ఓపిఎస్‌పై ఎవరెటు ?

Jan 27,2024 07:14 #Editorial

             ‘ప్రజలకు సేవ చేయడానికే మా జీవితం. మాది ప్రజల పక్షం’ అంటూ కొన్ని రాజకీయ పార్టీల నేతలు పదేపదే చెబుతూ ఉంటారు. తీరా కీలక సందర్భం వచ్చినప్పుడు మనకు నచ్చజెప్పి, ఎదుటి పక్షం వైపు నిలబడడం, అందరినీ కలుపుకోవడం కోసం అని చెప్పడం, అంతిమంగా తమ వర్గ ప్రయోజనం కోసం నిలబడడం. అందుకే చెప్పే మాటలను బట్టి కాకుండా, కీలక సమయంలో ఎటువైపు నిలబడు తున్నారనేది బట్టి వారు ఎవరి పక్షమో తెలుస్తుంది. సిపిఎస్‌ విధానం తప్పని ఓ.పి.యస్‌ అమలు చేస్తామని చెప్పి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదెవరు? హామీని హామీగానే ఉంచిందెవరు? పోరాటం చేస్తుంటే మద్దతు ప్రకటించకుండా చోద్యం చూస్తున్నదెవరు? నిశితంగా గమనిస్తేనే ఎవరు ఏ పక్షమో తెలుస్తుంది.

ప్రజల హక్కుల్ని మార్కెట్‌ శక్తులకు వదిలేసే విధానాన్ని అమలు చేయాలనే ప్రపంచబ్యాంకు, ఐ.ఎం.ఎఫ్‌ సంస్థల ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటించే దానిలో భాగంగా వచ్చిందే పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఏ చట్టం. వామపక్షాలు తప్ప అన్ని పార్టీలు సమర్థించాయి. 2003 డిసెంబర్‌ 22న సి.పి.ఎస్‌. తెస్తున్నామని రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 2004 నుండి కేంద్ర ప్రభుత్వం, సెప్టెంబర్‌ 2004 నుండి రాష్ట్ర ప్రభుత్వం సి.పి.ఎస్‌.ని అమలు చేసేశాయి.

ప్రస్తుతం సిపిఎస్‌ …

             సి.పి.ఎస్‌. రద్దు చేయలేమని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన. మరొపక్క ఛతీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జార్ఖండ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడమే కాదు, అమలు చేస్తున్నాయి కూడా. తాజాగా కర్ణాటక, తమిళనాడు, అస్సాం, తెలంగాణ రాష్ట్రాలు పాత పెన్షన్‌ అమలు చేయడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిపిఎస్‌ను వారంలో రద్దు చేసి, పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా, పాత పెన్షన్‌ ఇవ్వలేమంటూ…దాని స్థానంలో గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జి.పి.ఎస్‌.)ని అమలు చేస్తామని మరో కొత్త పెన్షన్‌ విధానాన్ని ముందుకు తెచ్చింది. సి.పి.ఎస్‌. విధానాన్ని తొలిత ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ…తాను పరిపాలిస్తున్న రాష్ట్రాలలో పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించి అమలు చేస్తుండడం విశేషం. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా వాటి వైఖరి ఏమిటో ప్రకటించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ప్రకటనలు, చర్చలు, కమిటీల ఏర్పాటుతో ఎటువంటి ఉపయోగం లేదని ఉద్యోగులు భావిస్తున్నారు. సి.పి.ఎస్‌, జి.పి.ఎస్‌ రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం దేనిని అంగీకరించబోమని ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రకటిస్తున్నారు.

రాష్ట్రంలో పార్టీల వైఖరి …

              2004 సెప్టెంబర్‌ 1 నుంచి సిపిఎస్‌ అమలు చేయడానికి నాటి రాజశేఖర్‌ రెడ్డి (కాంగ్రెస్‌) ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నాటి ప్రతిపక్షం తెలుగు దేశం ఎలాంటి ప్రతిఘటన లేకుండా సిపిఎస్‌ అమలుకు సహకరించింది. సిపిఎస్‌ రద్దు చేయాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు 2019 ఎన్నికలకు ముందు పెద్దఎత్తున పోరాటం చేశాయి. ”సిపిఎస్‌ రద్దు చేస్తారా గద్దె దిగుతారా” అనే నినాదం రాజకీయ పార్టీల్లో కదలిక తెచ్చింది. 2019కి ముందు అధికారంలో ఉన్న నాటి ప్రభుత్వం టక్కర్‌ కమిటీని నియమించి 50 శాతం పెన్షన్‌ మాత్రం ఇస్తామంటూ ప్రతిపాదించింది. అదే సందర్భంలో పాదయాత్రలో ఉన్న ప్రస్తుత రాష్ట్ర అధినేత అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తారని ప్రకటించి మేనిఫెస్టోలో పెట్టడంతో ఉద్యోగ సంఘాలన్నీ నమ్మాయి. కాని, నాలుగు సంవత్సరాల తర్వాత సిపిఎస్‌ రద్దు చేయడం సాధ్యం కాదని, ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది అని మరొక ప్రత్యామ్నాయం అయినటువంటి ”గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌”ని అమలు చేస్తామంటూ చట్టం చేశారు. అయితే ”సిపిఎస్‌, జిపిఎస్‌ వద్దు-పాత పెన్షన్‌”ని అమలు చేయాలనే పోరాటాలు ఊపందుకుంటున్నాయి. రకరకాల వేదికల ద్వారా పెద్ద ఎత్తున ప్రతిఘటన ప్రారంభమైంది. కాని, ప్రభుత్వం జిపిఎస్‌ అమలు వైపే మొగ్గు చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సిపిఎస్‌ రద్దు చేస్తే ఎన్‌.ఎస్‌.డి.ఎల్‌ లో దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించబోమంటూ బెదిరిస్తున్నది. సి.పి.ఎస్‌.రద్దు అంశం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నదని రాష్ట్రాలు చెబుతుంటే, కాదు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉందని కేంద్రం చెబుతున్నది. ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని సంఘాల్ని ప్రోత్సహిస్తూ సంఘటిత ఉద్యమాన్ని బలహీనపరిచే వైఖరి కొన్ని పక్షాలు తీసుకుంటున్నాయి.

ఓట్‌ ఫర్‌ ఓ.పి.ఎస్‌

              ఇది ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదమే కాదు, ప్రజల నినాదం కూడా. 1982 డిసెంబర్‌ 17న ”డి.ఎస్‌.నకార వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా” కేసులో వై.వి చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పెన్షన్‌పై ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పెన్షన్‌ ఉద్యోగి ప్రాథమిక హక్కు. గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. ఎవరి దయాధర్మ భిక్ష కాదు. రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. ”ప్రతి ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి” అని తీర్పు చెప్పింది. రేపు ఉద్యోగానికి రాబోయే వారికి సామాజిక భద్రత ఉండాలంటే ”పాత పెన్షన్‌” కావాలి. పెన్షన్‌ హక్కుపై పార్టీల వైఖరిని స్పష్టం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. గతంలో ఏం చెప్పారు? ఏం చేశారనే దాని కంటే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ అయిన ”పాత పెన్షన్‌”పై ఒక స్పష్టమైన విధానం ప్రకటించాలి. ఈ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఉద్యోగుల పక్షాన నిలబడాలని వారు కోరుకుంటున్నారు. పాత పెన్షన్‌ ఇచ్చే వారికే ఓటు ఇచ్చి బలపరుస్తామని బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. అందుకని పాత పెన్షన్‌ని రాజకీయ, ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక భద్రత కోణంలో చూడాలి. ”కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ రంగంలోని వారికి ఎలాంటి పెన్షన్‌ విధానం లేదు. వీరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. పెన్షన్‌ విధానాన్ని ప్రకటించాలి” అనే డిమాండ్‌ కూడా ఈ రోజు ముందుకు వస్తున్నది. పాత పెన్షన్‌ ఇస్తే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమవుతుందని కొందరు అప్రకటిత మేధావులు ప్రచారం చేస్తున్నారు. కార్పొరేట్లకు ప్రతి సంవత్సరం లక్షల కోట్లు పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల రాని ఆర్థిక నష్టం పాత పెన్షన్‌ వల్ల వస్తుందని చెప్పడంలో ఆంతర్యాన్ని గమనించాలి. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు పాత పెన్షన్‌పై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. ఉద్యోగులందరికి సామాజిక భద్రతను కల్పించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని కోరే శక్తులకు మద్దతుగా నిలబడాలి.

/ వ్యాసకర్త యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు/ ఎన్‌.వెంకటేశ్వర్లు
/ వ్యాసకర్త యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు/ ఎన్‌.వెంకటేశ్వర్లు
➡️