డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం

Feb 12,2024 11:11 #jeevana

పిల్లలూ, మీ తరగతి గదిలో కోతి నుంచి మనిషి ఎలా ఉద్భవించాడో తెలియజేసే జీవ పరిణామ క్రమ చిత్రపటం ఉంది కదా! సమస్త జీవరాశులను ఎవరో సృష్టించారన్న నమ్మకాలను ఆ సిద్ధాంతం పటాపంచలు చేసింది. ఈ రోజు జీవ పరిణామ క్రమాన్ని ప్రపంచానికి తెలియజేసిన చార్లెస్‌ డార్విన్‌ పుట్టిన రోజు.ఫిబ్రవరి 12, 1809లో ఇంగ్లాండ్‌ ష్రూస్‌బరీలో చార్లెస్‌ డార్విన్‌ జన్మించాడు. ఆయన ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో ఈ సిద్ధాంతం (డార్వినిజం) చాలా మార్పు తెచ్చింది. మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని ఈ సిద్ధాంతం చెబుతుంది.1844లోనే డార్విన్‌ జీవపరిణామ క్రమంపై ఒక స్పష్టతకు వచ్చాడు. ఇందుకోసం ఆయన ఎన్నో పరిశోధనలు చేశాడు. సముద్రయానం చేస్తున్న డార్విన్‌ని సముద్ర జీవులు, శిలాజాల అవశేషాలు విశేషంగా ఆకర్షించేవి. వాటన్నింటిపై అధ్యయనం చేశాక డార్విన్‌ 1838లో సహజ ఎంపిక సిద్ధాంతాన్ని రూపొందించాడు. ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవని ఈ సిద్ధాంతం చెబుతోంది. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరుత పులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒక ఇంకో జాతివని ఆయన వివరించారు. గతంలో వీటికి తలొక ‘పూర్వీకుడూ’ ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ ‘ఆదిమ’ శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఉండి ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఈ విషయాలన్నిటిపై డార్విన్‌ చాలా పరిశోధనలు చేశాడు. మనుషుల చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవ పరిణామ ప్రక్రియలే కారణమని అర్థం అవుతుంది.

➡️