విద్యే జీవితానికి సోపానం

Apr 1,2024 05:33 #jeevana

పల్లవ దేశం పొలిమేరలోని పార్వతీపురంలో గురుకులం ఉంది. దానిని రామశర్మ నడిపిస్తున్నాడు. ఆ గురుకులానికి ఎంతో మంచి పేరు ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు చదువుకోసం అక్కడికి వచ్చేవారు. ఆ విద్యా సంవత్సరం కొత్తగా పాతిక మంది వచ్చారు.
మొదటి రోజు అందరి పరిచయాలు అయ్యాయి. రెండవ రోజు రామశర్మ విద్యార్థులను అటు పక్కగా ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లి ‘ఆ కొండపైకి చేరుకోవాలంటే మెట్లు ఎక్కాలి. ప్రయాస పడకుండా నిదానంగా ప్రకృతిని గమనిస్తూ మెట్లు ఎక్కండి. మీకు పాఠం ఇప్పటి నుంచే మొదలవుతుంది’ అన్నాడు రామశర్మ.
‘మనం చదువుకోవడానికి వచ్చామా, మెట్లు ఎక్కడానికి వచ్చామా?’ అన్నాడు ఒక విద్యార్థి మెల్లగా. ఆ మాటలకు తలలాడించారు మరికొందరు. ఈలోపు రామశర్మ గబగబా మెట్లు ఎక్కి పిల్లల కోసం ఎదురుచూడసాగారు. పిల్లలందరూ కొండ మీదకు చేరుకున్నాక ‘ఇప్పుడు కిందకు చూడండి’ అన్నాడు రామశర్మ. ‘అబ్బో చాలా మెట్లు ఎక్కాము!’ అన్నాడు ఒక విద్యార్థి. ‘మీరు ఎన్ని మెట్లు ఎక్కారో చెప్పగలరా?’ అన్నాడు రామశర్మ. అందరూ గుసగుసలాడుకోసాగారు. ‘గురువు గారూ! వంద మెట్లు ఎక్కాము’ అన్నాడు రామయ్య అనే విద్యార్థి. ‘మెట్లు ఎక్కుతూ మీరు ఏమి గమనించారు?’ అన్నాడు రామశర్మ. ‘ఒక చోట జామ చెట్టు ఉంది, మల్లె, మందారం పూల మొక్కలతో పాటు అక్కడక్కడా మూడు గుడిసెలు కూడా ఉన్నాయి’ అన్నాడు రామయ్య.
‘రామయ్యా! సరిగ్గా చెప్పావు. పిల్లలూ మీకు ముందే చెప్పాను. మెట్లు ఎక్కుతూ ప్రకృతిని గమనించాలి అని. ఎక్కిన ప్రతి మెట్టూ మీ విద్యకు సోపానం లాంటిది. విద్య అనంతమైనది. చివరి మెట్టు చేరుకున్నా మొదటి మెట్టును గుర్తుపెట్టుకోవాలి’ అన్నాడు రామశర్మ. గురువు గారి మాటల్లో దాగున్న విద్యే జీవిత సోపానం అంశం విద్యార్థులకు బాగా అర్థమైంది. మరుసటి రోజు నుంచి ప్రతి విద్యార్థి ప్రతి అంశం మీద దృష్టి పెట్టి చదవసాగారు.

– యు.విజయశేఖర రెడ్డి,
99597 36475.

➡️