ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలపై అప్రమత్తం కండి !

Jan 20,2024 10:38 #feature

ప్రస్తుతం ఇంటర్నెట్‌ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఆన్‌లైన్‌ వేదికగా జరిగే ఆర్థిక మోసాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ముఖ్యంగా లోన్‌యాప్‌లు ద్వారా జరిగే సైబర్‌ నేరాలపై అప్రమత్తతతో మెలగాలి. తీసుకున్న రుణం సకాలం కట్టకపోయినా, ఆలస్యమైనా సదరు బాధితులను రుణ యాప్‌లు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అసభ్య పదజాలంతో దూషించడం, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి మానసికంగా కుంగదీస్తున్నారు. దీంతో, ఎన్నో కుటుంబాలు బలైన వార్తలు వింటూనే ఉన్నాం. అలాగే మోసానికి గురైన హైద్రాబాద్‌కి చెందిన ఓ యువ ఇంజినీరు దాని నుంచి ఎలా బయటపడ్డాడు? ప్రస్తుతం బాధితులకు అండగా ఏం చేస్తున్నాడు? అనే విషయాలను కూడా తెలుసుకుందాం.

           ఇటీవల ‘మనీ-9’ అనే సంస్థ చేసిన వ్యక్తిగత ఫైనాన్స్‌ సర్వే ప్రకారం.. దేశంలోని 100 కుటుంబాల్లో ప్రతి 18 మంది కుటుంబాలు సైబర్‌ క్రైమ్‌ను ఎదుర్కొంటున్నారు. భారత్‌లో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇది 10 విభిన్న భాషల్లో 35 వేల కంటే ఎక్కువ కుటుంబాల మధ్య నిర్వహించింది. సైబర్‌ క్రైమ్‌ను ఎదుర్కొన్న వారిలో 50 శాతం మంది ఆర్థిక మోసాల బారిన పడ్డారు. 25 శాతం మంది వ్యక్తిగత సమాచారం, గుర్తింపుకు సంబంధించి వేధింపులను ఎదుర్కొన్నారు. 12 శాతం మంది కుటుంబాలు సోషల్‌ మీడియా ఖాతాలు లేదా మొబైల్‌ ఫోన్‌లను హ్యాకింగ్‌ చేయడం వంటి సంఘటనల బారిన పడ్డాయని సర్వే సూచిస్తోంది. అదనంగా, 13 శాతం మంది ఇతర రకాల సైబర్‌ నేరాలను ఎదుర్కొన్నట్లు సర్వేలో తేలింది.

పెరుగుతున్న సైబర్‌ క్రైమ్‌, సైబర్‌ మోసాలపై కూడా ఈ సర్వే ఫోకస్‌ పెట్టింది. సైబర్‌ మోసంగా పిలిచే ఆర్థిక మోసం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది. దాదాపు ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట సైబర్‌ మోసాల బారిన పడుతున్న వారు ఉన్నారు. ఈ మోసంలో వేల నుంచి లక్షల రూపాయల వరకు పోగొట్టుకుంటున్నారని సర్వేలో తేలింది.                     వీటిలో డెబిట్‌/ క్రెడిట్‌ కార్డ్‌ మోసాలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ మోసాలు, యుపిఐ మోసాలు, కొరియర్‌ మోసాలు, ఇతర రకాల మోసాలు ఉన్నాయి. స్కామర్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని వారు, తక్కువ డిజిటల్‌ అక్షరాస్యత ఉన్నవారు. సైబర్‌ క్రైమ్‌ బాధితులుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.

ఈ మధ్య కాలంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు సంబంధించిన యాప్‌లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఆ లింక్‌ని క్లిక్‌ చేసినా, లేదా ఆన్‌లైన్‌లో ఏదేని వీడియో పోస్ట్‌ చేసినా మన సమాచారం సైబర్‌ నేరగాళ్లకి వెళ్లిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా పోలీసుల సాయం తీసుకోవాలి. అయితే, ప్రజలు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయని సంఘటనలే ఎక్కువగా ఉంటున్నాయని సర్వేలో తేలింది. బాధితులు సైబర్‌ క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులను నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫైల్‌ చేయడమే దీనికి ఉదాహరణ. ఈ ప్లాట్‌ఫారమ్‌ గణాంకాల ప్రకారం.. జనవరి 2020, డిసెంబర్‌ 2022 మధ్య.. పోర్టల్‌లో సైబర్‌క్రైమ్‌పై 1.6 మిలియన్‌ ఫిర్యాదులు వచ్చాయి. అయితే వీటిలో 32 వేలు మాత్రమే పోలీసు కేసులుగా మారాయి.

మోసాల నుంచి రక్షణ ఎలా ? డేటా రక్షించుకోవాలి : ఫోన్‌ డేటా సురక్షితంగా ఉందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

  • సాధారణంగా ఏదైనా అప్లికేషన్‌ యాక్సెస్‌ చేసినప్పుడు కెమెరా, కాంటాక్ట్‌లు, జిమెయిల్‌ ఖాతా, లొకేషన్‌కి యాక్సెస్‌ ఇస్తుంటారు. ఇలాంటప్పుడే సైబర్‌ నేరానికి గురయ్యే ప్రమాదముంటుంది. కాబట్టి అత్యవసరమైన యాప్‌లు మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అలాగే అనవసరమైన యాక్సెస్‌లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇంకో ముఖ్య విషయమేంటంటే డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌లకు ఉండకూడని యాక్సెస్‌ ఏదైనా ఉందా లేదా అని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.
  • జీమెయిల్‌కి ఫోన్‌ లింక్‌ చేయడం వల్ల గ్యాలరీ సమాచారం, పరిచయాల వివరాలు సైబర్‌ నేరగాళ్లకు సులభంగా తెలిసే వీలుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జీమెయిల్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలి. అలాగే ల్యాప్‌ట్యాప్‌లో కెమెరాను మాస్క్‌ చేయాలి. గోప్యతా సెట్టింగ్‌ల మార్పు : సైబర్‌ క్రైమ్‌ జరిగినప్పుడు వాట్సాప్‌ డేటా ముందుగా చోరీ చేయబడుతుంది. కాబట్టి వాట్సాప్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉండేలా చూసుకోవాలి.
  • పరిచయం లేని వ్యక్తుల వాట్సాప్‌ లింక్‌లను తొలగించుకుంటూ ఉండాలి.
  • గోప్యతా సెట్టింగులు మార్చుకోవడం వల్ల ఐపి చిరునామాలను రక్షించినట్లౌవుతుంది. సైబర్‌ నేరానికి గురి కాకుండా ఉండాలంటే ఇది తప్పని సరి.                                                                                                                                  ఫోన్‌ రీబూట్‌ : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్‌ క్రైమ్‌కి గురైతే వెంటనే వాట్సాప్‌ ఖాతాను డీయాక్టివేట్‌ చేయాలి. గ్యాలరీ నుండి ఫొటోలను తీసేయాలి. ఆ తరువాత ఫోన్‌ని రీబూట్‌ చేయాలి.
  • పోలీసులను ఆశ్రయించాలి : సైబర్‌ నేరం జరిగిందని గుర్తించిన వెంటనే పోలీసులను సంప్రదించాలి. సైబర్‌ క్రైమ్‌ సెల్‌లు కేవలం నేరస్తుల సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి. నిందితులను పట్టుకునేది పోలీసులే. కాబట్టి పోలీసుల జోక్యం ఉంటే సులభంగా బయటపడగలం.
  • ఫిర్యాదులను సైబర్‌ క్రైమ్‌.gov.in లో నమోదు చేయాలి
  •  ఈ పోర్టల్‌ ఆర్థిక మోసాలు, సైబర్‌ క్రైమ్‌పై దృష్టి సారిస్తుంది. ఇందులో ఫిర్యాదు చేయడం వల్ల ప్రతి సారీ పోలీస్‌ స్టేషనుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా ఈ పోర్టల్‌లో బాధితుల వివరాలు ఇవ్వకుండా అంటే అనామకంగా నివేదించే వీలు కూడా ఉంది.
  • ఈయన కూడా బాధితుడే ! : ప్రకాశం జిల్లాకు చెందిన రాధా కృష్ణమూర్తి ఉపాధి నిమిత్తం హైద్రాబాద్‌కి వచ్చారు. కంప్యూటర్‌ ఇంజినీర్‌గా ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. కోవిడ్‌ కాలం ఆయన కలలను చెల్లాచెదురు చేసింది. అందరూ సొంతూళ్లకి వెళ్లిపోతుంటే మూర్తి హైద్రాబాద్‌లోనే ఉండిపోయారు. పోలీస్‌ విభాగం ఆధ్వర్యంలో కోవిడ్‌ వాలంటీర్‌గా విధులు నిర్వహించారు. మూర్తి ఇంజినీర్‌ అయినా సైబర్‌ సెక్యూరిటీపై ఆసక్తి ఎక్కువ. దానికి సంబంధించిన ఓ కంపెనీలో పనిచేశారు. కమిషనర్‌ సైబర్‌ సెక్యూరిటీ సెల్‌ ద్వారా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కల్పించేవారు. అయితే, ఆయన చేసిన ఓ చిన్న పొరబాటు సైబర్‌ క్రైమ్‌ బాధితుడిని చేసింది. ‘కరోనా సమయంలో చేతిలో డబ్బుల్లేక ఓ యాప్‌లో రూ.6000 రుణం తీసుకున్నాను. అయితే ఆ వెబ్‌సైట్‌ లింక్‌ ఏదేని బ్యాంక్‌కి గాని, ఆర్‌బిఐకి గాని అనుసంధానం చేసి లేదని గుర్తించాను. దీంతో ఆ సొమ్ము వెంటనే రీఫండ్‌ చేయాలని అనుకున్నాను. ఆ విషయం యాప్‌ నిర్వాహకులకు చెబితే- రోజుకు 18 శాతం వడ్డీతో ఆరు రోజుల వ్యవధిలో చెల్లించమన్నారు. నా దగ్గర అంత సొమ్ము లేదు. దీంతో వాళ్లు నాకు ఫోన్‌ చేసి చాలా అసభ్యంగా మాట్లాడారు. ఆ తరువాత నా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నా పరిచయాలన్నింటికీ దాదాపు 1500 మందికి పంపారు. అప్పుడు మా నాన్న నాకు ఫోన్‌ చేసి ‘బతికుండగానే నన్ను చంపేశావురా’ అని ఏడ్చాడు. ఆయనొక టీచర్‌. ‘నీ కొడుకు ఇంత నీచంగా తయారయ్యాడేంటి? అని అందరూ అంటున్నారని బోరుమన్నాడు. ఆ సమయంలో మానసికంగా బాగా కుంగిపోయాను. అప్పుడే నాకు హైద్రాబాద్‌ అప్పటి పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నుంచి ఫోను వచ్చింది. నా కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆయన నంబరుకు కూడా నా మార్ఫింగ్‌ ఫొటోలు పదే పదే వచ్చినట్లు ఆయన చెప్పారు. జరిగినదంతా తెలుసుకుని నాకు ధైర్యం చెప్పారు. సైబర్‌ నేరగాళ్లను పట్టుకున్నారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. నాలాగే ఎవరూ ఈ బాధ పడకూడదని. ‘గ్లోబల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ ప్రారంభించి, బాధితులకు అండగా నిలబడు తున్నాను. ఇప్పటి వరకు 32 మందిని సైబర్‌ నేరం నుండి విముక్తులను చేశాను’ అని మూర్తి చెప్పారు.
➡️