మహేశ్‌.. వాళ్లకు మీరొక ఎమోషన్‌ : నమ్రత పోస్ట్‌

Jan 10,2024 15:01 #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మూవీ మేకర్స్‌ గుంటూరులో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మహేశ్‌బాబు అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘మీ అభిమానం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. థ్యాంక్‌ యు సోమచ్‌. మాటల్లేవ్‌. ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమి తెలియదు. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్న గారికి బాగా కలిసొచ్చిన పండగ. సంక్రాంతికి మా సినిమా రిలీజ్‌ అయితే బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంటుంది. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతుంది. అయితే ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే.. ఆనందపడేవాడిని. అంతకంటే ఆనందం ఏముంటుంది. ఇప్పుడు ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’ అని మహేశ్‌బాబు అన్నారు.

ఈ ఈవెంట్లో మహేష్‌బాబు మాట్లాడిన వీడియోను మహేశ్‌బాబు భార్య నమ్రత ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా నమ్రత అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ‘మహేశ్‌ అభిమానుల గురించి ఇప్పటికే ఎంతోమంది గొప్పగా చెప్పారు. మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయనపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. ప్రతి ప్రయత్నంలో అండగా నిలిచి, మరింత కష్టపడి పనిచేసేలా చేస్తున్నారు. మా సొంత ఊరు గుంటూరులో ఆయనకు, గుంటూరు కారం టీమ్‌కు లభించిన ఆదరణ చూసి ఓ విషయం చెప్పాలి. మహేశ్‌.. అభిమానులకు మీరొక ఎమోషన్‌. ఈ ప్రేమను మనం జీవించి ఉన్నంతకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. మహేశ్‌బాబుని ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.’ అని పేర్కొన్నారు.

➡️