త్వరలో కీరవాణి తనయుడి వివాహం

Apr 6,2024 19:31 #movie, #sree simha

ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహాతో నటుడు మురళీమోహన్‌ మనుమరాలు రాగ పెళ్లి జరగనుంది. ఇరుకుటుంబాలు ఈ మేరకు అంగీకరించాయని ఇటీవలే మురళీమోహన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుక విషయమై మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప కూడా ధృవీకరించారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూప మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో పెళ్లి జరుగుతుందని ప్రకటించారు. మురళీమోహన్‌కు కుమార్తె కుమారుడు ఉన్నారు. కుమార్తె విదేశాల్లో స్థిరపడ్డారు. కుమారుడు రామ్మోహన్‌ ఆయనకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్మోహన్‌-రూపల కుమార్తె రాగ. విదేశాల్లో ఆమె బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తిచేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. శ్రీసింహ యమదొంగ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కునే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరటంతో బహుశా ఇది ప్రేమ పెళ్లి కావొచ్చునని భావిస్తున్నారు.

➡️