‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ

Jan 12,2024 13:33

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టాయి. మళ్లీ చాలా గ్యాప్‌ తర్వాత వీరి కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ చిత్రం తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈసారి వీరి కాంబినేషన్‌లో విడుదలైన చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం…

కథ

వైరా వసుంధర (రమ్యకృష్ణ). భర్త సత్యం (జయరాం), పదేళ్ల కుమారుడు వెంకట రమణ (మహేష్‌బాబుని) వదిలేసి తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్‌రాజ్‌) దగ్గరకు వెళుతుంది. ఆమె మరోసారి నారాయణరావు (రావు రమేశ్‌)ని పెళ్లి చేసుకుంటుంది. వీరికి రాజగోపాల్‌ (రాహుల్‌ రవీంద్రన్‌) కుమారుడు ఉంటాడు. వెంకటస్వామి జనదళం పార్టీ అధినేత. తండ్రి బాటలోనే వసుంధర రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వెంకటస్వామి తన కుమార్తెను మంత్రిని చేయాలనుకుంటాడు. పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా ఆమెను న్యాయశాఖా మంత్రిని చేస్తాడు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యే మధు (రవిశంకర్‌) తాను ఆశించిన మంత్రి పదవి రాకపోవడంతో వసుంధరాకి రెండో పెళ్లి అని… ఆమె మొదట సంతానం గురించి బయటపెడతానని వెంకటస్వామిని బెదిరిస్తాడు. దీంతో వెంకటస్వామి కుమార్తె రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ముందుచూపుగా రమణను హైదరబాద్‌ పిలిపించి తన తల్లికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అగ్రిమెంట్‌ పేపర్స్‌ సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. రమణ ఈ అగ్రిమెంట్‌కి ఒప్పుకోడు. వెంకటస్వామి వకీలు పాణి (మురళీశర్మ) ఎలాగైనా రమణ చేత సంతకం పెట్టిస్తానని తన కుమార్తె అమ్ము (శ్రీలీల)ను రమణ దగ్గరకు పంపిస్తాడు. అమ్ము.. రమణ ప్రేమలో పడుతుంది. మరి వీరి ప్రేమ చివరికి ఏమైంది? వెంకటస్వామి కోరుకున్నట్టు రమణ అగ్రిమెంట్‌ పేపర్‌పై సంతకం పెట్టించడానికి ఎలాంటి ఎత్తుగడులు వేశాడు. వాటిని రమణ ఎలా ఎదుర్కొన్నాడు? తల్లికి దూరమైన రమణ మళ్లీ దగ్గరవుతాడా లేదా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

తల్లి సెంటిమెంట్‌తో దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలిసిన కథే అయినా.. తన మాటలతో తెరపై ఎలా మాయ చేశాడు అన్నదే కీలకం. ఇక సినిమా విషయానికొస్తే.. ప్రథమార్థంలో హీరో మహేష్‌బాబు ఎంట్రీ అదిరిపోతుంది. ఈ సినిమాలో మహేష్‌ మాస్‌ లుక్‌ ఆకట్టుకుంది. తాత వెంకటస్వామి దగ్గరకు వెళ్లడం.. అగ్రిమెంట్‌ మీద సంతకానికి నో చెప్పడం.. శ్రీలీల ఎంట్రీ లవ్‌సీన్స్‌.. వెన్నెల కిషోర్‌తో కామెడీ సరదాగా సాగిపోతుంది. అయితే అసలు తల్లి.. రమణను ఎందుకు వదిలి పెట్టి వెళ్లాల్సి వచ్చిందనే సస్పెన్స్‌ను మెయిన్‌టైన్‌ చేస్తూ ఫస్టాఫ్‌ సాగుతుంది. ఇక సెకండాఫ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. వసుంధర తన కుమారుడిని వదిలిపెట్టడానికి గల కారణం కూడా కన్విన్సింగ్‌గానే దర్శకుడు చూపించాడు. క్లైమాక్స్‌ ప్రేక్షకులు ఊహించిందే. యాక్షన్‌ సీన్స్‌లో మహేష్‌ అదరగొట్టాడు. శ్రీలీల డ్యాన్స్‌లు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జూనియర్‌ ప్రభుదేవాలా డ్యాన్స్‌ చేసింది. ప్రేక్షకులు మహేష్‌బాబుని ఎలా చూడాలనుకున్నారో అలా తెరపై చూపించడంలో త్రివిక్రమ్‌ సక్సెస్‌ అయ్యాడు. కానీ ఈ సినిమాకు తెలిసిన కథే కావడం మైనస్‌. ట్విస్టులకు ఏమాత్రం స్కోప్‌ లేదు. ఈ సినిమా చూస్తుంటే అలా వైకుంఠపురం సినిమాని తలపిస్తుంది. యాక్షన్‌ సీన్స్‌, పాటలు మాస్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది.

ఎలా చేశారంటే..

మహేష్‌బాబు నటన అద్భుతంగా ఉంది. శ్రీలీల నటన బాగుంది. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్‌రాజ్‌, రావురమేశ్‌ అద్భుతంగా నటించారు. తదితర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. తమన్‌ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️