ఈ ఏడాది సందడే సందడి

Jan 1,2024 11:26 #vinodam

ఈ ఏడాది ఆరంభం నుండి సినిమా ప్రేక్షకులకు గొప్ప పండగ వాతావరణం కనపడుతోంది. సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి ఇలా ప్రతి పండగకు వరుసగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. ముందుగా సంక్రాంతి పండగకు ‘గుంటూరు కారం’తో మహేష్‌బాబు, ‘నా సామిరంగ’తో నాగార్జున, ‘సైంధవ్‌’తో వెంకటేష్‌, ‘ఈగల్‌’తో రవితేజ వంటి పెద్ద నటులు పోటీపడుతుంటే, కుర్ర హీరో తేజ సజ్జా కూడా ‘హనుమాన్‌’తో వచ్చేస్తున్నాడు. తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో ధనుష్‌ కూడా ఈ సంక్రాంతికి ‘కెప్టెన్‌ మిల్లర్‌’తో పలకరిస్తున్నాడు.

ఈ సినిమాల మధ్యలో ‘సర్కారు నౌకరి’ అంటూ సింగర్‌ సునీత తనయుడు డెబ్యూ మూవీతో వస్తున్నాడు. ‘తంగలాన్‌’ అంటూ విక్రమ్‌, రోహిత్‌ ‘ప్రతినిథి-2’, రజనీకాంత్‌ ‘లాల్‌ సలామ్‌’తో వస్తున్నారు. థియేటర్ల సర్దుబాటు కాక కొన్ని సినిమాలు పండగ బరి నుండి తప్పుకున్నా, జనవరిలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఫిబ్రవరిలో ‘టిల్లు స్క్వేర్‌’తో సిద్ధు జొన్నలగడ్డ, వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’, సందీప్‌ కిషన్‌ ‘ఊరు పేరు భైరవకోన’తో సిద్ధంగా ఉన్నారు. ఇక మార్చిలో విజయ్ దేవర కొండ ‘ఫ్యామిలీస్టార్‌’తో వస్తున్నారు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అంటూ రామ్‌ కూడా మార్చికే రెడీగా ఉన్నారు. విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో వస్తున్నారు.

వేసవి జాతర

ఇక వేసవిలో ఎన్‌టిఆర్‌ అభిమానులు తెగ సంబరపడిపోయేలా ‘దేవరా’ చిత్రం విడుదలవుతోంది. ఎన్‌టిఆర్‌, కొరటాల కాంబినేషనల్లో ఏప్రిల్‌కి వస్తోందీ చిత్రం. అలనాటి సీనియర్‌ హీరోయిన్‌ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ ఈ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమవుతోంది.అలాగే వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898ఎడి’ చిత్రం మే నెలలో విడుదల చేస్తామని చిత్రబృందం గతంలోనే ప్రకటించింది.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకొనే, దుల్కర్‌ సల్మాన్‌ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అలాగే శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా చేసిన ‘గేమ్‌ చేంజర్‌’ కూడా వేసవికి సిద్ధమైంది. ఇంకా రిలీజ్‌ డేట్‌ ప్రకటించని ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా వేసవికి కూడా పెద్ద హీరోల సినిమాలు క్యూ కట్టాయి.

పోటీ లేకుండా

వరుసగా అందరు స్టార్లు బాక్సాఫీసు బరిలో నిలుస్తుంటే ఎప్పుడో షూటింగ్‌ మొదలుపెట్టిన ‘పుష్ప-2’ మాత్రం ఆగష్టులో విడుదలకు సిద్ధమై తనకు పోటీ లేకుండా చేసుకుంటోంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రం ‘పుష్ప’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

శరవేగంగా చేస్తున్నారు..

పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలను కూడా ఈ ఏడాదే విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మొదలుపెట్టిన చిత్రాల షూటింగులు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ఎన్‌బికె-109 కూడా 2024కి సిద్ధం చేస్తున్నారు. ‘బింబిసార’ చిత్ర దర్శకుడు వశిష్టతో చిరంజీవి చేస్తున్న ‘మెగా-156’ షూటింగ్‌ కూడా వేగంగా సాగిపోతోంది.

వివేక్‌ ఆత్రేయతో నానీ మొదలుపెట్టిన ‘సరిపోదా శనివారం’ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల చేయాలని చూస్తున్నారు. ఆగస్టుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రీకరణ కూడా తాజాగా మొదలైంది. 2024లోనే విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.

పరభాషా చిత్రాలు కూడా..

వీళ్లందరితో పాటు తమిళ హీరోలు కూడా ఈ ఏడాది తెలుగు అభిమానులను ఖుషీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ధనుష్‌, రజినీకాంత్‌తో పాటు ‘అయలాన్‌’ అంటూ శివకార్తికేయ వస్తున్నారు. సూర్య ‘కంగువ’తో బరిలోకి దిగుతున్నారు. కమల్‌ అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఇండియన్‌ -2’. కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషనల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇది కూడా ఈ ఏడాదే విడుదల చేయాలని చిత్రబృందం శరవేగంగా షూటింగ్‌ చేస్తోంది. మలయాళం, కన్నడ చిత్రాలు కూడా ఈ ఏడాదికి ముస్తాబవుతున్నాయి. మోహన్‌లాల్‌, ముమ్ముట్టి, రిషబ్‌శెట్టి, ఫాహద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖ నటీనటులు ప్రేక్షకులను అలరించనున్నారు. ఇలా ఈ ఏడాదంతా సినిమా జాతర కనిపిస్తోంది.

➡️