Director – మలయాళ దర్శకుడు సుధీర్‌ బోస్‌ కన్నుమూత

మాలీవుడ్‌ : మలయాళ దర్శకుడు సుధీర్‌ బోస్‌ (53) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. సుధీర్‌ బోస్‌ కు భార్య ప్రీత, పిల్లలు మిథున్‌, సౌపర్ణిక ఉన్నారు. డైరెక్టర్స్‌ యూనియన్‌ అధికారిక ఫేస్‌బుక్‌ హ్యాండిల్‌ ద్వారా సుధీర్‌ బోస్‌ మరణ వార్తను తెలిపారు. ”కలాభవన్‌ మణి, ముఖేష్‌, రంభ నటించిన ‘కబడ్డీ కబడ్డీ’ దర్శకుడు సుధీర్‌ బోస్‌ సోమవారం తుది శ్వాస విడిచారు” అని వెల్లడించారు. సుధీర్‌ తిరువనంతపురంలోని పడింజరెనాడలో ఉండేవారు. ఆయన బంధువులు ఇతర దేశాల నుంచి రావాల్సి ఉండగా … శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. సుధీర్‌ బోసు డైరెక్టర్‌గా మారకముందు అనేక సినిమాలకు ఆయన పలు స్టార్‌ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన మృతి నేపథ్యంలో పలువురు మలయాళ సినీ నటీనటులు ఇతర టెక్నీషియన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1971లో కేశవన్‌ నాయర్‌, సుధా దేవి దంపతులకు జన్మించిన సుధీర్‌ బోస్‌.. ప్రముఖ చిత్రనిర్మాతలు జెస్సీ, పిజి విశ్వంభరన్‌ల మార్గదర్శకత్వంలో సహాయ దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. దర్శకుడు మనుతో అతని సాన్నిహిత్యం 2008లో కళాభవన్‌ మణి, ముఖేష్‌, రంభ నటించిన ‘కబడ్డీ కబడ్డీ’ చిత్రాన్ని రూపొందించడానికి దారితీసింది. ఈ చిత్రంలో నటీనటులు హరిశ్రీ అశోకన్‌, సూరజ్‌ వెంజరమూడు, ఇంద్రన్‌ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో పాటలు మంచి హిట్‌ అయ్యాయి.

➡️