కష్టజీవి కాళ్లకు చెప్పులు ‘జోడి’ద్దాం!

Apr 30,2024 08:51 #feachers, #jeevana, #poor feet, #sandals

మండే ఎండలో ఎంతసేపు ఉంటాం! ఎండ వేడికి తాళలేక ఏ చెట్టు నీడనో, వంతెన కిందో తలదాచుకునే వారు ఎంతోమంది. కానీ అదే ఎండలో, నిప్పుల కొలిమిలా భగభగ మండే సూర్యకిరణాల కింద రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే కార్మికులెంతోమంది. కాసేపు వారి వంక తీక్షణంగా చూస్తే, చాలామందికి భరించరాని ఎండ, వారికి పెద్ద విషయం కానట్లు పనిచేసుకుపోతారు. ఇంకాస్త నిశితంగా పరిశీలిస్తే, చిరిగిన బట్టలు, కమిలిన రంగులో శరీరం, చెమటతో తడిసిన బట్టలు, బొబ్బలెక్కిన చేతులు హృదయాన్ని కదిలిస్తాయి. ఇంకా బాధాకరమైన విషయమేమంటే అంత ఎండలో కాళ్లకు చెప్పుల్లేకుండా పనిచేయడం. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఓ చోట ఈ దృశ్యం మన కంటపడుతూనే ఉంటుంది. ‘అయ్యో పాపం’ అనుకుంటామే కానీ, ‘అంతకుమించి ఏం చేయలేం’ అని మనసుకి సర్ది చెప్పుకుని, అక్కడి నుండి ముందుకు కదులుతాం. కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన కొంతమంది యువకులు అలా చూస్తూ ఊరుకోలేదు. అలాగని వారి జీవితాలలో గొప్ప గొప్ప మార్పులూ తేలేదు. ఆ శ్రామికులకు ఒక్క జత చెప్పులు ఇస్తున్నారంతే. ఇది వినడానికి చాలా చిన్న విషయంలా ఉంటుంది. కానీ దీనిచుట్టూ పెనవేసుకున్న విషయాలు మనసున్న ప్రతి మనిషికీ కన్నీళ్లు పెట్టిస్తాయి.


ఆకాశాన్ని అంటే భవంతుల మధ్యే నేలనంటి పెట్టుకున్న పూరి గుడిసెలు కనిపిస్తాయి. ముఫ్పై రకాల వంటకాలతో ఎక్కాదిక్కా తిని తేన్పే మనుషుల మధ్యే, కాసిన్ని గంజినీళ్ల కోసం రోజుల తరబడి ఎదురు చూసే ప్రాణులు వుంటారు. ఈ దయనీయ స్థితిలో ఒక్క జత చెప్పులు కొనుక్కోవడం వారికి తీరని కోరిక. పూట గడవని పేదల జీవితాల్లో మార్పు తేవాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా కృషిచేస్తారు. విద్య, ఉపాధి ఇస్తుంటారు. అలాంటి వారిలో దివ్యాన్షు ఒకరు. ‘హోప్‌ వెల్ఫేర్‌ ట్రస్టు’ ద్వారా ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా ఆ ప్రజల విద్య, ఉపాధి, మహిళా సాధికారత, ఆరోగ్యం, పరిశుభ్రతపై ఆయన అవగాహన తెస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాల్లో భాగంగా ఆ ప్రాంతాలను తరచూ సందర్శించిన దివ్యాన్షు ఈ వేసవిలో ఒక్క జత చెప్పుల కోసం రూ.వంద విరాళం ఇవ్వండి అని ప్రచారం చేస్తున్నారు. వచ్చిన నిధులతో ఆ ప్రజలకు చెప్పులు పంపిణీ చేస్తున్నారు. పాదరక్షల ఉత్పత్తిలో స్థానిక మహిళలను భాగస్వామ్యం చేసి వారికి ఉపాధి కూడా చూపిస్తున్నారు.


ఉత్తరప్రదేశ్‌ మిర్జాపూర్‌లో బహరి అటవీ ప్రాంతానికి ఆనుకుని కొన్ని గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఎండాకాలం సూర్య కిరణాల తాకిడికి భూమి లావాలా ఉడుకుతుందా అన్నంత వేడిగా ఉంటుంది. అయినా, అంత వేడిలో ఆ గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లి వంటచెరకు సేకరిస్తారు. మధ్యాహ్న వేళ, సున్నపురాళ్ల క్వారీలో పనిచేస్తారు. రాత్రి వేళ కట్టెలన్నింటినీ మోపులు కట్టుకుని విక్రయించేందుకు దూర ప్రాంతాలకు వెళతారు.
70 ఏళ్ల శ్యాంబాబు కొన్ని దశాబ్దాలుగా ఏ మార్పూ లేకుండా ఈ పనే చేస్తున్నాడు. ఉదయం వేళ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకురావడం, మిట్టమధ్యాహ్నం వేళ కనీసం కాళ్లకి చెప్పుల్లేకుండా రాళ్లు కొట్టడం అతని దినచర్య.
‘ఒక జత చెప్పులు కూడా కొనుక్కోలేవా?’ అని ఎవరైనా అడిగితే.. ‘రోజు మొత్తం కష్టపడితే రూ.80 వస్తాయి. ఆ డబ్బులతో తిండి గింజలే కొనుక్కోనా? చెప్పులే కొనుక్కోనా?’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు. శ్యాంబాబు లాంటి వృద్ధులు అక్కడ ఎంతోమంది. రెండు పూటలా తిండి తినడం కోసం ముళ్ల పొదల్లో, పదునైన రాతి నేలల్లో పాదాలు రక్తం కారుతున్నా అదే పనిగా పనిచేసుకు పోతారు. ‘గాయాలవు తాయని నేను సొంతంగా చెప్పులను తయారుచేసుకుంటాను. ఆకులతో నా పాదాలను చుట్టేసి, తాళ్లతో బంధిస్తాను, అడవిలోకి వెళ్లేంత వరకు ఇవి నాకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే, ముళ్లపొదలు, రాళ్ల గుట్టలు ఎదురవుతాయో, కాళ్లకు చుట్టుకున్న ఆకులు చిరిగిపోతాయి. మధ్యాహ్నం నాటికి వాటి రూపురేఖలు అసలు ఉండవు. అవి లేవని నా పని ఎలా ఆపను? అందుకే వాటితో సంబంధం లేకుండా పని చేసుకుంటాను’ అని బాధనంతా పంటిబిగువున బిగబట్టి పైకి నవ్వుతూ సమాధానమిచ్చాడు శ్యాంబాబు. దశాబ్దాలుగా అతను ఈ పనే చేయడం వల్ల కాళ్లు కొయ్యబారిపోయాయి. బొబ్బలతో అరికాళ్లు రాటుదేలిపోయాయి. పాదాలే కాదు, కాలంతా నల్లగా, పగుళ్లతో కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో శ్యాంబాబు లాంటి వాళ్లే కాదు, మహిళలు కూడా కాళ్లకు చెప్పుల్లేకుండా రోజంతా కష్టపడతారు. స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా రాళ్ల దారిలో చెప్పుల్లేకుండా నడుస్తారు.


బెనారస్‌ యూనివర్శిటీలో న్యాయవాద విద్య అభ్యసిస్తున్న దివ్యాన్షు ఉపాధ్యాయ ఈ ప్రాంతం వాడే. చిన్నప్పటి నుండి తన చుట్టూ ఉన్న వారు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా చూశాడు. పెద్దాయ్యాక, ఈ పరిస్థితిలో మార్పు తేవాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అలా 2015లో తన స్నేహితుడు రవి మిశ్రాతో కలసి ‘హోప్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ని నిర్వహిస్తున్నాడు. 9 ఏళ్ల క్రితం ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైన ఈ సేవా కార్యమ్రాల్లో, ఇప్పుడు పదుల సంఖ్యలో మిత్రబృందాలు చేతులు కలిపాయి. బెనారస్‌ హిందూ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు కూడా దివ్యాన్షు మిత్రద్వయంతో కలిశారు.
ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిన తరువాత ఆ యువకులకు ఎన్నో ప్రతిబంధాకాలు, మరెన్నో అవరోధాలు. ‘ఒక్క జత చెప్పులు ఇచ్చి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతారా?’ అన్న వ్యాఖ్యానాలు, వంద రూపాయలకు ఎక్కడి నుండి చెప్పులు తీసుకువస్తారు? ఆ డబ్బంతా ప్రయాణాలకే ఖర్చయిపోతుంది. అన్న సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. అయితే ఇవే ప్రశ్నలకు రాళ్ల క్వారీలో శ్యాంబాబుతో పాటు పనిచేస్తున్న 25 ఏళ్ల వికాస్‌ చాలా ఆవేశంగా సమాధానలు చెబుతున్నాడు. ‘ఈ చెప్పులు మా జీవితాలను ఉద్ధరించవు. అయితే ఇవి మమ్మల్ని ముళ్ల పొదల నుండి రక్షిస్తాయి. ఎండకు కాళ్లు మలమల మాడిపోకుండా కాపాడతాయి. రాళ్ల క్వారీలో రాళ్లు గుచ్చుకుంటాయన్న భయం లేకుండా నేను చాలా వేగంగా నడవగలను’ అంటూ చెబుతున్న వికాస్‌ మాటలు వింటుంటే ఆ చెప్పుల జత వారికి ఎంత ముఖ్యమో అర్థమవుతుంది!

➡️