కాన్వాస్‌పైపాలస్తీనా గాయం

Dec 19,2023 10:19 #feature

పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ జరిపిన అత్యంత అనాగరికమైన యుద్ధచర్యను ఆ విద్యార్థుల కుంచె ప్రశ్నించింది. ముక్కుపచ్చలారని పసివారిని సైతం పాలస్తీనా గడ్డపై బలి తీసుకున్న రక్తపిశాచి నెతన్యాహు దుర్మార్గ వైఖరిని కళ్ల ముందుంచింది. జాతి నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాపై జరుగుతున్న అమానవీయ యుద్ధకాండను నిరసించింది. శాంతి ప్రాముఖ్యతను వివరించింది. నవయువ చిత్రకారులు సృజియించిన ఈ రంగుల స్వరాలకు విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం వేదికైంది.

             పాలస్తీనాకు సంఘీభావంగా ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ స్టూడెంట్స్‌ కమ్యూనిటీ ఆధ్వర్యంలో విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ‘జాతి వివక్షతకు వ్యతిరేకంగా’ చేపట్టిన ఈ ప్రదర్శన ఈ నెల 11, 12 తేదీల్లో సాగింది. నగర వాసులు, యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనను సందర్శించారు.

విభిన్న చిత్రాలు.. ఒక్కటే సందేశం

ఈ చిత్రకళా ప్రదర్శనలో పాలస్తీనాలోని తాజా పరిస్థితులను తెలియజేస్తూ 50 చిత్రాలు కొలువుదీరాయి. వాటర్‌ కలర్‌ పెయింటింగ్‌, ఆయిల్‌ పెయింటింగ్‌, ఆక్రిలిక్‌ పెయింటింగ్‌, గ్రాపైట్‌ పెయింటింగ్‌, డిజిటల్‌ ఆర్ట్‌, ప్రింట్‌ మేకింగ్‌, లినోకట్‌ ఎట్చింగ్‌, జింక్‌ ప్లేట్‌ ఎట్చింగ్‌.. ఇలా పలు చిత్రకళా విభాగాల్లో ఎయు ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు ప్రతిభ చాటారు. వేస్ట్‌ మెటీరియల్‌ ఉపయోగించి తయారు చేసిన బొమ్మలు ఆలోచింపజేశాయి. ‘ఇజ్రాయిల్‌ బాంబుల దాడికి పాలస్తీనాలో కూలిన గోడ కింద నలిగిన చిన్నారి పాదం’ బొమ్మను అచ్చుగుద్దినట్టు ఫైన్‌ ఆర్ట్‌ నాలుగో సంవత్సరం విద్యార్థి గౌతమ్‌ తయారు చేశాడు. భవన శిథిలాల్లో చిక్కుకున్న వందల మంది చిన్నారుల మృతదేహాలు, అక్కడి రక్తపాతం కళ్లకు కడుతూ తిరుపతి, ఖాన్‌ తయారు చేసిన బొమ్మ కూడా పలువురిని కదిలించింది. ‘ఇప్పుడు మేము మా ఇళ్లను ఇక్కడ వదిలేసి వెళ్తున్నాం. మళ్లీ ఇక్కడకు వస్తాం’ అన్న అర్థం ధ్వనించేలా ‘పాలస్తీనా కీ’ బొమ్మను, చిత్రాలను అశోక్‌, ఇంకొంత మంది విద్యార్థులు రూపొందించారు.

కాన్వాస్‌పై.. గాయాల గాజా

గాజా మొత్తం శవాలగుట్టగా మారిందన్న అర్థం వచ్చేలా ఎక్కువ మంది చిత్రాలు వేశారు. యుద్ధం జరగక ముందు – జరుగుతున్నప్పుడు – ఆగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ.. భిన్న పరిస్థితులను ఒకే చిత్రంలో ఇమిడ్చింది విద్యార్థి శరణ్య. తల్లి కొడుకును కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తెలియజెప్పాడు ఖాన్‌. ఐక్యరాజ్య సమితి చూస్తుండగానే గాజాపై బుల్లెట్‌ ఎలా దిగిందో చెప్పాడు చంటి. చదువుకు దూరమవుతున్న విద్యార్థులు, వారి హాహాకారాలను తెలియజెప్పాడు లోకేష్‌. కుమారుని మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని రోధిస్తున్న ఓ తండ్రి బాధను, ఫుట్‌బాల్‌ నెట్‌ ఎదుట గాయంతో రోధిస్తూ కూలబడ్డ విద్యార్థి ఆక్రందనను తన చిత్రాల్లో తెలియజెప్పాడు ఎన్‌.అజరు. ‘యుద్ధం వద్దు.. బాలల బతుకులు ముఖ్యం’ అంటూ ఓ చిత్రాన్ని వేశాడు లెనిన్‌.

పేపర్‌ పేస్ట్‌తో, గ్రాపైట్‌ పౌడర్‌తో …

ఈ ప్రదర్శనలో ఎస్‌.శ్రీదేవి పేపర్‌ పేస్ట్‌తో పాలస్తీనా మహిళ బొమ్మను వేసింది. తొలుత ఆమె పేపర్‌ను ముద్దగా చేసింది. స్కార్ఫ్‌ ధరించిన మహిళ రూపం వచ్చేలా ఆ ముద్దను కాన్వాస్‌పై అతికించింది. డ్రై అయ్యాక కలర్స్‌ వేసింది. పెన్సిల్‌తో ఆ కాన్వాస్‌పైనే గాజా మ్యాప్‌, ముళ్ల కంచెలను ఆవిష్కరించింది. శాంతికి ప్రతిబింబంగా పావురాన్ని బ్యాగ్రౌండ్‌లో వేసింది. పాలస్తీనా మహిళలు సంప్రదాయబద్ధంగా ధరించే స్కార్ఫ్‌లో యూనిటీని పొందుపరుస్తూ పి.వేలాంగిణి అద్భుతమైన బొమ్మ వేసింది. గ్రాపైట్‌ పౌడర్‌ ఉపయోగించి కావ్య పలు చిత్రాలను తీర్చిదిద్దింది. తమపై బాంబుల వర్షం కురుస్తుంటే పౌరులు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్న భావం వచ్చేలా కావ్యశ్రీ; పాలస్తీనాలో దయనీయ పరిస్థితులను సోషల్‌ మీడియాలో చూసి మరీ ఏం చేయలేకపోతున్నామే అని మధనపడుతున్న వారి బాధను తెలుపుతూ కావ్య కళాచిత్రాలను రూపొందించారు.

ఖర్చు మొత్తం తామే భరించి …

ఈ చిత్ర కళా ప్రదర్శనకు అయ్యే ఖర్చంతా ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులే భరించారు. కాన్వాస్‌, పెయింట్స్‌, గ్రాపైట్‌ పౌడర్‌, పేస్టులు, ఇతరత్రా సామగ్రిని వారే సమకూర్చుకున్నారు. పాలస్తీనాపై జరుగుతున్న అమానవీయ దాడిని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలన్న కాంక్ష ఒక్కటే వారిలో కనిపించింది. ఈ చిత్ర కళా ప్రదర్శనకు ఎన్‌.అజరు, ఛరిష్మా, తిరుపతి, ఇంతియాజ్‌, శ్రీదేవి, కావ్యశ్రీ, సమీరా, కావ్య, జీనత్‌, వేలాంగిణి తదితరులు నిర్వహించారు. ‘పాలస్తీనా కోసం మేము సైతం’ అంటూ వారు మరికొన్ని ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు.

– కోడూరు అప్పలనాయుడు, 94915 70765

➡️