తెలుగు తెరపై తొలి మెరుపులు

Dec 11,2023 11:33 #First, #Telugu screen, #vinodam

               సినిమా ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ భాష కంటే భావానికే పెద్దపీట. అందుకే తన, మన అన్న భేదం లేకుండా పరాయి భాషా నటీనటులు కూడా విజయాలను అందుకుంటూ ఉంటారు. ఇక్కడి వారు అక్కడ, అక్కడి వారు ఇక్కడ ఎప్పుడూ వెండితెరను ఏలినవారే. ఏలుతున్నవారే. అలా తెలుగు ఇండిస్టీకి పరిచయమై వరుస అవకాశాలతో రాణిస్తున్న శ్రీలీల, సంయుక్త మీనన్‌ కూడా ఆ జాబితాలో ఉన్నారు. వారి బాటలోనే, మొదటి సినిమాతో ఇండిస్టీకి పరిచయమైన వారి జాబితా ఈ ఏడాది కాస్తంత పెద్దదే.

ఏడాది ప్రారంభంలో సంతోష్‌ శోభన్‌ హీరోగా, యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో, అనిల్‌ కుమార్‌ ఆళ్ల దర్శకత్వంలో సంక్రాంతికి వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ప్రియా భవానీ శంకర్‌ తెలుగు తెరపై తొలిసారి కనిపించారు. తమిళంలో అడపాదడపా నటించినా ఈ సినిమా ఆమె తెలుగు డెబ్యూగా నిలిచిపోయింది.

జనవరిలోనే విడుదలైన ‘బుట్టబొమ్మ’ చిత్రంలో నటించిన అనికా సురేంద్రన్‌ కూడా తెలుగులో తొలిసారి కథానాయికగా నటించారు. అంతకు ముందు నాగార్జున ‘ఘోస్ట్‌’ చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు. హీరోయిన్‌గా ‘బుట్టబొమ్మ’ ఆమెకి తొలి సినిమా.

ఫిబ్రవరిలో విడుదలైన కళ్యాణ్‌రామ్‌ ‘అమిగోస్‌’ చిత్రంలో కనిపించిన ఆషికా రంగనాథ్‌ డెబ్యూ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో విడుదలైన ‘అహింస’ సినిమా హీరోయిన్‌ గీతికా తివారీ కూడా ఇండిస్టీకి కొత్త అమ్మాయి. బెల్లంకొండ సాయి గణేశ్‌తో ‘నేను స్టూడెంట్‌ సార్‌’ చిత్రంలో నటించిన అవంతిక దాసానీ బాలీవుడ్‌ నుంచి తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఈమె అలనాటి నటి భాగ్య శ్రీ కూతురు. ఈ ఏడాది సంతోష్‌ శోభన్‌ మరో చిత్రంతో వచ్చారు. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీదేవి శోభన్‌ బాబు’తో గౌరి జి.కిషన్‌ తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆనంద్‌ దేవరకొండ హీరోగా సాయి రాజేష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బేబీ’ చిత్రంలో వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

అడపాదడపా తెలుగు చిత్రాల్లో కనిపించినా అవన్నీ చిన్న చిన్న పాత్రలే. దీంతో ‘బేబీ’ చిత్రంతో మొట్టమొదటిసారి హీరోయిన్‌గా నటించి, గొప్ప విజయాన్ని అందుకున్నారు. నాగశౌర్య ‘రంగబలి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన యుక్తీ తరేజకి తొలిసారి తెలుగుతెరకు పరిచయమయ్యారు.పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఈసారి తొలి పరిచయాలు ఎక్కువే ఉన్నాయి. వంశీ దర్శకత్వంలో వచ్చిన రవితేజ సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ పరిచయమయ్యారు.

అఖిల్‌ హీరోగా, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఏజెంట్‌’ చిత్రంలో నటించిన సాక్షి వైద్య డెబ్యూ హీరోయిన్ల జాబితాలో ఉన్నారు. ప్రభాస్‌, మారుతీ కాంబినేషనల్లో రాబోతున్న ‘రాజా డీలెక్స్‌’ చిత్రంలో నటిస్తున్న మాళవిక మోహనన్‌కు ఇది తొలి తెలుగు స్ట్రెయిట్‌ చిత్రం.

ప్రభాస్‌, నాగ్‌అశ్విన్‌ కాంబినేషనల్లో రాబోతున్న ‘ప్రాజెక్ట్‌ కె’తో దీపికా పదుకొనే తెలుగులో తొలిసారి నటిస్తున్నారు. ఇక ఎన్‌టిఆర్‌తో కొరటాల తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రంతో బాలీవుడ్‌ నటి జాహ్నవి తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.

➡️