ఆక్యుపెన్సీ ఎందుకు ఉండటం లేదు?

May 27,2024 05:48 #big heros, #New Movies Updates

ఒకప్పుడు వేసవి అంటే సినిమా థియేటర్లకు పండగ. కానీ, ఇప్పుడు ..? ప్రేక్షకులు రాక వెలవెలపోతున్నాయి. రోజువారీ నిర్వహణా ఖర్చులు కూడా రాక మూతపడే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? పరిష్కార మార్గాలు ఏమిటి? ఇదిప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా ఉంది.
వేసవిలో పిల్లలకు సెలవులు ఉండటం, కుటుంబాలు మొత్తంగా పర్యాటక ప్రదేశాల సందర్శనలకు వెళ్లి వస్తుండటం మామూలే! మధ్యలో ఇంటిల్లిపాదీ సినిమా థియేటరుకు వెళ్లటం సహజమే! పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు, సెలవుల్లో కలిసిన స్నేహితులూ ఉమ్మడిగా సందడి చేసే ప్రదేశాల్లో సినిమా హాళ్లు కూడా ఉంటాయి. కానీ, ఈ వేసవి సెలవుల్లో మాత్రం అలాంటి సన్నివేశాలు కనపడలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద హీరోల సినిమాలు ఈసారి ఒక్కటీ రాకపోవటం కూడా ఒక ముఖ్య కారణం. నిర్మాతలు, దర్శకులు కొత్త సినిమాల విడుదల తేదీలను మే నుంచి జూన్‌కు మార్చుకున్నారు. ఆక్సుపెన్సీ లేకపోవటంతో చిన్న హీరోల సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రాలేని పరిస్థితి! థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని భావించిన సింగిల్‌ థియేటర్ల యజమానులు ఈనెల 17 నుంచి 31 వరకూ మూసివేతకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల పక్రియ పూర్తికావటంతోపాటు ఆదివారంతో ఐపిఎల్‌ ముగింపు కానుంది.

పెద్ద హీరోల అనాసక్తి
తెలుగు చలనచిత్ర నిర్మాణంలో ఎక్కువ భాగం హీరోలకు రెమ్యూనరేషన్‌గానే పోతున్నదని, ఇది సినిమాలకు నష్టం తెచ్చిపెడుతుందని ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హీరోలు చేయాల్సింది ఏమిటి? గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తితే- పరిశ్రమను బతికించటం కోసం నాటి హీరోలైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితరులు కృషి చేసేవారు. తమ రెమ్యూనరేషన్‌ కన్నా సినిమా పరిశ్రమ బతకటమే ప్రధానంగా ఆలోచించేవారు. ఇప్పుడు అలాంటి చొరవ ఎవరూ తీసుకోవటం లేదు. ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్‌ రూ.60 కోట్ల నుంచి రూ.125 కోట్ల వరకూ వెళ్లిందని సమాచారం. ఇది ఆయా సినిమా బడ్జెట్‌లో దాదాపు సగం. హీరోయిన్‌, మిగతా క్యారెక్టర్‌ ఆర్టిస్టుల పారితోషికాలు ఉండనే ఉంటాయి. ఒక్క పెద్ద సినిమా తీయాలంటే వందల కోట్ల బడ్జెట్‌ను నిర్మాత కేటాయించాల్సివస్తోంది. తక్కువ బడ్జెట్‌తో, చిన్న హీరోలతో సినిమాలు చేస్తే అవి పూర్తిగా కథ మీదనే ఆధారపడి ఆడుతున్నాయి. ప్రత్యేకమైన ఇమేజీ ఉండడం లేదు. అదే పెద్ద హీరోలతో తీస్తే కనీసం కనీసం గ్యారంటీ ఉంటుందనే అభిప్రాయం నిర్మాతల్లోనూ ఉంది. ఆయా హీరోల అభిమాన గణాలు, ఇతరత్రా ఇమేజీ ప్రేక్షకులను ధియేటరు వరకూ తీసుకొస్తుందనేది వారి ఆలోచన. అందుకనే పారితోషికాలు ఎంత ఎక్కువగా ఉన్నా వారితోనే సినిమా నిర్మాణానికి మొగ్గు చూసుతున్న పరిస్థితీ ఉంది. పెద్ద హీరోల సినిమాలను పండుగలు, ఇతరత్రా అకేషన్లలో విడుదల చేస్తే వసూళ్లు బాగానే రాబట్టొచ్చని భావిస్తున్నారు. లెక్క కోసం సినిమాలు చేసే కంటే భారీ బడ్జెట్‌ సినిమాలైతే కొద్దిమేరైనా గ్యారంటీ ఉంటుందనే ఉద్దేశంతో పెద్దహీరోలు చూస్తున్నారు. నాలుగైదు సినిమాలకు వచ్చే మొత్తం ఒక్క సినిమాతోనే పొందొచ్చుననేది కూడా వారి అభిప్రాయం. ఇక్కడే అసలు సమస్య వస్తోంది.

పెద్ద సినిమాలతో మళ్లీ కళ?
యువ కథానాయకుల చిత్రాలు, పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలకి బాగుందనే టాక్‌ వచ్చాకే ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలతో కొన్ని రోజులపాటు కళకళలాడుతుండే విషయం తెలిసిందే. ఈనెల 9న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఎ.డి’ వస్తుందనుకుంటే ఆ సినిమా జూన్‌ 27కి వాయిదా పడింది. పుష్ప-2 ఆగస్టు 15, దేవర అక్టోబర్‌ 10న, 29న గేమ్‌ ఛేంజర్‌ విడుదల కానున్నాయి. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవల ‘గ్యాంగ్‌’, ‘లవ్‌ మీ..ఇఫ్‌ యు డేర్‌’ సినిమాలు విడుదలైనా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు.
ఈనెల 31న విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, సుధీర్‌బాబు ‘హరోం హర’, కాజల్‌ ‘సత్యభామ’, కార్తికేయ కథానాయకుడిగా నటించిన ‘భజే వాయు వేగం’, ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’, మ్యూజిక్‌ షాపు మూర్తి చిత్రాలను వాయిదా వేసుకుంటే మంచిదని ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు సూచించిన విషయం తెలిసిందే!

➡️