బద్ధకం

Dec 18,2023 10:28 #feature

                తాడిపత్రి అనే గ్రామంలో రంగయ్య, చలమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడూ మర్రి చెట్టు కింద కూర్చుని దారిన వచ్చి, పోయే వారిని పలకరిస్తూ, ముచ్చట్లు పెడుతూ కాలం గడిపేవారు. ఊరి వాళ్లు వీళ్లిద్దరిని బాగా తిట్టుకునేవారు. పనీపాట లేక ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, బద్ధకస్తులుగా తయారయ్యారని ముఖం మీదే అనేవారు. రోజూ ఆ మాటలు వింటున్న రంగయ్య ఆలోచనలో పడ్డాడు. ‘అరేరు.. ఊరు వాళ్ళందరూ మనల్ని బద్ధకస్తులు అని పిలుస్తున్నారు. మనం కూడా ఏదైనా ఒక పని చేసి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేద్దాము’ అని చలమయ్యతో అన్నాడు.’నువ్వు భలే వాడివిలా ఉన్నావే, వారన్న మాటలను పట్టించుకుంటే మనము బతకలేస్తామా? మనకు ఇప్పుడు పని చేయాల్సిన అవసరం ఏముందిరా.. హాయిగా తింటున్నాము. చెట్టు నీడన కూర్చుంటున్నాము కదా’ అని అన్నాడు చలమయ్య. ‘అది కాదురా.. ఒకసారి మనం కూడా పనిచేస్తే మనల్ని ఏమీ అనరు కదా’ అని రంగయ్య అన్నాడు. ‘సరే! ఏ పని చేద్దాము చెప్పు’ అని అడిగాడు చలమయ్య. మన దగ్గర ఉన్న డబ్బులతో చెరొక బర్రెను తీసుకొని సాకుదాం. అది పాలు ఇస్తుంది ఆ పాలు అమ్ముకొని వ్యాపారం చేద్దాము’ అని రంగయ్య సలహా ఇస్తాడు. ‘సలహా బాగుందిరా. రేపు ఉదయమే అంగడికి వెళ్లి బర్రెలను కొనుక్కొని వద్దాము’ అని నిర్ణయించుకున్నారు.

మరుసటి రోజు ఉదయమే మర్రి చెట్టు వద్దకు వెళ్లి చలమయ్య కోసం ఎదురు చూశాడు రంగయ్య. చలమయ్య ఎంతకు రాకపోయేసరికి తాను ఒక్కడే అంగడికి వెళ్లి బర్రెను కొనుక్కొని వచ్చాడు. పాల వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారం పెరిగింది. ఒక బర్రె నుండి పదుల సంఖ్యలో పెరిగాయి. బర్రెలను సాకుతున్న దగ్గర నుంచి రంగయ్యకు తీరిక లేకుండా పోయింది.

చలమయ్య ఒక్కడే చెట్టు కింద కూర్చుని వచ్చే వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ కాలం వెళ్ళదీసేవాడు. ఎప్పుడో ఒకప్పుడు రంగయ్యే తన దగ్గరకు వస్తాడని ఎదురుచూశాడు. కానీ, పాల వ్యాపారంలో రంగయ్య తీరికలేకుండా ఉన్నాడు. అతన్ని చూసి గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. దీంతో, చలమయ్య ఇప్పటికైనా మారకపోతే ఈ ఊరు నన్ను ఓ అసమర్ధుడిలా భావిస్తుందని భయపడ్డాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే ఓ బర్రెను కొనుక్కోవడానికి అంగడికి బయలుదేరాడు.

– భూక్యా గణేష్‌, 10వ తరగతి,63053 93291.

➡️