కొత్త ఆశలు చిగురించే ‘ఉగాది’

కోయిల రాగాలకు, కొత్త చివుళ్ల అందాలకు స్వాగతం పలికే వసంత వేళ.. ఉగాది జరుపుకుంటాం. చిగురించిన మోడులు కొత్త ఆశలను కలిగిస్తే, కోయిల రాగాలు మనసుని ఉల్లాసపరుస్తాయి. మోడు వారిన జీవితాల్లో వెలుగులు తప్పక నిండుతాయని ప్రకృతి చెప్పే గొప్ప సందేశాన్ని తీసుకొస్తుంది ఉగాది. జీవితమంటే సంతోషం, దు:ఖం, కష్టం, సుఖం, ఆనందం, విచారాల సమ్మేళనమని ఉగాది పచ్చడి రుచుల సాక్షిగా చెప్పే పండగ ఇది.

ప్రతి రోజూలాగే ఈ రోజు కూడా ఉంటుంది అనుకుంటే మనం పొరబడినట్టే. వేకువజామునే నిద్రలేచి ప్రకృతిని ఒక్కసారి చూస్తేగాని మనం ఇన్నాళ్లు కోల్పోయిన పరవశం అర్థం కాదు. వసంతానికి అంత శక్తి ఉంది కాబట్టే, ఎందరో కవులు, రచయితలు వసంతకాలాన్ని తమ కవితలతో, రచనలతో మరింత సుందరంగా అక్షరీకరించారు.
అంతా అయిపోయింది అన్న చోట- ‘ఇంకా ఎంతో ఉంది’ అని చాటి చెప్పే సందర్భాన్ని వసంతం గుర్తుకుతెస్తుంది. జీవితమంటే – శిశిరంలాంటి ప్రతికూలతతో పోరాడి.. వసంతం వంటి చైతన్యంలోకి ప్రయాణించటమని చాటి చెబుతుంది. శూన్యం ఆవరించింది అనుకున్నా, ఆశ కోల్పోకూడదన్న సంకేతం ఇస్తుంది వసంత కాలం. శిశిరం కమ్మేసిన సుషుప్తావస్థ నుంచి, వసంతమనే మేల్కొలుపుకు ఉగాది ఆరంభం.

ప్రకృతి పండగ..
ఉగాది అచ్చమైన, స్వచ్ఛమైన ప్రకృతి పండగ. మనది వ్యవసాయాధార దేశం. ఇక్కడ జరుపుకునే ప్రతి పండగ ప్రకృతి చుట్టూనే అల్లుకుంటుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు ప్రారంభించే శుభదినంగా ఉగాది రోజును జరుపుకుంటారు రైతన్నలు. ప్రాంతానికో పేరున్నా పరమార్థం మాత్రం ఒక్కటే అన్నట్లు సాగుతుంది.

పంచాంగం పేరుతో పక్కదారి..
ఇంత ప్రాశస్త్యమున్న ఉగాది పండగ రోజు పంచాంగ శ్రవణం పేరుతో ఎంతోమంది పెద్దలు భవిష్యత్తు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదొక తంతు మాదిరిగానే ప్రతి ఏటా నడుస్తోంది. భూత, వర్తమాన కాలాల మీదే భవిష్యత్తు ఆధారపడుతుంది తప్ప, చేతి రాతల్లో, పంచాంగాల్లో, పుస్తకాల్లో లిఖించబడదు. ఇప్పుడేమో, చేతులు కట్టుకుని కూర్చొని, భవిష్యత్తు గురించి కలలు కనటం, బెంగపడడం, భయపడడం హాస్యాస్పదం కాక మరొకటి కాదు. కానీ ఇప్పుడు మనమంతా భవిష్యత్తు గురించి భయపడే కాలంలో ఉన్నాం. ప్రకృతిలో వచ్చిన పెను మార్పులు భవిష్యత్తుని అంధకారం చేస్తున్నాయి.

ఆవశ్యకత ముంచుకొచ్చింది..
‘కాలాలు మూడు, రుతువులు ఆరు’ అని బాల్యంలో అభ్యసించిన రోజులను ఈ రోజు మరోసారి నెమరువేసుకుంటారు ఎంతోమంది. బుజ్జాయిలకు, చిన్నారులకు పనికట్టుకుని ప్రకృతి పాఠాలు చెబుతారు చాలామంది. అయితే ఈ ఒక్కరోజే కాదు, ప్రతి రోజూ ప్రకృతి ఆవశ్యకతను చెప్పాల్సిన కాలం వచ్చింది. కాలాలు గతి తప్పి చాలా కాలమైంది. రుతువులు దిశ మార్చుకుని దశాబ్దాలు కావస్తోంది.
ప్రకృతిని కాపాడుకుంటూ, పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యతను ఈ ఉగాది మనముందుకు తెచ్చింది. యుద్ధాలు, వైరస్‌ల కంటే ప్రకృతి ప్రకోపం చాలా పెద్దది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏడాదంతా ఎండాకాలాన్ని తలపిస్తోంది. ప్రస్తుత కాలంలో ‘వానలు కురిస్తే కుంభవృష్టి, లేకపోతే ఒక్క చుక్క రాలడం లేదు’. వర్షాకాలానికి, ఎండాకాలానికి, చలికాలానికి మధ్య ఉన్న అంతరం ఎప్పుడో చెరిగిపోయింది. కాలం కాని కాలంలో వానలు పడుతున్నాయి. వానాకాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.

మేల్కోలుపు కావాలి..
ప్రకృతి ఆవశ్యకతను చాటిచెప్పే ప్రతి పండగ, మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ముందున్న కాలం మరింత జాగ్రత్తపడమని చెబుతుంది. ఉగాది పండగ ఆ వరుసలో ముందుంటుంది. ప్రకృతిలో వచ్చిన స్పష్టమైన మార్పులకు ఉగాది ప్రతిబింబం. ప్రకృతికి, మనిషికి దూరం పెరగకూడదు. ఎంత పెరిగితే అంత అనర్థం. అలాంటి అనర్థాలకు తావు లేని ప్రతిరోజూ వసంతాల ఉగాది అవుతుంది. పర్యావరణాన్ని హరించే ధోరణులు దారుణంగా పెచ్చుపెరిగితే – ఉగాది కూడా శిశిరంలోని శీతల చీకటి రాత్రిలాగానే మిగులుతుంది.

ఎన్నికల వేళ…
ఈ ఏడాది ఉగాదికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పుడు మనం ఎన్నికల కాలంలో ఉన్నాం. ఏ పనికైనా మంచి, చెడుల విశ్లేషణ చాలా ముఖ్యం. రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే పాలకుల ఎన్నిక కూడా అంతే ముఖ్యం. పౌరులంతా చైతన్యవంతమై పాలకులను ఎన్నుకోవాలి. ప్రజల తరపున నిలబడే నాయకుడిని గుర్తించాలి. మన కులం వాడనో, మన మతాన్ని రక్షిస్తాడనో ఓటు వేయడం మాని, ప్రజలకు మేలు చేసే వారిని గెలిపించుకోవాలి. ఓటు అనే వజ్రాయుధం మీ చేతుల్లోనే ఉంది. సరైన నిర్ణయం మీ మస్తిష్కంలోనే దాగుంది. చైత్ర మాస ఆరంభమైన ఈ ఉగాది రోజున పౌరులంతా చైతన్యవంతమై నాయకులను ఎన్నుకోవాలి.

రుచులు నేర్పే గుణగణాలు..
ప్రలోభాలకు, ప్రగల్భాలకు లోబడకుండా ప్రకృతి నేర్పిన కమ్మని పాటతో కోయిల మనల్ని నిద్రలేపుతుంది. కోయిల గానమంత స్వచ్ఛతను మనమూ అలవర్చుకోవాలి. వేప పువ్వు చేదు నుండి చెడుని దూరం చేయాలి. చింతపండు పులుపు నుండి నిజాన్ని గ్రహించడం నేర్చుకోవాలి. మామిడి కాయ వగరు నుండి నాయకుల గుణగణాలను బేరీజు వేసుకోవాలి. ఉప్పు, కారం రుచుల నుండి పాలకుల పనితీరును అంచనా వేయాలి. బెల్లం తియ్యదనం నుండి ఏ నాయకుడు ప్రజలకు రక్షకుడిగా ఉంటాడో గ్రహించాలి.
ఈ ఉగాది పండగ రోజు ఇంటిల్లిపాది వసంతకాల ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ, ఎన్నికల వేళ చైతన్యంతో ముందుకు నడవాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.

పచ్చడి పరమార్థం..
పండగలన్నీ పరమాన్నం, పిండివంటలతో ప్రారంభమైతే, ఉగాది పండగ మాత్రం షడ్రుచుల పచ్చడితో మొదలౌతుంది. తీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు, వగరు కలబోతలో జీవిత పరమార్థాన్ని చాటిచెబుతుంది ఈ పచ్చడి. వేప పువ్వు, మామిడికాయ, కొత్త బెల్లం, కొత్త కారం, ఉప్పు, కొత్త చింతపండు సమపాళ్లల్లో కలగలపుకుని ఇంటిల్లిపాది ఆస్వాదించే పచ్చడి రుచి ఇదీ అని చెప్పలేము. ఆరు రుచుల ఉమ్మడి ఆస్వాదన ఉగాది పచ్చడి ప్రత్యేకత.

➡️