వేసవి సినిమాలకు ‘ఎన్నికల’ సెగ ?

Mar 11,2024 10:29 #vinodam

             ఏటేటా వేసవిలో పెద్ద హీరోల సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు సృష్టిస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ వాతావరణం ఉంది. అయితే ఈ సీజన్‌లో పెద్ద హీరోల సినిమాలు పెద్దగా వచ్చేలా కనిపించటం లేదు. నడుస్తున్న ప్రాజెక్టులు కూడా ఈకాలంలో పూర్తయ్యే అవకాశాల్లేవు. అందువల్ల వాయిదాల పరంపర కొనసాగుతోంది.
జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’, రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, అల్లు అర్జున్‌ పుష్ప-2′, ప్రభాస్‌ ‘కల్కి 2898’ చిత్రాలు ఇంకా షూటింగులను కొనసాగిస్తున్నాయి. ఎన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘దేవర’ సినిమా మొదట్లో వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న విడుదల చేస్తారని అందరూ భావించారు. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా అక్టోబర్‌ 10కి వాయిదా పడింది. విలన్‌ రోల్‌ పూర్తికాలేదనీ, నేపధ్య సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ చాలా సమయం తీసుకుంటున్నారనేది సమాచారం.
అల్లు అర్జున్‌ నటించిన సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప-2 కూడా ఆగస్టు 15న విడుదల కానుంది. మొదట్లో సంక్రాంతి బరిలో నిలుస్తుందని భావించారు. తాజాగా ఈ సినిమా ఆగస్టు 15కు విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అర్జున్‌ తదుపరి చిత్రం కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ కథను సిద్ధం చేశారని సమాచారం. ఇదిలావుండగా ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల వాతావరణం నెలకొని ఉంటుంది. ఎన్నికల హడావుడిలో సినిమాలకు కలెక్షన్లు ఉండబోవనే ఆలోచనలతో దర్శకులు, నిర్మాతలు విడుదలకు వెనక్కి నెట్టేస్తున్నట్లుగా కూడా ప్రచారం. అయితే, ఈ వేసవిలో విడుదల అయ్యే సినిమాలు కొన్ని ఉన్నాయి.

కల్కి 2898 : ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఇది. మే 9న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా మరో మూడు చిత్రాల్లో నటిస్తూ ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సలార్‌ 2 కాల్షీట్లు పూర్తయ్యాయనీ, ‘రాజా సాబ్‌’ చిత్రీకరణలో కూడా ఆయన పాల్గొంటున్నట్లుగా సమాచారం.

టిల్లు స్వేర్‌ : హీరోగా సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటించిన చిత్రం టిల్లు స్వేర్‌ (టిల్లు-2) ఈనెల 29న విడుదల కానుంది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో కామెడీ, డ్రామాతో ఈ సినిమా తెరకెక్కించారు. డిజె టిల్లు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. సంక్రాంతి నుంచి మూడుసార్లు వాయిదా పడింది.

ప్యామిలీ స్టార్‌ : విజయ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. పరశురామ్‌ పెట్ల దర్శకత్వం వహించారు. మృణాల్‌ఠాకూర్‌, అజరుఘోష్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

                                                                              కొత్త ప్రాజెక్టులు షురూ…

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎన్‌బికె 109 (వర్కింగ్‌ టైటిల్‌) నుంచి చిత్రబృందం శుక్రవారం ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేసింది. యాక్షన్‌ స్వీక్వెన్స్‌తో రూపొం దించిన గ్లింప్స్‌లో బాలకృష్ణను దర్శకుడు బాబీ ‘నేచురల్‌ బోర్న్‌కింగ్‌’గా చూపించారు. సితార ఎంటైర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది. ఆర్‌సి16 మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌ ఈనెల 27న శ్రీకారం చుట్టనున్నారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజైన ఈనెల 27న అభిమానులకు కానుకగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయటానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.
హీరో చిరంజీవి 156వ సినిమా ‘విశ్వంభర’ షూటింగ్‌ కొసాగుతోంది. చిరంజీవి నటించే పార్టు షూటింగ్‌ వేసవిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో చిరంజీవి పేరు ‘భీమవరం దొరబాబు’గా ఉంటుందని సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
మహేష్‌బాబు – రాజమౌళి కాంబోలో ఎస్‌ఎస్‌ఎంబి 20 ప్రాజెక్టు మొదలు కానుంది, హాలీవుడ్‌ సన్షేషనల్‌ డైరెక్టర్‌ జేమ్స్‌కామెరాన్‌ ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌ రాబోతున్నట్లుగా సమాచారం.

➡️