Kotabommali PS Review: కోటబొమ్మాళి పిఎస్‌ మూవీ రివ్యూ

Nov 25,2023 09:01 #movie

 

ప్రముఖ నటుడు శ్రీకాంత్‌, హీరో రాజశేఖర్‌ కుమార్తె శివాని, హీరో రాహుల్‌ విజరు, ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు నటించిన తాజా చిత్రం ‘కోటబొమ్మాళి పిఎస్‌’. ఈ సినిమాని తేజ మార్ని తెరకెక్కించారు. శుక్రవారం నవంబర్‌ 24వ తేదీన విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

కథ

కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో రామకృష్ణ (శ్రీకాంత్‌) 20 ఏళ్లుగా హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. ఇక అదే స్టేషన్‌లో రవికుమార్‌ (రాహుల్‌ విజరు), కుమారి (శివాని రాజశేఖర్‌)లు హెడ్‌ కానిస్టేబుల్స్‌. టెక్కలిలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నియోజక వర్గం నుంచే హోంమంత్రి జయరామ్‌ (మురళీశర్మ) పోటీకి నిలబడడంతో అక్కడ ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. ఇదే సమయంలో కోటబొమ్మాళి పిఎస్‌ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణిస్తాడు. ఈ ప్రమాదం కాస్తా.. రామకృష్ణ, రవికుమార్‌, కుమారిలపై పడుతుంది. ఎన్నికల సమయంలో కావాలనే ఈ కేసులో తమని ఇరుకిస్తున్నారని తెలుసుకున్న వారందరూ పారిపోతారు. వీళ్లందరినీ పట్టుకోవడానికి ఎస్పీ రజియా (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) రంగంలోకి దిగుతుంది. మరి రజియా ఈ ముగ్గురి కానిస్టేబుళ్లని పట్టుకుందా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిదే.

విశ్లేషణ

మలయాళ మూవీ ‘నాయట్టు’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. రాజకీయ నాయకులు పోలీసుల్ని ఎలా వాడుకుంటున్నారనేదే కథాంశం. ఎన్‌కౌంటర్‌ సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కోటబొమ్మాళి పిఎస్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న రవికుమార్‌, కుమారి పాత్రలు తెరపై కనిస్తాయి. ఓ పక్క ఎన్నికల హడావిడి, మరో వైపు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడం, ఈ కేసులో పోలీసులు చిక్కుకోవడం వంటి సన్నివేశాలతో తరువాత ఏం జరుగుతుందనేది ఆసక్తి కలుగుతుంది. ఆ మరణించిన వ్యక్తి రాజకీయంగా పలుకుబడి కలిగినవ్యక్తి. ఎన్నికల సమయంలో అతను మరణించడంతో ఎన్నికల వేడి మరింత పెరుగుతుంది. ఈ కేసులో ముగ్గురి కానిస్టేబుళ్లు ఇరుక్కోవడం, వారిని పట్టుకోవడానికి ఎస్పీ రజియా రంగంలోకి దిగిన తర్వాత కథనంలో వేగం పెరుగుతుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ అనుభవంతో.. ఎస్పీ రజియా ప్లాన్లను అన్నింటినీ రామకృష్ణ రివర్స్‌ కౌంటర్స్‌ ఇస్తుంటాడు. రజియా ప్లాన్లను రామకృష్ణ చిత్తు చేసే సన్నివేశాలు చూస్తే.. థ్రిల్‌ అనిపిస్తాయి. క్లైమాక్స్‌ కంటతడిపెట్టిస్తుంది. హత్య కేసులో ఇరుక్కున్న ముగ్గురు పోలీసులు బయటపడతారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దర్శకుడు తేజ కథనాన్ని రసవత్తరంగా నడిపించారు.

ఎవరెలా చేశారంటే..

రామకృష్ణ పాత్రలో శ్రీకాంత్‌ అద్భుతంగా నటించారు. శివాని, రాహుల్‌ విజరు కూడా బాగా నటించారు. మిథున్‌ ముకుందన్‌ కంపోజ్‌ చేసిన లింగిడి పాట బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

➡️