ఆటల కాలం

Apr 7,2024 04:05 #jeevana

ఎండాకాలం వచ్చింది
బడికి సెలవు ఇచ్చారు

ఇది ఆటపాటల కాలం
అల్లరితో చిందులు వేసే కాలం
దోస్తులను దగ్గర చేసే కాలం
ఊ కొడుతూ కథలు చెప్పుకునే కాలం

ఎండాకాలం వచ్చింది
బడికి సెలవు ఇచ్చారు

ఇష్టమైన కర్బూజా, కొబ్బరిబోండాం
తాటిముంజలు, రాగిజావ
చెరకురసం, నిమ్మసోడా
చల్లచల్లగా తాగే కాలం

ఎండాకాలం వచ్చింది
బడికి సెలవు ఇచ్చారు

ఇదే మామిడికాయల కాలం
ఆవకాయల ఘుమఘుమల కాలం
కాయలు తియ్యని పండుగా మారేకాలం
ఆనందంతో లట్టలు వేసే కాలం

ఎండాకాలం వచ్చింది
బడికి సెలవు ఇచ్చారు

కోయిల రాగాలను వినిపించే కాలం
బండు మల్లెల, సన్నజాజుల
పరిమళాల పలకరింపుల కాలం
ఎండను మరిపించే కాలం

ఎండాకాలం తిరుగు ప్రయాణమైంది
వర్షాకాలం మొదలైంది

నల్లనిమబ్బుల ఆకాశం
చిటపట చినుకుల
ఆటలు ఆడేస్తోంది
బడిగంట గణగణమంటూ పిలుస్తోంది

ఇక కొత్త పుస్తకాల కాలం వచ్చింది
ఇది పై తరగతులకు ఎగిరే కాలం

– డా. నీరజ అమరవాది,
98491 60055.

➡️