తీరు మారని బిజెపి

Jun 20,2024 05:55 #BJP, #edit page, #unchanged

సాధారణ ఎన్నికల్లో దేశ ప్రజానీకం మొట్టికాయ వేసి, మెజార్టీ కోసం ఇతర పార్టీలపై ఆధారపడేటట్లు చేసినా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ తీరులో మార్పు కనపడటం లేదు. గతంలో మాదిరి అవే ఏకపక్ష విధానాలు, నిరంకుశ పోకడలను కొనసాగిస్తోంది. ప్రముఖ రచయిత్రి అరుంధతీ రారుపై ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా) ప్రయోగానికి అనుమతి ఇవ్వడమే దీనికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె సక్సేనా ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైనాయి. అరుంధతీ రారుతో పాటు కాశ్మీర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోఅంతర్జాతీయ న్యాయశాస్త్ర మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌ను కూడా ఈ చట్టం కింద విచారణకు గవర్నర్‌ అనుమతించారు. ఇది ఇప్పటి కేసు కాదు. పోలీసులు చెబుతున్న ఈ సంఘటన జరిగి పుష్కర కాలం దాటిపోయింది. ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం జరిగి సంఘటనను తవ్వి తీసి, ఏకంగా ఉపా వంటి క్రూరమైన చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధం కావడంలోనే కేంద్ర ప్రభుత్వ కుటిలత్వం స్పష్టమౌతోంది. ఈ ఫైలే గత ఏడాది గవర్నర్‌ ముందుకు వచ్చినప్పుడు ఉపా చట్టం కింద కేసు పెట్టాలన్న పోలీసుల ప్రతిపాదనను గవర్నర్‌ తిరస్కరించారు. అప్పట్లో ఐపిసి సెక్షన్ల కింద మాత్రమే కేసు నమోదు చేయాలని ఆదేశించడం గమనార్హం. 2010లో న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా మాట్లాడారన్నది అరుంధతీ రారు ప్రభృతులపై ఆరోపణ! అదే జరిగి ఉంటే, ఆ ఉపన్యాసాల కారణంగానే వేర్పాటువాదం ఈ 14 ఏళ్ల కాలంలో బలపడిందని పోలీసులు ఆధారాలు చూపాలి. అవేమీ లేవు. పైగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత వేర్పాటువాదాన్ని అణచి వేశామని, కాశ్మీరాన్ని భూతల స్వర్గం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షా లు పదే పదే దేశ వ్యాప్తంగా చాటింపు వేస్తూనే ఉన్నారు. అయినా, అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందిన రచయిత్రి, హక్కుల ఉద్యమకారిణిపై అతి క్రూరమైన చట్టం కింద కేసు పెట్టడానికి బరితెగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంకేతాలేమిటి?
ఈ కేసు విషయంలోనే కాదు. అనేక ఇతర అంశాల్లోనూ మోడీ సర్కారు పోకడలు ఇదే మాదిరి ఉన్నాయి. పార్లమెంటులో సాధారణ మెజార్టీ కోసం జనతాదళ్‌(యు), టిడిపి లపై బిజెపి ఆధారపడి ఉంది. అయినా, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఒక్క సానుకూల ప్రకటనయైనా నరేంద్ర మోడీ చేయకపోవడం గమనార్హం. గడిచిన పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగానే దేశ ప్రజానీకం సాధారణ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. ఈ విషయం సుస్పష్టం. అయినా, ఆయన ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో ఇసుమంత మార్పు కూడా లేదు. గతంలో ఉన్న మంత్రులనే తీసుకోవడంతో పాటు, వారికి ఆ శాఖలనే అప్పగించారు. మంత్రి వర్గంలో ఒక్క ముస్లింకూ స్థానం ఇవ్వలేదు. ఇతర అధికారులే లేరన్నట్లు గతంలో పనిచేసిన పి.కె మిశ్రాను ముఖ్య కార్యదర్శిగా, జాతీయ భద్రతా సలహాదారునిగా అజిత్‌ దోవల్‌ను తిరిగి నియమించారు. వీటన్నింటి అర్ధం మతతత్వ-కార్పొరేట్‌ విధానాల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టంగా చెప్పడమే. మతతత్వ విధానాల కారణంగా రక్తపుటేరుల్లో మునిగిన మణిపూర్‌ను సందర్శించి, బాధితులకు అండగా ఉండటానికి ఇప్పటికీ ప్రయత్నం చేయడం లేదు.
మరోవైపు సంఫ్‌ుపరివార్‌, హిందుత్వ శక్తులు చెలరేగి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఒడిషాలోని బాలాసోర్‌లో బిజెపి, సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఒక వ్యూహం ప్రకారం మతఘర్షణలను రెచ్చగొట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో గోగూండాలు దాడులకు దిగుతున్నారు. అరుంధతీ రారుపై ఉపాను ప్రయోగించడం ప్రజల పక్షాన నిలబడి, గొంతు విప్పి, పోరాడే ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక వంటిది. ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా కదిలి ఈ దాడిని తిప్పికొట్టడంతో పాటు రానున్న రోజుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరచాలి. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుకునేందుకు ప్రజలు, ప్రజాతంత్ర శక్తులు సదా జాగరూకులై వుండాలి.

➡️