శ్రమయే శక్తి

May 16,2024 04:40 #chinnari, #feachers, #jeevana

వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్‌కి మహిమలపై ఆసక్తి ఉంది. ఒకసారి అతనికి పురాతన కాలం నాటి ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి, ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు. గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ, స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందనీ అక్కడ రాసుంది. వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్‌.
ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందని ఆశ పడ్డాడు. నది ఒడ్డున వారం రోజులు వెతికినా ఆ విలువైన రాయిని గుర్తించలేకపోయాడు. అయినా వెతుకుతూనే ఉన్నాడు. రెండు వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. రాయిని వెతికే పనిలో పడి చాలా సమయం వృధా చేశాడు. కొన్ని రోజుల తరువాత కృష్ణమోహన్‌కి తన తప్పు తెలిసి వచ్చింది. మహిమలు, మాయలు అంటూ రాళ్లు, రప్పల వెనక పడడం మాని, కష్టపడి పని చేయాలని మనసులో బలంగా అనుకుని వెనుదిరిగాడు. కష్టించి పనిచేయడం మొదలుపెట్టి సంతోషంగా జీవించాడు.

– ఆర్‌.భువన, 10వ తరగతి,
అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా.

➡️