అభివృద్ధి నుంచి హననం వరకూ..

Jan 29,2024 09:48 #vinodam

            సినిమా … ఒక బలమైన మాధ్యమం. సమాజంపై సినిమా ప్రభావం చాలా ఎక్కువ. మన దేశంలో సినిమాలు 1931 నుంచే ప్రారంభమయ్యాయి. ఈ సినిమాల్లో సమాజ పురోగమనానికి దోహదపడితే, మరికొన్ని సమాజ తిరోగమనానికి, క్షీణ విలువల వ్యాప్తికి కారణమవుతున్నాయి.

1960 నుంచి పరిశీలిస్తే అప్పటి సినిమాల్లో ఎక్కువగా సమాజం, అభివృద్ధి, మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కలిమిలేములు, వ్యవసాయం, ఉమ్మడి కుటుంబాలు వంటి అంశాలూ కీలకపాత్ర పోషించేవి. రైతులు అధారంగా తీసిన సినిమాలు వారి ఈతిబాధలు, పంటలు పండించే క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లు, వాటిని ఉమ్మడిగా ఎదుర్కోవడం, ఈ క్రమంలో కుటుంబాల మధ్య ఘర్షణలు, వాటినీ దాటుకుని చివరకు పంట ఇంటికి తెచ్చుకోవడం అనే అంశాల చుట్టూ తిప్పేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మోతుబరి రైతుల ఆగడాలు, వారి అనుచరుల అరాచకాలను తట్టుకుని నిలబడటం లాంటివి కథాంశాలుగా ఉండేవి. ఉమ్మడిగా అందరం కలిసి పోరాడాలనే తాత్పర్యం కీలకంగా వ్యక్తమయ్యేది. మధ్యలో ప్రేమలు, అందమైన వ్యక్తీకరణలు ఉండేవి. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో గోతికాడ నక్క లాంటి వ్యక్తులు చేరితే ఎలా ఉంటుందో చూపే కథలూ చాలా వచ్చాయి. అలాంటి సినిమాలను చూసి కుటుంబాలను చక్కదిద్దుకున్నవారూ ఉన్నారు. కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలకు లెక్కలేదు. అన్నా చెల్లెల్లు, తోడికోడళ్లు ఇలాంటి కోవలోనివే. తొలి తరం సినిమాలు దేవుడిని, భక్తిని; భక్తిచాటున జరిగే అన్యాయాలను చూపిస్తే, రెండోతరం సినిమాలు కుటుంబ సంబంధాలు, గ్రామీణ ప్రాంత జీవనం విధానం, కలిసిమెలిసి ఉండటం, ఐక్యంగా పోరాడటం వంటి అనేక అంశాల చుట్టూ తిరిగాయి. కుటుంబాల్లో వచ్చే కలహాలు, వాటిని సరిదిద్దే పనిలో హీరో తలమునకలవ్వడం, ఆయనకు ఇంట్లో ఎవరో ఒకరు సహకరించడం, ఈ మధ్యలో చిన్న చిన్న కొట్లాటలు, హాస్య సంభాషణలు … ఇలా సమాజంలో జరుగుతున్న నిజ అంశాల ఆధారంగా కథాంశాలు ఉండేవి. అక్కడక్కడా అతిశయోక్త కథనాలు కూడా ఉండేవి. అప్పటి నటులు కూడా ఆయా పాత్రల్లో లీనమైపోయేవారు. అత్త పాత్ర వేస్తే గొంతు, చూపు కటువుగా ఉండటం; అమ్మ పాత్ర వేస్తే ప్రేమను పంచడం, హీరోపాత్రలో ప్రేమ, మంచితనం, సాహసం … ఇలా పాత్రోచిత స్వభావాలు ఉండేవి.

నేడు వస్తున్న చాలా సినిమాలు అడ్డగోలుగా, తార్కిక రహితంగా తెర మీదికి వస్తున్నాయి. హీరో అంటే పెద్దపెద్ద కత్తులతో నరకడం, తుపాకులతో కాల్చడం అన్నట్లుగా ఉంటోంది. ఇటీవల ఒక సినిమాలో అయితే ఏకంగా మోర్టార్లు తెచ్చి మరీ కాల్చారు. అంటే ముష్టి యుద్ధం నుండి మోర్టార్ల దాకా హీరోయిజం మారుతూ వచ్చింది. పోనీ అదేమన్నా యుద్ధ సన్నివేశాలు అనుకుంటే అవసరం ఏమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ హీరో, దొంగల గ్రూపు మధ్య యుద్ధంలో మోర్టారు, తుపాకులతో విరుకుచుపడిన హీరో చివరకు కత్తితో నరికే పని పెట్టుకుంటాడు. మోర్టార్‌తో కాల్చినా చావనివాళ్లు కత్తులతో నరుకుతుంటే చేతులతో కొట్టిన దోమల్లా ఎగిరి ఎగిరి నలిగిపోవడం ఏంటో ఒక పట్టాన అర్థంకాదు.

ఇప్పటి సినిమాల్లో దోపిడీదారులు, దొంగలు, మైనింగ్‌, గంజాయి మాఫీయా చేసే వ్యక్తులే హీరోలుగా కనిపిస్తున్నారు. సినిమాలు సమాజాన్ని బాగుచేసే కోణం నుంచి పూర్తి విధ్వంసం దిశగా పయనిస్తున్నాయి. కెజిఎఫ్‌ నుంచి సలార్‌ వరకూ కథను పూర్తిగా మాఫియా చుట్టూనే తిప్పారు. అదేదో గొప్పతనం అన్నట్లు చూపించారు. మాఫియా క్రూరత్వాన్ని గొప్పగా ప్రదర్శించడం, దాని జోలికి వెళితే చనిపోవడం తప్ప మరొకటి ఉండదనే విధంగా చిత్రీకరిస్తున్నారు. సినిమా పెట్టుబడి అలాంటి మైనింగ్‌ మనుషుల నుంచి రావడం కూడా ఈ ధోరణికి ఒక కారణం కావొచ్చు.ఈ వాంఛనీయ ధోరణుల నుంచి సినిమా రంగం బయటపడాల్సిన అవసరం ఉంది. సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలను తీయాల్సిన అవసరం ఉంది.

– టి.గీతావాణి

➡️