సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

Dec 13,2023 07:20 #Editorial

జమ్ముకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిపై సుప్రీం తీర్పు కేంద్రప్రభుత్వ ఏకపక్ష, అప్రజాస్వామిక వైఖరికి సమర్ధన. సమాఖ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య నిబంధనలకు, చట్టపరమైన ప్రక్రియలకు తీరని విఘాతం. న్యాయవ్యవస్థ గౌరవాన్నిసైతం తగ్గించేదిగా ఉంది. కేంద్రం తలచుకుంటే ఏమైనా చేయొచ్చనే ఏకపక్ష దురహంకార వైఖరికి వత్తాసు పలికినట్టుగా అనిపిస్తుంది.

          జమ్ముకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం మోడీ ప్రభుత్వ చర్యను రాజ్యాంగపరంగా లేదా చట్టబద్ధంగా సమర్థించలేకపోయింది. ప్రత్యేక హోదా ఉపసంహరణ ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోకూడదని కోర్టు చిత్రమైన వాదనను ముందుకు తెచ్చింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్‌వ్యవస్థీకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 కింద అనుమతించదగినదా? కాదా? అనేది తాము తేల్చదలచుకోలేదనడం మరో విడ్డూరం. 2019 ఆగస్టు 5 నాటికి రాష్ట్రపతి పాలనలో ఉంది. ఎన్నికైన శాసన సభ లేకపోగా, గవర్నర్‌ సమ్మతినే రాష్ట్ర సమ్మతిగా పరిగణించారు. దీనిని సమర్ధించడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించబడే, దాని సరిహద్దులు మార్చబడే, రాష్ట్రహోదా రద్దు చేయబడే ఇతర రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి తీవ్రమైన నిర్ణయమైనా, చట్టమైనా, శాసనమైనా చేసే హక్కు పార్లమెంట్‌కు ఉందన్న కోర్టు తీర్పు అనేక కొత్త సమస్యలకు దారితీస్తుంది. పైగా ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం దేశంలో ఇదే తొలిసారి.

ఆర్టికల్‌ 370 తాత్కాలికమేనని, భారత యూనియన్‌లో చేరిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు సార్వభౌమాధికారం లేకుండా పోయిందని న్యాయస్థానం కేంద్రం చేసిన అన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యలను సమర్థించింది. భారత యూనియన్‌లో జమ్ముకాశ్మీర్‌ విలీనం ఇప్పుడు రద్దు చేసిన 370వ అధికరణలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా నిలుపుకునే షరతుమీదే జరిగాయన్న అంశాన్ని సుప్రీం విస్మరించింది. దేశంలో అన్ని రాష్ట్రాల మాదిరిగానే జమ్ముకాశ్మీర్‌ కూడానని పేర్కొనడం ద్వారా 371వ అధికరణలోని వివిధ క్లాజుల కింద ఈశాన్య రాష్ట్రాలకు, మరికొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులు కూడా కోల్పోయేలా తాజా తీర్పు ఉంది. దీని ప్రకారం జమ్ముకాశ్మీర్‌లోని కొంత భాగానికే రాష్ట్రహోదా పునరుద్ధరిస్తారు. లడక్‌ కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతుంది. ఆర్టికల్‌ 370 తాత్కాలికమా లేదా దాన్ని సవరిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటవుతుందా అనే ఎనిమిది ప్రశ్నలపై న్యాయస్థానం చేసిన సూత్రీకరణలు గతంలో ఫెడరలిజంపై తానిచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయి. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం చట్టవిరుద్ధమైన, మోసపూరితమైన మార్గాన్ని అవలంబించింది. దాన్ని రద్దు చేయాలన్న దుర్బుద్ధితోనే మొదటి జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన కిందకు తెచ్చుకుంది. రాజ్యాంగ నిర్మాణ సంస్థను శాసన సభగా మార్చుతూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులే కాశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దుకు కారణం.

రాజ్యాంగంలోని మూడో అధికరణాన్ని తొలిసారిగా ఒక రాష్ట్రాన్ని తగ్గించేందుకు నేరుగా ఉపయోగిస్తే దానిలో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం సబబు కాదు. కేంద్రం అపరిమిత అధికారాలతో రాష్ట్రపతి పేరిట చేసిన వాటిని ఆమోదించడమే కాకుండా ఎన్నికలు 2024 సెప్టెంబర్‌లోగా జరపాలని ఆదేశించడం సుదీర్ఘ సమయం ఇవ్వడమే. ఈ తీర్పుతో సంబరపడుతున్న బిజెపి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి వెసులుబాటు కల్పించడమే. 370 రద్దు చేసిన అనంతర పరిస్థితులు, పునరేకీకరణ కమిషన్‌ లాంటిది వేయాలని సర్వోన్నత న్యాయస్థానం చెబుతూ అది కూడా కేంద్రానికే వదిలేసింది. ఈ తీర్పును జమ్ముకాశ్మీర్‌కు చెందిన పార్టీలతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సమాఖ్య విధానం, రాష్ట్రాల ప్రతిపత్తి, విలీన సమయంలో కాశ్మీర్‌కు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం దేశసమైక్యతకు, సమగ్రతకు అవసరం. ఇప్పటికే రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం మరింత ఏకపక్షంగా వ్యవహరించే ప్రమాదం పొంచి వుంది.

➡️