వలస కార్మికుల పిల్లల కోసం …

Mar 5,2024 10:15 #feachers, #jeevana

మన చుట్టూ ఎంతోమంది ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. రోడ్లు వేసేవారు, కాల్వలు తవ్వేవారు, భవనాలు నిర్మించేవారు.. ఇలా అసంఘటిత రంగంలో పనులు చేసేందుకు రాష్ట్రాలు దాటి మరీ వస్తుంటారు. వారి పిల్లలు దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో పీలగా, కళావిహీనంగా మట్టిలో ఆడుకుంటూ కనిపిస్తారు. సమయానికి భోజనం, నిద్ర, సరైన బట్టలు లేకపోగా, పోషకాహార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దేశంలో ఎక్కడ, ఏ మూలైనా వలస కార్మికుల జీవితాలు ఈ పరిస్థితుల చుట్టూనే పెనవేసుకుని ఉంటాయి. మరి ఆ పిల్లలు చదువుకోవాలంటే, పోషకాహారం అందాలంటే, ఉపాధి మార్గాలు చూపించాలంటే సాధ్యమవుతుందా? అని ప్రశ్న వేసుకుంటే సాధ్యమే అని నిరూపిస్తున్నారు పూణెకి చెందిన ‘తారా మొబైల్‌ క్రెచ్‌స్‌’ స్వచ్ఛంద సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మంజూషా జోషి.

వలస కార్మికులు ఒక చోట స్థిరంగా ఉండరు. పనిని బట్టి వివిధ ప్రాంతాలకు మారుతూ ఉంటారు. పైగా పని చేస్తేనే వారికి డబ్బులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో పనులు మానుకుని, పిల్లల ఆలనాపాలన చూసేదెంతమంది? అందుకే వీరి పిల్లల కోసం నిర్వహించే ఈ క్రెచ్‌స్‌ని వారుండే చోటకే తీసుకెళుతున్నారు మంజూష. ఆయా ప్రాంతాలకు వెళ్లి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 18 ఏళ్ల వరకు గల బాలల వివరాలను క్రెచ్‌ సేకరిస్తుంది.

ఆవిర్భావం ఇలా..

సింధుతారు సావర్దేకర్‌ 1980లో ఈ మొబైల్‌ క్రెచ్‌స్‌ని ప్రారంభించారు. బుల్డర్స్‌, కాంట్రాక్టర్స్‌, దాతలు, సిఎస్‌ఆర్‌ కంపెనీలు, వాలంటీర్ల సాయంతో క్రెచ్‌స్‌తో పాటు డేకేర్‌ కేంద్రాలు కూడా నిర్వహించడం సంస్థ ప్రత్యేకత. ఇప్పటి వరకు లక్షకు పైగా చిన్నారులకు సేవలందించారు. పూణె వ్యాప్తంగా 16 మొబైల్‌ క్రెచ్‌ కేంద్రాలు నడిపిస్తున్నారు.

ఏ అంశాల మీద పనిచేస్తాయంటే..

ఆరోగ్యం, పోషకాహారం, విద్య అనే మూడు అంశాల మీద ఈ క్రెచ్‌స్‌ పనిచేస్తున్నాయి. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులకు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స కూడా అందిస్తున్నారు. వయసుల వారీగా వారి అభ్యసన సామర్థ్యాలు పెంచేలా బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా.. ‘గర్భిణీలకు, బాలింతలకు డే కేర్‌ కేంద్రాల ద్వారా వైద్యం అందిస్తున్నాం. అత్యవసర చికిత్స కావాల్సిన వారికి ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తాం. అలాగే ఈ క్రెచ్‌స్‌ ద్వారా పిల్లల వయసులను బట్టి రోజుకు మూడు సార్లు పాలు, బియ్యం, చిరుధాన్యాలు, కూరగాయలు, పళ్లు, పప్పు దినుసులు వంటివి అందిస్తున్నాం. అంతేకాదు, పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించడం కూడా బాధ్యతగా తీసుకున్నాం’ అని మంజూష చెబుతున్నారు.

ఉపాధి నిమిత్తం పూణెకి వలసవచ్చిన ఈ కుటుంబాల్లో ఎక్కువ శాతం రాజస్థాన్‌, బీహార్‌, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్‌, కర్నాటక నుండి వచ్చినవారే ఉన్నారు. ఆధార్‌ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు లేక ఈ పిల్లలకు స్కూల్లో అడ్మిషన్లు లభించడం లేదని గుర్తించిన క్రెచ్‌ నిర్వాహకులు అడ్మిషన్లు ఇప్పించడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

వివిధ కళల్లో రాణించేలా..

అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థుల కోసం డే కేర్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా తరగుతులను కూడా కల్పించారు. పిల్లల ఆసక్తులను బట్టి వివిధ కళల్లో కూడా ప్రోత్సహిస్తున్నారు. చిత్రలేఖనం, బొమ్మలు తయారుచేయడం, వీధి నాటకాలు, ఆటలు, సంగీతం వంటి కళల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు. ఆయా కుటుంబాలు తమ పనులను ముగించుకునే కాల వ్యవధి వరకు ఈ క్రెచ్‌లు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. ఒకవేళ పని ముగించుకుని తల్లిదండ్రులు మరో ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలిపోయినా పిల్లల విద్య ఆగిపోకుండా రెసిడెన్షియల్‌గా వారికి హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. తల్లిదండ్రులు వారి పనులను ముగించుకుని వచ్చేవరకు ఈ పిల్లల బాధ్యత క్రెచ్‌ నిర్వాహకులే చూసుకుంటున్నారు.

ఉపాధి కల్పన

విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి చూపించడం కూడా క్రెచ్‌ తీసుకుంటోంది. ఉన్నత విద్య చదవాలనుకునే వారికి విద్య అందించడం ఉపాధి కోరుకునేవారికి నిధుల సేకరణ ద్వారా, దాతల మద్దతుతో ఉపాధి చూపించడం సంస్థ బాధ్యతగా ఉంటోంది.

స్మిత (పేరు మార్చాం) క్రెచ్‌ చొరవతో బాల్య వివాహం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో నాన్‌ బ్యాంకింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. ‘నేను ఈ ఆర్గనైజేషన్‌లోకి ఐదేళ్లప్పుడు వచ్చాను. నన్ను స్కూల్లో చేర్పించారు. పదో తరగతి వరకు చదివాను. ఆ తరువాత మా సొంత ఊరికి వెళ్లిపోయాను. అక్కడ మా పెద్దలు నా కంటే 10 ఏళ్లు పెద్ద వ్యక్తితో నాకు పెళ్లి నిశ్చయించారు. ఈ విషయాన్ని క్రెచ్‌ నిర్వాహకులకు చేరవేశాను. సరిగ్గా పెళి ్ళ రోజుకు పోలీసులతో వచ్చి నా వివాహాన్ని ఆపేశారు. ఆ తరువాత సంస్థ చొరవతో పూణెకి వచ్చి ఉన్నత విద్య అభ్యసించాను. ఉద్యోగం సంపాదించాను. ఇదంతా ఒక కలలా ఉంటుంది’ అని తన ఆనందాన్ని తెలియజేసింది స్మిత.

కూలీలుగా కాదు.. ఇంజినీర్లుగా..

‘సంస్థ సేవలను పొందిన విద్యార్థులతో ఈమధ్యనే ఒక అల్యూమినీ కలయికను ఏర్పాటు చేశాం. 200 మంది వరకు వచ్చారు. వాళ్లంతా నచ్చిన రంగాల్లో స్థిరపడ్డారు. కొంతమంది మల్టీనేషనల్‌ కంపెనీల్లో పనిచేస్తున్నారు. మరికొంతమంది స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌గా స్థిరపడ్డారు. ఇంకొంతమంది మాత్రం నిర్మాణరంగంలో ఉపాధి చూసుకున్నారు. అయితే కూలీలుగా కాదు.. ఇంజినీర్లుగా భవనాలు కడుతున్నామని చెప్పారు. ఇదే మేం కోరుకుంది. ఆ పిల్లలు సాధించిన విజయాలే మా లక్ష్యాన్ని చూపిస్తున్నాయి’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న మంజూష లాంటి స్వచ్ఛంద సేవకులు ప్రతి చోటా కనిపిస్తుంటారు. భిన్న మార్గాల్లో సామాజిక సేవలో ముందుంటున్న వారందరికీ మనసారా అభినందనలు తెలియజేద్దాం.

➡️