ఉదారవాద విధానాలపై పోరులో మహిళా కార్మిక శక్తి

Dec 1,2023 07:18 #Editorial

ఇటీవలి పోరాటాలకు సంబంధించి తప్పక చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం ఒకటుంది. అదేమిటంటే మహిళల ప్రాతినిధ్యం పెరగడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అది కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, విద్యార్ధి మరే ఇతర వర్గాలైనా సరే వారి పోరాటంలో మహిళల పాత్ర ప్రధానంగా వుంటోంది. కార్మిక సంఘాలు చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా సరే…అది జాతీయ స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా లేదా అంతకంటే కింది స్థాయి అయినా వర్కింగ్‌ మహిళల ప్రాతినిధ్యం ఎప్పుడూ కూడా 40 నుండి 45 శాతంగా వుంటోంది. కొన్ని సందర్భాల్లో అయితే 50 శాతం కూడా దాటుతోంది. భారతదేశంలో కార్మికోద్యమం ముఖ్యంగా మహిళా కార్మికుల ఉద్యమం రైతుల పోరాటాల్లో కీలక పాత్ర పోషించింది.

దేశం ఒకపక్క ఆర్థికంగా సూపర్‌ పవర్‌గా మారుతోందని మోడీ ప్రభుత్వం చెబుతుంటే…మరోపక్క ప్రపంచ ఆర్థిక వేదిక గణాంకాల ప్రకారం లింగ సమానతలో 146 దేశాల్లో భారత్‌ 127వ స్థానంలో వుంది. మనం నిరుద్యోగానికి సంబంధించి అత్యంత అధ్వానమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. భారత్‌లో మహిళల పని ప్రాతినిధ్య రేటు 30 శాతం కన్నా తక్కువగా వుంది. అందులో సగం మంది ఎలాంటి చెల్లింపులు లేని హెల్పర్లే! మెజారిటీ వ్యవసాయ కార్మికులు మహిళలే. వ్యవసాయ కార్యకలాపాల్లో ప్రధాన భాగం నిర్వహించేది, చిన్న చిన్న కమతాల్లో జంతువుల పెంపకం వంటి పనులు చేసేది ఆయా కుటుంబాలకు చెందిన మహిళలే, కానీ వారిని ఎన్నడూ రైతులుగా పరిగణించరు. లేదా వారికి స్వంతంగా భూమి వుండదు. లేదా వాటిపై ఎలాంటి చట్టపరమైన హక్కులు, అర్హతలు వుండవు. ఇళ్లల్లో పని చేయడం వంటి వృత్తుల్లో వుండే మహిళలు అత్యంత అమానుషమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వుంటారు. వారికి ఎలాంటి చట్టబద్ధమైన రక్షణ వుండదు. పైగా పురుషులతో పోలిస్తే వీరి వేతనాల్లో అంతరాలు చాలా ఎక్కువగా వుంటాయి. పని ప్రదేశాల్లో ఎలాంటి భద్రత లేదా రక్షణ వుండదు.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు – వేతన అసమానతలు

దాదాపు కోటి మంది మహిళా కార్మికులు వున్నారు. భారత ప్రభుత్వం అమలు చేసే వివిధ మౌలిక సేవల పథకాల్లో పనిచేసే స్కీమ్‌ వర్కర్లు ఫ్రంట్‌లైన్‌ కమ్యూనిటీ వర్కర్లుగా వున్నారు. వారిని వలంటీర్లుగా వ్యవహరిస్తారు. వారికి కనీస వేతనాలు, సామాజిక భద్రతతోపాటు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు వుండవు. కోవిడ్‌ నిర్వహణలో ప్రధాన భాగం, ప్రజలతో ప్రత్యక్షంగా పెట్టుకునే సంబంధాలు వంటివన్నీ ఈ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోనే చేయించారు. కానీ, వేతనాల్లో లింగ అసమానత పెరుగుతోంది. వివిధ అధ్యయనాల్లో వెల్లడైన అంశాల ప్రకారం, పురుష కార్మికులు లేదా ఉద్యోగులు, మహిళా కార్మికులు లేదా ఉద్యోగుల మధ్య వేతనాల్లో అంతరం 35-55 శాతంగా వుంది.

రక్షణ కరువు

మహిళా కార్మికులు ముఖ్యంగా అసంఘటిత రంగాల్లోని మహిళా కార్మికుల్లో అత్యధికులకు ఎలాంటి ప్రసూతి ప్రయోజనాలు రావు. క్రెచ్‌ సదుపాయాలు వుండవు. వారు రాత్రివేళ్లల్లో కూడా విధులు నిర్వహించాల్సి వుంటుంది. మహిళలకు కల్పించిన రక్షణాత్మక చట్టాలన్నీ లేబర్‌ కోడ్‌ల ద్వారా లాగేసుకుంటున్నారు. ఇళ్లల్లో హింస, అలాగే పని ప్రదేశాల్లో హింస ప్రమాదకరమైన రీతిలో పెరిగిపోయింది. మహిళల పాత్రలను పున: సాంప్రదాయీకరణ చేయడం ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ రంగంలో క్యాజువలైజేషన్‌, కాంట్రాక్టీకరణ జరిగాయి.

తిరోగమన విధానాలపై ప్రతిఘటన

పాలక వర్గాలు అనుసరించే వివిధ మార్గాలు, పద్ధతుల ద్వారా పెట్టుబడిదారీ సంక్షోభ భారంలో మహిళా కార్మికులు అసమానమైన రీతిలో తమ వాటాను భరించాల్సి వస్తోంది. దీంతో వారు కార్మిక సంఘాల ద్వారా సంఘటితం అవుతున్నారు. తద్వారా ప్రభుత్వ దాడులను తిప్పికొట్టడంలో చారిత్రక పాత్ర పోషిస్తున్నారు. కార్మిక వర్గం, రైతాంగ ఉద్యమాల్లో మాదిరిగానే, ఇక్కడ కూడా కార్పొరేట్‌, మతోన్మాద కూటమి అనుసరించే తిరోగమన విధానాలను మహిళా కార్మిక ఉద్యమం తీవ్రంగా ప్రతిఘటిస్తూనే వుంది. ఇటీవలి పోరాటాలకు సంబంధించి తప్పక చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం ఒకటుంది. అదేమిటంటే మహిళల ప్రాతినిధ్యం పెరగడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అది కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, విద్యార్ధి మరే ఇతర వర్గాలైనా సరే వారి పోరాటంలో మహిళల పాత్ర ప్రధానంగా వుంటోంది. కార్మిక సంఘాలు చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా సరే…అది జాతీయ స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా లేదా అంతకంటే కింది స్థాయి అయినా వర్కింగ్‌ మహిళల ప్రాతినిధ్యం ఎప్పుడూ కూడా 40 నుండి 45 శాతంగా వుంటోంది. కొన్ని సందర్భాల్లో అయితే 50 శాతం కూడా దాటుతోంది. భారతదేశంలో కార్మికోద్యమం ముఖ్యంగా మహిళా కార్మికుల ఉద్యమం రైతుల పోరాటాల్లో కీలక పాత్ర పోషించింది.

పెరిగిన ప్రాతినిధ్యం

పెద్ద ఎత్తున ప్రజా సమీకరణలు, సుదీర్ఘ సమ్మెలు చేపట్టడం ద్వారా స్కీమ్‌ వర్కర్లు-అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు-సిఐటియు నేతృత్వంలో కార్మిక వర్గంలోనే అత్యంత సమరశీలురుగా ఆవిర్భవించారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో స్కీమ్‌ వర్కర్లు అనేక విజయవంతమైన సమ్మెలు నిర్వహించారు. హర్యానా లోని 73 రోజుల ఆశా వర్కర్ల సమ్మె తీవ్ర అణచివేతను ఎదుర్కొంది. అయినప్పటికీ, హర్యానా లోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రం నుంచి నెలవారీ వేతనంగా రూ.6100 ఇచ్చి, అదనంగా 50శాతం రాయితీలు చెల్లించేలా చేసింది. గతేడాది హర్యానాలో అంగన్‌వాడీ కార్మికులు చేసిన సమ్మె నాలుగు మాసాల పాటు సాగింది. తర్వాత వారికి దాదాపు రూ.1200 అదనపు మొత్తం వేతనంగా అందజేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఆశా వర్కర్ల 62 రోజుల సమ్మె, బీహార్‌లో 32 రోజుల సమ్మె, జమ్మూకాశ్మీర్‌లో దాదాపు రెండు మాసాలపాటు జరిగిన సమ్మె, మహారాష్ట్రలో 22 రోజుల పాటు జరిగిన సమ్మెలతో వారి వేతనాల్లో ఒక మోస్తరు పెంపుదల లభించింది. మరోపక్క ఢిల్లీలో అంగన్‌వాడీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. హర్యానా లోని మధ్యాహ్న భోజన కార్మికులు కూడా సమ్మె ద్వారా రూ.7500 వేతనాన్ని సాధించుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, తెలంగాణ, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో కూడా గత కొన్నేళ్లలో పెద్ద పెద్ద పోరాటాలే జరిగాయి. ఈ పోరాటాల ద్వారా ఆయా సంఘాలు వేతనాలు పెంచగలిగాయి. రాష్ట్ర స్థాయిలో వన్‌ టైమ్‌ రిటైర్మెంట్‌ ప్రయోజనాలు వంటి సదుపాయాలను కూడా పొందగలిగారు. ఈ పోరాటాలు చెల్లింపులు లేని పనికి సంబంధించిన అంశాన్ని జాతీయస్థాయి చర్చల్లో ముందుకు తీసుకువచ్చాయి. సంరక్షణ పని, సంరక్షణ ఉద్యోగాల నాణ్యత గురించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చాయి. అసంఘటిత రంగాల్లో గల విస్తృత సంఖ్యలోని కార్మికులకు పోరాటాలు చేయగలిగే విశ్వాసాన్ని ఈ పోరాటాలు కల్పించాయి. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లోగా బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ 50 లక్షల కుటుంబాలకు ప్రచారం చేరాలని స్కీమ్‌ వర్కర్లు నిర్ణయించారు.

కార్మిక వర్గ పోరాటాల్లో, సంఘీభావ చర్యల్లో మరింతమంది మహిళలు పాల్గొనడం వల్ల రైతాంగ పోరాటాల్లో కూడా మరింత మంది మహిళలు రావడానికి వీలవుతుంది. ఇది రైతులు, కార్మికుల మధ్య ఐక్యతకు దోహదపడుతుంది. నవంబరు 26-28 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన కార్మిక కర్షక మహా ధర్నా భారతదేశంలోని వర్గ పోరాటాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ మహిళల ప్రాతినిధ్యం అనేక సామాజిక అడ్డంకులను ఛేదించడంలో, పలు రంగాల్లో, ప్రాంతాల్లో పోరాటాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది.

/ వ్యాసకర్త సిఐటియు అఖిల భారత కార్యదర్శి/ఎ.ఆర్‌. సింధు

editorial
news
➡️