ఉద్యోగం చేస్తున్న అమ్మల కోసం …

Feb 24,2024 09:43 #feature

                ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డ ఎందరో మహిళలు అమ్మ అయిన తరువాత అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. రెండు వైపులా సమన్వయం చేసుకోలేక ఉద్యోగాలను వదిలి పెట్టేవారు కూడా ఉంటారు. ఎంతో కష్టపడి, ఇష్టపడి సాధించుకున్న కొలువైనా సరే, పిల్లల కోసం తృణపాయంగా తిరస్కరిస్తారు చాలామంది. రంగం ఏదైనా మహిళా ఉద్యోగులందరివీ ఇవే బాధలు. ఆఫీసు పనులు, బిడ్డల బాధ్యత వారిని కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. పనిలో ఎంత తీరిక లేకుండా గడుపుతున్నా, వారి ధ్యాస అంతా ఇంటి దగ్గర వదిలివచ్చిన పిల్లలపైనే ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఆ ఉద్యోగినులు ప్రశాంతంగా పనిచేసుకునే మార్గం ఏంటి? బీహార్‌ ఔరంగాబాద్‌ జిల్లా ఐపిఎస్‌ అధికారి స్వప్న జి మేశ్రామ్‌ ఈ సమస్యకి పరిష్కారం చూపారు. ఏంటా పరిష్కారం? తెలుసుకుందాం.

లతకి గతేడాదే బాబు పుట్టాడు. ఆమె ఔరంగాబాద్‌ పరిధిలో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రసూతి సెలవులు ముగించుకుని డ్యూటీకీ హాజరయ్యే సమయం దగ్గర పడుతున్న కొద్దీ లత గుండెల్లో రాళ్లు పరుగెడుతున్నాయి. డ్యూటీకి వెళితే బిడ్డను ఎవరు చూసుకుంటారు? ఇదే ఆమె దిగులు. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న భర్త కూడా తన వల్ల కాదంటూ చేతులెత్తేశాడు. ఇక బిడ్డను చూసుకోవాల్సింది లతే. కాని ఎలా? ఇరుగుపొరుగు ఇళ్ల దగ్గర ఎంతకాలం ఉంచగలదు! బంధువుల్లో కూడా బిడ్డను చూసుకునే వారు లేరు. డ్యూటీ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ఈ ఆలోచనలతో ఆమెకి పిచ్చెక్కిపోతోంది. ఈ బాధ లత ఒక్కదానిదే కాదు. ఎంతోమంది మహిళా ఉద్యోగులది.

ఈ సమస్యకి ఐపిఎస్‌ స్వప్న ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు. రెండు నెలల క్రితమే ఆమె ఓ డే-కేర్‌ కేంద్రాన్ని (క్రెచ్‌) ప్రారంభించారు. అందులో మహిళా కానిస్టేబుళ్ల పిల్లలను సంరక్షించే బాధ్యతలను కొంతమంది ఉద్యోగులకు అప్పగించారు. ‘ఒక్కోసారి మా కానిస్టేబుళ్లు చాలా దూరంలో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంటి దగ్గర పిల్లల గురించి బెంగ పడుతుంటారు. నేను ఎన్నో సార్లు వాళ్లు ఆందోళనగా ఉండడం చూశాను. అందుకే ఈ డే-కేర్‌ని ప్రారంభించాం. ‘పల్నా ఘర్‌’ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నాం. కానిస్టేబుళ్లు విధుల నుండి ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ల పిల్లలను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశాం’ అని క్రెచ్‌ కార్యకలాపాల గురించి స్వప్న చెబుతున్నారు.

క్రెచ్‌ల ఏర్పాటుపై అక్కడి మహిళా కానిస్టేబుళ్లు ఎంతో ఆనందపడుతున్నారు. ‘ఒక్కోసారి మేము అదనపు గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఆ సమయంలో పిల్లల గురించి చాలా గాబరా పడతాం. కానీ ‘పల్నా ఘర్‌’ ఏర్పాటు చేశాక ఆ దిగులు పోయింది. ఇక్కడ మా పిల్లలు సురక్షితంగా ఉంటారు’ అని కానిస్టేబుల్‌ కుందన్‌ కుమారి చెబుతోంది. ‘ఈ జిల్లాలో నియమితులైన మహిళా కానిస్టేబుళ్లకు ఇది గొప్ప అవకాశం’ అంటోంది రవింత కుమారి. ఈ క్రెచ్‌లోకి ఏడాది వయసు నుండి ఐదేళ్ల లోపు పిల్లల వరకు అనుమతి ఇస్తున్నారు. పాలు, ఆహారంతో పాటు అభ్యాస సామర్థ్యాలు ఉన్న పిల్లలకు విద్యా బోధన వంటి సదుపాయాలన్నీ ఉచితంగా అందిస్తున్నారు. పిల్లల సంరక్షణా బాధ్యతలను కొంతమంది మహిళా కానిస్టేబుళ్లకి అప్పగించారు. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంగా ఉన్న పిల్లల కోసం ప్రత్యేక కౌంటర్లు, సిసిటివీ నిరంతర పర్యవేక్షణలో ఈ క్రెచ్‌లు పనిచేస్తున్నాయి. ప్రతి రెండు రోజులకొకసారి సీనియర్‌ అధికారులు క్రెచ్‌లను సందర్శిస్తున్నారు.

ఉద్యోగుల సంరక్షణ కోసం ముఖ్యంగా మహిళా ఉద్యోగుల కోసం సోషలిస్టు దేశాలు ఎన్నో ఏళ్ల నుంచి ఈవిధమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. మనదేశంలో కేరళ మినహా ఈ తరహా వసతులు ఏ రాష్ట్రంలోనూ లేవు. ఈ నేపథ్యంలో ఐపిఎస్‌ స్వప్న తీసుకున్న ఈ నిర్ణయం హర్షించతగ్గది. ఈ వసతులు భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో అమలు కావాలని ఆశిద్దాం.

➡️