నా సినిమా మార్చికి వాయిదా వేశా : దిల్‌రాజు

Dec 27,2023 08:58 #dil raju, #movie

‘నేనైతే సంక్రాంతికి రావాల్సిన నా చిత్రాన్ని మార్చికి వాయిదా వేసుకున్నా. మిగతా ఐదుగురిలో ఎవరో ఒకరు తగ్గితే వాళ్లకు ఆ తర్వాత ఛాంబర్‌ ద్వారా సోలో డేట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం’ అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు. ప్రముఖ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులతో 1999లో ప్రారంభమైన లిటిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ 25 సంవత్సరాలు పూర్తిచేసుకోనుంది. జనవరి 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలలో సిల్వర్‌జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతికి రానున్న ఐదు చిత్రాల్లో ఒకటో రెండో తగ్గితే మిగతా సినిమాలకు థియేటర్లు సంక్రమంగా సరిపోతాయన్నారు. ఒకవేళ ఎవ్వరూ తగ్గకపోతే అన్ని సినిమాలు పండక్కే వస్తాయని స్పష్టంచేశారు. అదే జరిగితే చిన్న సినిమాలకు న్యాయం జరగబోదన్నారు. ఏ సినిమా బాగుంటే అదే పండుగ తర్వాత ఆడుతుందన్నారు. అనుకున్న తేదీకి సినిమా రాకపోతే ఆడదేమో, వసూళ్లు రావేమో అనేది అపోహ మాత్రమేనన్నారు. దానికి సలార్‌ సినిమానే ఉదాహరణగా చెప్పారు. త్వరలోనే తెలుగు ఫిలిం ఛాంబర్‌ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ తరపున తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవబోతున్నామన్నారు. ఈ సమావేశంలో గురు రామాచారి, రమ్య బెహరా తదితరులు పాల్గొన్నారు.

➡️