మల్లెలాంటి మనసు

May 23,2024 04:15 #jeevana

దేవగిరి పట్టణపు చివరన హంపానగర్‌ ఉంది. అక్కడి ఉన్నత పాఠశాలలో చదువుతున్న మందాకిని, హారతి మంచి స్నేహితులు. మందాకిని ఇంటి దగ్గర పెద్ద మందార చెట్టు ఉంది. మందారం చెట్టు సంవత్సరమంతా పూలతో కళళకళలాడుతూ ఉండేది. ఆ పూలను రోజూ మందాకిని పెట్టుకునేది. ఒక్క రోజు కూడా స్కూల్లో ఎవరికీ తెచ్చి ఇచ్చేది కాదు.
ఒకసారి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున హారతి, మందాకిని ఇంటికి వెళ్లి రెండు పూలు అడిగింది. మందాకిని ససేమిరా అంది. స్నేహితురాలు అలా అనేసరికి హారతి చాలా రోజులు బాధపడింది.
రెండేళ్ళు గడిచాయి. ఆ రోజు జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం వేడుకకు అందరూ వచ్చారు. అప్పుడు హారతి జడ నిండుగా మల్లెపూలు పెట్టుకుని వచ్చింది. వస్తూ వస్తూనే తనతో ఓ బుట్ట నిండా మల్లె పూలు తెచ్చి నాయకుల ఫొటోల ముందు పోసింది. కొన్ని మాలలు తీసి టీచర్లకు ఇచ్చింది. స్నేహితులకు కూడా తలా ఒకటి పంచిపెట్టింది. జెండా పండుగ గుర్తుగా హారతి వాళ్ళమ్మ ఇచ్చిన మల్లెతీగలను బడిలో అందరికీ పంచింది. అప్పుడే వచ్చిన మందాకినికి కూడా దాచి ఉంచిన పూల మాల ఒకటి ఇచ్చింది. అందరి తలల్లో తురిమిన మల్లెపూల మాలలు, ఫొటోల ముందు కుమ్మరించిన పూలను చూసి హారతి చేసిన పనిని మందాకిని గుర్తించింది. అందరూ తనను అభినందిస్తుంటే, తన తప్పును తెలుసుకొని సిగ్గుతో తలదించుకుంది. ఇక నుంచి తాను కూడా మందార పూలను అందరికీ ఇవ్వాలని అనుకుంది.
– ఎ.హేమావతి రాజన్న,
94416 64931.

➡️