మోడీ పాలన : పెరిగిపోతున్న నిరుద్యోగ సైన్యం

unemployment in modi govt bjp failures article

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని ఏలుబడి కాలంలో దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఆందోళనకరంగా 25 ఏళ్ళ లోపు నూతన గ్రాడ్యుయేట్లలో 45 శాతం మంది నిరుద్యోగులుగా వున్నారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ది ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకటించింది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు కాకపోగా 2017-22 మధ్య రెండు కోట్ల మంది మహిళా కార్మికులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగ సైన్యంలో కలిసిపోయారు. 2023-24 స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) 2019-20 కంటే దాదాపు 18 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ గణాంకాలు అంచనా వేస్తుంటే ఉపాధి అవకాశాలు మాత్రం గత ఐదేళ్ళలో ఎన్నడూ లేనంతగా సున్నా వృద్ధిని సూచిస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది. 2023-24లో నిరుద్యోగానికి కూడా కులం, లింగం, ఆర్థిక వివక్ష ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటి ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2023’ రిపోర్టు నిరుద్యోగం లోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. కోటానుకోట్ల ఖర్చుతో ఆధునిక పార్లమెంట్‌ భవనం, సర్దార్‌ పటేల్‌ భారీ విగ్రహం, అయోధ్యలో రామమందిర నిర్మాణాల హోరులో పాలకులు ఉప్పొంగిపోతుంటే, 20 కోట్ల భవిష్యత్‌ భారత యువత ఉద్యోగమో రామచంద్రా అంటూ ఘోషిస్తున్నారు.

నెలన్నర క్రితం మనోరంజన్‌, సాగర్‌శర్మ, నీలం వర్మల పేర్లు దేశమంతటా మారుమోగాయి. పార్లమెంట్‌ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి చొరబడి నిరుద్యోగం గురించి నినాదాలు ఇచ్చారు. వీరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగవేటలో అలసిపోయి తమ గొంతును పాలకులకు వినిపించి కోట్ల మంది యువత హృదయ ఘోష పట్టించుకొమ్మని చెప్పడానికి ప్రయత్నించారు. వారు ఎన్నుకున్న మార్గం సరైంది కాకపోవచ్చు, వారు ఎదుర్కొం టున్న నిరుద్యోగం ఎంత తీవ్రంగా వుందో దేశాన్ని ఆలోచింపచేసింది. ఓట్ల రాజకీయ వేటలో ఉన్మాదాన్ని పెంచిపోషించడమే తమకు రక్ష అని భావించే పాలకులకు నిరుద్యోగ యువత ఆక్రందన, ఆవేదన వినిపిస్తుందా?

  • నివేదికలు ఏం చెబుతున్నాయి?

కార్మికశక్తిలో ఉపాధి పొందుతున్న వారు (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌) దేశంలో 2016-17లో 46.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరాల్లో పట్టణ ప్రాంతాల్లో 44.7 శాతం నుండి 37.5 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం నుండి 40.5 శాతానికి శ్రమశక్తికి ఉపాధి తగ్గిపోయింది. ఇదే సంవత్సరాల్లో మహిళల ఉపాధి 14.9 శాతం నుండి 8.7కు, పట్టణాల్లో 14.6 నుండి 6.9కి, గ్రామీణ ప్రాంతాల్లో 15.9 నుండి 9.7 శాతానికి పడిపోయిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక తెలిపింది. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న నిరుద్యోగులు పట్టణాల్లో 45.98 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 43.79 శాతం మంది ఉన్నారు. త్వరలోనే ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ప్రతిష్టించబడుతుందని పాలకులు చెబుతుంటే యువతలో సగం మంది నిరుద్యోగులుగా ఉండడం ఆందోళనకరం. 2050 నాటికి దేశ జనాభాలో 54 శాతం మంది 25 ఏళ్ళలోపు యువత ఉండడం, వారు మన దేశ భవిష్యత్తుకు పెద్ద వనరు. కాని ఈ యువతలో 45 శాతం పొట్ట చేత పట్టుకుని పనికోసం ఎదురు చూస్తుండడం పాలకుల విధానాలు సృష్టించిన విషాదం.

‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2023’ రిపోర్టు నిరుద్యోగంలోని మరికొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. డిగ్రీ, ఆ పైన చదువుకున్న వారిలో పాతికేళ్ళ లోపు 42.3 శాతం, 25-29 ఏళ్ళ లోపు 22.8 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపింది. 2004 నుండి మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని కోవిడ్‌కు ముందు 50 శాతం మంది మహిళలు స్వయం ఉపాధి పొందుతుండగా, కోవిడ్‌ తర్వాత ఇది 60 శాతానికి పెరిగిందని అయితే ఇదే సమయంలో గతంలో పొందుతున్న ఆదాయంలో 15 శాతం తగ్గిందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పురుషుల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో 1983లో 61 శాతం మంది ఉపాధి పొందుతుండగా 2021 నాటికి అది 37 శాతానికి తగ్గింది. ఇదే సంవత్సరాల్లో వ్యవసాయంలో మహిళల ఉపాధి 75.5 శాతం నుండి 59 శాతానికి తగ్గింది. నిరుద్యోగిత ప్రభావం సామాజిక తరగతులపై తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఎస్‌.సి, ఎస్‌.టి జనాభాలో మొత్తం శ్రమశక్తిలో ఉపాధి పొందుతున్న వీరి వాటా అతి తక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. సాధారణ వేతనం పొందుతున్న కార్మికుల్లో ఇతర కులాల్లోని పిల్లలు 80 శాతం మంది ఉంటే ఎస్‌.సి, ఎస్‌.టి వారిలో 83 శాతం నుండి 53 శాతానికి తగ్గిపోయారని ఈ నివేదిక తెలిపింది.

సంఘటిత రంగం, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పూర్తిగా తగ్గిపోతుండగా నిర్మాణం, అసంఘటిత రంగాల్లోనే ఎక్కువ మంది యువత ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ స్థిరమైన వేతనాలు, పని భద్రత, ఆరోగ్య సంరక్షణ, మహిళలకు సౌకర్యాలు లేని ఆధునిక బానిసలుగా ఈ కార్మికులు ఉంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, కుటుంబ ఖర్చులు ఆకాశన్ని తాకుతుంటే వేతనాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2023’ రిపోర్టు ప్రకారం దేశంలో 2017-18లో రెగ్యులర్‌ కార్మికులు నెలకు పొందుతున్న వేతనం రూ. 19,450 కాగా 2021-22 నాటికి రూ. 19,456 మాత్రమే. ఇదే సంవత్సరాల్లో క్యాజువల్‌ కార్మికులు రూ. 6,959 నుండి రూ. 7,856 పొందుతున్నారు. ఈ మాత్రం వేతనం పొందడంలో కూడా రాష్ట్రాల వారీగా వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదా: రెగ్యులర్‌ కార్మికులకు ఉత్తరప్రదేశ్‌లో రూ.16,110, గుజరాత్‌లో రూ.15,671, ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,131, కేరళలో రూ.22,287 వేతనం పొందుతున్నారు.

పనికి సమానమైన వేతనం పొందడంలో కుల, లింగ, మత వివక్ష కొనసాగుతుందని ఈ నివేదిక బహిర్గతం చేసింది. 2021-22లో రెగ్యులర్‌ పురుష కార్మికునికి నెలకు రూ.17,910, మహిళకు రూ.13,666, ఎస్‌.సి. ఎస్‌.టి కార్మికులకు రూ.13,735, ముస్లింలకు రూ.13,550 వేతనం అందుతుండడం సామాజిక వివక్ష కార్మికుల శ్రమను దోచుకోవడానికి ఎలా తోడ్పడుతుందో అర్థమవుతుంది. అతి తక్కువ వేతనాలతో జీవించలేని రోజువారి కూలీలు ఆత్మహత్యలు చేసుకోవడం దేశంలో ఈ కాలంలో పెరిగింది. 2014లో మొత్తం ఆత్మహత్యలు 1,31,666. అందులో రోజువారి కూలీలు 15,735. 2021 నాటికి మొత్తం ఆత్మహత్యలు 1,64,033 కాగా రోజువారి కూలీలు 42,004 మంది ఉన్నట్లు జాతీయ నేర బ్యూరో నివేదిక ప్రకటించింది.

  • నిరుద్యోగ పెరుగుదలకు కారణాలు

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే అందమైన హామీతో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈ పది సంవత్సరాల కాలంలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి. బిజెపి అధికారంలోకి రాకముందు (2012 నాటికి) నిరుద్యోగుల సంఖ్య కోటి. అది 2018 నాటికి మూడు రెట్లు పెరిగి మూడు కోట్లకు చేరింది. 2021 ఇండియా స్కిల్స్‌ రిపోర్టు ప్రకారం దేశంలోని గ్రాడ్యుయేట్లలో దాదాపు సగం మంది నిరుద్యోగులుగా మారారు. ఇంత వేగంగా దేశంలో నిరుద్యోగం పెరగడానికి మూడు కారణాలున్నాయి. ఒకటి వ్యవసాయ సంక్షోభం, రెండు పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్గత లక్షణం, మూడు బిజెపి పరిపాలన విధానం.

దేశంలో అత్యధిక మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం నిధుల కేటాయింపు, సబ్సిడీల అమలులో పెద్ద ఎత్తున కోత విధిస్తూ వచ్చింది. ‘2021-22 కేంద్ర బడ్జెట్‌కు రైతులు, గ్రామాలు గుండెకాయలు’ అని దేశ ప్రధాని ప్రకటించిన సంవత్సరంలో వ్యవసాయానికి కేటాయించింది రూ.1,48,301 కోట్లు మొత్తం బడ్జెట్‌లో ఇది కేవలం 4 శాతం. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 4.2 శాతం నిధులు తగ్గించి, వ్యవసాయానికి వినాశకరమైన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న తరుణంలో ఆయన ఇలా చెప్పగలిగారంటే ఏమనుకోవాలి! సరళీకరణ విధానాల్లో భాగంగా వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సహాయాన్ని ఉపసంహరించు కుంటున్నాయి. దీనివల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం తీవ్రమైంది. దీనికి తోడు వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగింది. వ్యవసాయంపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతుండడంతో గ్రామీణ ఉపాధి, కొనుగోలు వేగంగా తగ్గిపోతోంది. దేశంలో ఉన్న 45 కోట్ల మంది వలస కార్మికుల్లో అత్యధిక భాగం వ్యవసాయ సంక్షోభం వల్ల గ్రామాల నుండి తరిమివేయబడ్డవారే.

పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ లక్షణం నిరుద్యోగం. ఒకవైపు కొందరి దగ్గర సంపద పోగుబడడం పెరిగేకొద్దీ అత్యధిక మంది కొనుగోలు తగ్గుతుంది. క్షీణిస్తున్న కొనుగోలులో తమ సరుకులే అమ్ముకోవాలని పెట్టుబడిదారుల మధ్య జరిగే పోటీలో ఆధునిక యంత్రాల వాడకం పెరుగుతుంది. ఇది మరింతగా నిరుద్యోగాన్ని పెంచుతుంది. ఈ నిరుద్యోగం ఉపాధి పొందుతున్న కార్మికుల వేతనాల తగ్గింపుకు కారణమవుతుంది. ఈ గొలుసుకట్టు వినాశనం అంతులేని నిరుద్యోగాన్ని సృష్టిస్తుంది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ఏర్పడే నిరుద్యోగాన్ని సేవారంగం భర్తీ చేయడం అసాధ్యం. తాత్కలికంగా సేవారంగంలో పొందే ఉపాధిపై రెండు రంగాల్లో వచ్చే సంక్షోభాలతో బుడగలాగా పేలిపోతుంది.

బిజెపి ప్రభుత్వానికి ఆర్థిక విధానం కంటే మతతత్వ ఎజెండా ప్రధాన అంశం. గత పది సంవత్సరాల పాలనా కాలంలో ప్రజల మధ్య మత విభజనను తీసుకు రావడానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కాశ్మీరులో 370 ఆర్టికల్‌ రద్దు, ఢిల్లీ, మణిపూర్‌లలో అల్లర్లు, ఉమ్మడి పౌరస్మృతి, అయోధ్యలో రామాలయం ఇలా అన్నింటిలోనూ మతతత్వ ఎజెండాను అమలు చేశారు. కేవలం మతతత్వ విధానాలు అమలు చేస్తే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు బిజెపిని బలపరచవు. అందుకే ఆర్థిక విధానాల్లో ఈ కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశ యువత, భవిత కంటే కార్పొరేట్‌ కంపెనీల సేవలో పునీతమవుతున్నారు. లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు. వీటన్నింటిని యువత దృష్టిని మళ్ళించడానికి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అందుకే ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఈ కంపెనీలు పెద్ద ఎత్తున బిజెపికి విరాళాలు ఇస్తున్నాయి. 2019-20 సంవత్సరంలో రాజకీయ పార్టీలకు వచ్చిన రూ. 3,435 కోట్లలో రూ. 2,555 కోట్లు 75 శాతం, ఈ సంవత్సరం 83 శాతం నిధులు బిజెపి ఖాతాలోకి చేరాయి. దేశ యువత నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యమించడమంటే కార్పొరేట్‌, మతతత్వ ఎజెండాల సమ్మళితంగా ఉన్న బిజెపిని ఓడించడానికి సిద్ధం కావడమే తక్షణ పరిష్కారం.

ram bhupal

  • వ్యాసకర్త : వి. రాంభూపాల్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/
➡️