లెక్కలను మచ్చిక చేసే మాస్టారు

Dec 22,2023 10:15 #feature

ఇష్టపడి చేస్తే లెక్కలంత సులభమైన పాఠ్యాంశం మరొకటి లేదని అంటున్నారు డాక్టర్‌ రంభ రజనీకాంత్‌. విద్యార్థుల్లో గణితంపై భయాన్ని ఆయన గుర్తించి దానిని పారదోలటానికి తన వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారమ్మ పేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా ఉన్నారు. డాక్టర్‌ రజనీకాంత్‌ గత 23 సంవత్సరాలుగా గణితంలో సులువైన పద్ధతులు వివరిస్తూ, ఎందరో విద్యార్థుల ఉన్నతికి పునాది వేశారు. గణిత క్లబ్‌, గ్రంథాలయం వంటివి నిర్వహిస్తూ విజ్ఞాన వ్యాప్తికి పాటు పడుతున్నారు.

               ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి దగ్గరలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది బంగారమ్మ పేట ప్రాథమికోన్నత పాఠశాల. 88 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడికి వచ్చే విద్యార్థులంతా పేదల పిల్లలే.. చదువులోనూ, అందులోనూ గణితం సబ్జెక్టులో పిల్లలు బాగా వెనుకబడి ఉండటాన్ని రజనీకాంత్‌ మాస్టారు గుర్తించి తర్ఫీదిచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తున్నారు.

సులభమైన పద్ధతుల్లో …

               ప్రతి రోజూ గణితానికి సంబంధించిన అంశాలు నేర్పించటం, సూత్రాలను బట్టీ తరహాలో కాకుండా అంకెలు, సంజ్ఞల రూపంలో చెప్పించటం, సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు సైతం అర్థమయ్యే రీతిలో స్వేచ్ఛగా భావవ్యక్తీకరణకు అవకాశం ఇస్తున్నారు. కృత్యాల్లో పాల్గొనటం, మాట్లాడటం, చర్చించటం ద్వారా సులభంగా లెక్కలు చేయొచ్చునని ఆచరణ ద్వారా నిరూపిస్తున్నారు. కృత్యాలను వ్యక్తిగతంగానూ, జట్టు కృత్యంగా చేయిస్తూ మెరుగైన ఫలితాలు చేసిన వారికి బహుమతులు ఇవ్వటం ద్వారా ప్రోత్సహిస్తున్నారు. లెక్కలకు సంబంధించి కూడికలు, గుణింతాలు, తీసివేతలు, భాగహారాలు, ఆరోహణ, అవరోహణ అంశాలు … ఇలా ప్రతి ఒక్క దాని గురించి చెప్పించటం వల్ల సులభంగా గుర్తుండేలా చేస్తున్నారు. గణితంలో సూత్రాలు, పీరియాడిక్‌ టేబుళ్లు వంటి అంశాలపై కృత్య పద్ధతులపై అవగాహన కల్పించటం ఆయన ప్రత్యేకత. తోటి ఉపాధ్యాయులను కూడా ఇదే తరహాలో బోధనకు కృషిచేస్తున్నారు. 2018లో ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 2023లోనూ అవార్డుకు ఎంపిక కాగా, జాతీయ అవార్డుకు నామినేషన్‌ పంపటంతో సున్నితంగా తిరస్కరించారు. సాలూరుకు చెందిన రజనీకాంత్‌ విద్యాభ్యాసమంతా స్థానికంగానే జరిగింది. ఎమ్మెస్సీ నాగార్జున యూనివర్శిటీలోనూ, బిఈడీ గుంటూరులోనూ పూర్తిచేశారు. 2000లో ఉపాధ్యాయుడిగా సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారమ్మపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్యోగ బాధ్యతల్లో చేరారు. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా అదే పాఠశాలలో ఉద్యోగోన్నతి పొందారు.

పిల్లల్లో భయాన్ని పోగొడుతూ…పిల్లల్లో గణితం పట్ల నెలకొన్న తెలియని భయాన్ని పోగొట్టేందుకు ఆయన తనవంతుగా కృషి చేస్తున్నారు. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి గణితశాస్త్ర కోవిదుడు శ్రీనివాస రామానుజన్‌ పేరున 2001లో గణిత క్లబ్‌ను స్థాపించారు. ఈ క్లబ్‌ సేవలు ఉత్తరాంధ్ర స్థాయిలో విస్తరించటం వెనుక ఆయన మిత్రులు ఎంవి గౌరీశంకర్‌, కె.విశ్వనాథ శాస్త్రి, బి.వీరభద్రరావు, ఎన్‌.అశోక్‌కుమార్‌ తదితరులు వెన్నంటి ఉండి తోడ్పాటు అందిస్తున్నారు. ఇప్పటివరకూ లక్షమందికిపైగా విద్యార్థులు ఈ క్లబ్‌ ద్వారా నిర్వహించిన టాలెంట్‌ టెస్టుల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే గణితంపై పట్టు సాధిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చుననే అవగాహన కల్పిస్తూ క్లబ్‌ సేవలను కొనసాగిస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రామానుజన్‌మేథ్స్‌క్లబ్‌ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారు.

సొంత డబ్బుతో గ్రంథాలయం

రజనీకాంత్‌ ప్రతినెలా రూ.12 వేలు చొప్పున వెచ్చించి, పేద విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం గణిత గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. గణిత పుస్తకాలు, మేగజైన్లు, దినపత్రికలు, పోటీపరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచారు. గణితంతోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.

సామాజిక సేవల్లోనూ ముందంజ

పట్టణానికి దూరంగా ఉన్న ఈ పాఠశాలకు విద్యార్థుల రాకపోకల కోసం ఏడేళ్లుగా రెండు ఆటోలు ఏర్పాటు చేశారు. వాటికి ప్రతినెలా రూ.6000 వరకూ చెల్లిస్తున్నారు. రజనీకాంత్‌ సామాజిక సేవలను గుర్తించిన గత కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్‌ స్వయంగా పాఠశాలకు వచ్చి సన్మానించి మరీ వెళ్లారు.

                                                       – యడవల్లి శ్రీనివాసరావు

పలు అవార్డులు

2019లో బెంగుళూరు నేషనల్‌ వరుచ్యువల్‌ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌

2019లో ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రతిభా పురస్కారం

2018లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

2010లో రాష్ట్ర ఉగాది పురస్కారం 2006, 2007, 2010లో మూడుసార్లు కలెక్టర్‌ నుంచి ప్రశంసాపత్రాలు

2010లో రోటరీ ఎక్సలెన్స్‌ అవార్డు

నేర్చుకుంటే గణితం సులభమే…

గ్రామీణ విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాందోళనలు పోగొట్టి సులభంగా అవగాహన పెంచుకోవటానికి మేథ్స్‌ క్లబ్‌ ద్వారా ఏటా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నాం. గత 23 సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నాం. గత కొన్నేళ్లుగా గణిత గ్రంథాలయం కూడా నిర్వహిస్తున్నాను. ప్లోచార్టులు, టిఎల్‌ఎం, కృత్యపద్ధతులను ఆచరిస్తున్నా. ఎలాంటి సంకోచం లేకుండా పిల్లలు మాట్లాడే స్వేచ్ఛతో సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. గణితంలో నేను చేస్తున్న కృషికి గాను 2019లో బెంగుళూరు నేషనల్‌ వరుచ్యువల్‌ యూనివర్శిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

                                                                 – డాక్టర్‌ రంభ రజనీకాంత్‌, రామానుజన్‌ మేథ్స్‌ క్లబ్‌ , వ్యవస్థాపకులు.

➡️