్యవస్థగా మారిపోయిందని చెప్పలేనప్పటికీ హక్కుల కోణంలో మార్పులు వచ్చాయనేది వాస్తవం. 1950లో ఏర్పాటైన భారత రాజ్యాంగంలోని ఆధునిక ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులు, 1970లలో రూపొందిన అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలకు అనుగుణమైన నేర విచారణ వ్యవస్థ దేశంలో రూపొందింది.

వలస కాలపు చట్టాలను పూర్తిగా మార్చివేసే బృహత్తర ప్రయత్నం ఎన్నడూ జరగనప్పటికీ హక్కుల కోణంలో చెప్పుకోదగిన చాలా మార్పులు వచ్చాయి. అరెస్టు, విచారణకు ముందు కస్టడీ, బెయిల్‌, నిందితులకు న్యాయ సహాయం పొందే హక్కు, క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలలో అనేక ముఖ్యమైన మార్పులే వచ్చాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచివేసేందుకు దుర్వినియోగం చేయబడిన దేశద్రోహ నేర నిబంధనల ప్రయోగాన్ని స్తంభింపజేసిన చర్య కూడా అలాంటిదే.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఈ క్రిమినల్‌ లా వ్యవస్థను సంస్కరిస్తామని ప్రకటించారు. సనాతన ఆర్ష భారత రాజ్యానికి సంబంధించిన వారి భావాత్మక చరిత్రలో ఎక్కడా అటువంటి చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ లేదు. అందువల్ల, వారు తాము విమర్శిస్తున్న విదేశీ-వలసవాద చట్టాలను ఏ విధంగా మారుస్తారోనని న్యాయ రంగంలోని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు.

పెద్ద నోట్ల రద్దు, వినాశకర వ్యవసాయ బిల్లు, కార్మిక చట్ట సంస్కరణలు, పౌరసత్వ చట్ట సవరణ మొదలైన వాటిపై తగినంత చర్చ లేకుండా ఏ ఏకపక్ష విధానాన్ని అనుసరించారో అదే తీరును క్రిమినల్‌ చట్ట సంస్కరణ లోనూ కేంద్ర ప్రభుత్వం అవలంబించింది. వున్న చట్టాల లోతైన పునర్విమర్శన, సమగ్ర కొత్త చట్టాల రూపకల్పన సిఫార్సు సాధారణంగా లా కమిషన్లు చేస్తాయి. ఈ విషయంలోనూ కేంద్రం సువ్యవస్థితమైన ఆ వరవడిని తోసిపుచ్చింది. క్రిమినల్‌ చట్టాలను సంస్కరించేందుకు కమిటీని మే 4న కేంద్ర ప్రభుత్వమే నియమించింది. నేషనల్‌ లా యూనివర్శిటీ ప్రొఫెసర్‌, రిటైర్డ్‌ జిల్లా జడ్జి పి.తారేజ, అడ్వకేట్‌ మహేష్‌ జెఠ్మలానీ అందులో సభ్యులుగా నియమితులైనారు. ఈ చట్ట సంస్కరణల కమిటీ విచారణాంశాలను కూడా బయిటపెట్టలేదు.

ఈ కమిటీ సమర్పించిన ముసాయిదా చట్టాలను కేంద్రం నాలుగు నెలల క్రితం పార్లమెంటులో సమర్పించి ప్రజల అభిప్రాయాల కోసం విడుదల చేసింది. అయితే పెద్దగా ఎలాంటి మార్పులు లేకుండా కొత్త పేర్లతో ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేరళతో సహా హిందీ మాట్లాడని దక్షిణ భారత రాష్ట్రాలకు ఈ కొత్త పేర్లు బొత్తిగా తలకెక్కవు. అంతేకాకుండా, పార్లమెంటులో, శాసనసభలలో ప్రవేశపెట్టే చట్టాల విషయం గాని, శీర్షిక గాని తప్పనిసరిగా ఇంగ్లీషులో ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 348(1) నిర్దేశిస్తుంది. ఈ షరతులను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా, అభ్యంతరకర హిందీకరణ జరిగింది. ఐపిసి, సాక్ష్యాధారాల చట్టం, సిఆర్‌పిసి ల విషయంలో వారు చెప్పుకునే ప్రకటిత ‘భారతీకరణ’ జరగలేదు సరికదా, ప్రస్తుత చట్టాల సమగ్ర సంస్కరణ అసలే జరగలేదు. ఇప్పుడున్న చట్టాల వల్ల కలిగే నష్టాలేమిటో, కొత్త సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఎవరూ చెప్పలేరు. మూడు చట్టాల్లోని వివిధ భాగాల పునర్వ్యవస్థీకరణే ప్రధానంగా జరిగింది.

ఈ కొత్త చట్టం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుండి విచారణ పూర్తి, తీర్పు ప్రకటన వరకు లేదా అప్పీలేట్‌ కోర్టు ప్రక్రియలలో ఎలాంటి మార్పును ప్రవేశ పెట్టింది లేదు. నేరాలు, శిక్షలను నిర్వచించే భారతీయ శిక్షాస్మృతి విషయంలోనూ నేరాలు, శిక్షల నిర్వచనాలను అచ్చం అదే విధంగా తిరిగి రాసి…విభాగాలను అటూ ఇటూ పునర్విభజించారు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ లోనూ పేరు మార్పు, శాఖల మార్పు మాత్రమే చోటుచేసుకున్నాయి. రాజధానిని అటూ ఇటూ చేసిన తుగ్లక్‌ సంస్కరణల తరహాలోనే ఈ మొత్తం విభాగాలను అటూ ఇటూ చేశారు. ఆర్భాటంగా జరిగిన భారతీయీకరణ ప్రహసనం కాస్తా పేరు మార్చడం, శాఖల పరస్పర మార్పిడిగా తయారైంది.

హత్యా నేరం, దానికి శిక్షలు ఐపిసి లోని సెక్షన్లు 299 నుండి 311 వరకు వుండేవి. కొత్త చట్టంలో వాటిని సెక్షన్లు 98 నుండి 111 వరకు తీసుకొచ్చారు. హత్యా నేరానికి సంబంధించిన సెక్షన్‌ 302ని సెక్షన్‌ 102గా మార్చారు. మహిళలపై నేరాలు కూడా అలాగే నెంబర్లు మారాయి. మోసం, ఫోర్జరీ, దొంగతనం వంటి దాదాపు అన్ని విభాగాలు పెద్ద మార్పులు లేకుండా కొత్త విభాగాలుగా పునర్‌ విభజన జరిగింది. అయితే, దీనితో పాటు, సుప్రీంకోర్టు స్తంభింపచేసిన దేశద్రోహం నేరం, యుఎపిఎ చట్టం కింద ఉగ్రవాదం, పోక్సో చట్టం కింద పిల్లల వేధింపులు మరియు ఇతర చట్టాలలో పేర్కొన్న ఆర్థిక నేరాల సెక్షన్లు కొత్త శిక్షాస్మృతిలో భాగంగా చేశారు. వీటివల్ల సామాన్యులకు కలిగే న్యాయపరమైన చిక్కులు వర్ణనాతీతం.

ఇప్పటికే ఉన్న నిబంధనలను మార్చి ఆ శాఖ చేసిన జిమ్మిక్కుతో లాభం ఏమిటి? పైన చెప్పినట్లు ఈ సంస్కరణల నేపథ్యంలో క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోల్లో తాజా డేటాను మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఖజానాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ అనవసర శాఖల మార్పుల వల్ల కోర్టులు, లాయర్లు, పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మునుపటి కోర్టు నిర్ణయాలు రిఫరెన్స్‌ లైబ్రరీలు, ఇ-లైబ్రరీలను మార్చవలసి ఉంటుంది. వెయ్యి నోటును నిషేధించి రెండు వేల నోటును ప్రవేశపెట్టి ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వృథా కసరత్తులు తప్ప ఈ చట్ట సవరణలు భారతీయ న్యాయ వ్యవస్థలో ఎలాంటి సానుకూల మార్పును తీసుకురాబోవు.

ఈ సెక్షన్‌ మార్పు తతంగాల ప్రభావాలే కాకుండా తిరోగమన నిర్ణయాలు కూడా ఉన్నాయి. దర్యాప్తు సమయంలో కస్టడీ వ్యవధిని పొడిగించడానికి, ముందస్తు విచారణ ఖైదీల సంఖ్యను పెంచడానికి రాష్ట్రాన్ని అనుమతించే మార్పులు అలాంటివే. యుఎపిఎ కేసులతో సహా బెయిల్‌ లేకుండా విచారణకు ఎదురు చూస్తున్న ఖైదీల సంఖ్య ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఇవి భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించే నిబంధనలు అవుతాయి. అనాగరికమైన కాలం చెల్లిన రీతిలో ఖైదీల ఒంటరి నిర్బంధం నిర్దేశించబడింది. నిందితులు లేకుండానే క్రిమినల్‌ కేసులను విచారించే క్లాజులు ఇందులో ఉన్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ వాస్తవాలన్నిటిపై దాఖలైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రజల ప్రతిఘటన ద్వారా ఇటువంటి నిరంకుశ చట్టాలను వెనక్కు కొట్టాల్సి వుంటుంది.

(రచయిత 'ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌' కేరళ రాష్ట్ర కార్యదర్శి) సి.పి. ప్రమోద్‌
(రచయిత ‘ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌’ కేరళ రాష్ట్ర కార్యదర్శి) సి.పి. ప్రమోద్‌
➡️