నిలువెత్తు నిర్లక్ష్యం

uttarakhand-tunnel-accident-know-about-most-terrible-tunnel-accident

సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల గురించి ఆశావహ సమాచారం అందుతోంది. మంగళవారం వారి వీడియో ఫుటేజిని విడుదల చేసిన అధికారులు బుధవారం సాయంత్రం మరో సానుకూల సమాచారాన్ని అందచేశారు. మరో 12 మీటర్ల డ్రిల్లింగ్‌ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అది పూర్తయితే బాధితులను క్షేమంగా బయటకు తీసుకురాగలమన్నది ఈ సమాచార సారాంశం. అధికారుల అంచనా ప్రకారం గురువారం సాయంత్రానికల్లా సొరంగం లోపల చిక్కుకుపోయిన కార్మికులు బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆ తరువాతే వారి ఆరోగ్యానికి సంబంధించిన వాస్తవ స్థితిగతులు వెల్లడవుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సంఘటన స్థలం వద్ద అత్యవసర వైద్య సేవలకోసం అవసరమైన ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. అధికారుల తాజా ప్రకటనలు కొంత మేరకు ఊరటనిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం జరుపుతున్న నిలువు డ్రిల్లింగ్‌ విధానంపై నిపుణులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తుండటం ఆందోళనకరం. వారి అనుమానాలు నిజమైతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఎంత కష్టమైనప్పటికీ శిధిలాల కింద చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావాలి. ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలి. దేశమంతా ఇదే కోరుకుంటోంది. ఈ నెల 12వ తేదీన ప్రమాదం జరిగితే మొదటి రెండు రోజుల్లో నామమాత్రపు సహాయ చర్యలే జరిగాయి. ఆ మాటకొస్తే మొదటి వారం రోజులు తర్జన భర్జనల్లోనే అధికార యంత్రాంగం మునిగిపోయింది. ఏం చేయాలి.. ఎలా చేయాలన్న అయోమయమే నెలకొంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎనిమిది రోజుల పాటు ఒక్క అంగుళం కూడా సహాయ చర్యల్లో ముందడుగు పడలేదు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు అని చెప్పుకునే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏమిటి? అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరగడంతో ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఈ పరిస్థితి ఎందుకు కొనసాగింది? ఇంత జరుగుతున్నా రోజుల తరబడి ప్రధాని ఎందుకు స్పందించలేదు? ఎన్నికల ప్రచారంలోనో, క్రికెట్‌ గ్రౌండ్‌లోనో ఉండవచ్చు. కానీ, ప్రాణాల కోసం పోరాడుతున్న ఈ 41 మంది కార్మికులు కూడా దేశ ప్రజలే కదా! సొంత ఇమేజ్‌ను ప్రచారం చేసుకోవడానికి చూపే శ్రద్ధలో వందో వంతు పెట్టినా సహాయ చర్యలు ముమ్మరమయ్యేవి కదా! పర్యావరణ పరంగా ఉత్తరాఖండ్‌ అత్యంత సున్నితమైన ప్రాంతం. మంచు కొండలు, హిమ నదులు ఎక్కువ! కొండ చరియలు విరిగిపడటం, అకస్మిక వరదలు, భూకంపాలు ఇక్కడ తరచూ చోటుచేసుకుంటూ ఉంటాయి. కానీ, ఈ సున్నితత్వాన్ని, పర్యావరణ ప్రాముఖ్యతను కేంద్ర, రాష్ట్ర బిజెపి సర్కార్లు ఏ మాత్రం పట్టించుకున్నట్లు కనిపించవు. రాజకీయంగా లబ్ధి పొందడమే లక్ష్యంగా చేపట్టిన ఆధ్యాత్మిక టూరిజంలో ఇటువంటి ప్రాంతాల్లోనే భారీ నిర్మాణాలు చేపట్టడం దీనికి నిదర్శనం. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఉత్తర కాశీ జిల్లాలోని సిల్క్యారా సొరంగం కూడా అటువంటిదే. చార్‌ధామ్‌ హైవే ప్రాజెక్టులో భాగంగా ధారాసు నుండి యమునోత్రి కలిపే రహదారిలో వందల కోట్ల రూపాయల అంచనాతో ఈ సొరంగాన్ని చేపట్టారు. ఇదొక్కటే కాదు. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌్‌లను కలుపుతూ 12,000 కోట్ల రూపాయలతో చేపట్టిన చార్‌ధామ్‌ ప్రాజెక్టులో అధికభాగం లూజ్‌ సాయిల్‌తో ఏర్పాటైన కొండలున్న ప్రాంతాల్లోనే సాగుతోంది. అయినా భారీ యంత్రాల వినియోగం యథేచ్ఛగా జరుగుతోంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల సంఖ్య కూడా పెరుగుతోందని చెబుతున్నారు. గత ఏడాదిలోనే చిన్నా, చితక స్థాయిలో కొండ చరియలు విరగిపడిన సంఘటనలు అధికారిక రికార్డుల ప్రకారమే వెయ్యిదాకా చోటుచేసుకున్నాయి. కుంభవృష్టుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. వీటిని మోడీ సర్కారు నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు. విపత్తు బాధితుల పట్ల, వారి కష్టాల పట్ల కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం.

➡️