ఆటంకాలను అధిగమించి…

Apr 7,2024 04:27 #Jeevana Stories

జీవితం ఏ ఒక్కరికీ వడ్డించిన విస్తర కాదు. వచ్చిన ఆటుపోట్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగటమే మార్గం. ఆ మార్గంలో ఎదరయ్యే అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగితే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు. మహిళలు కూడా ఆర్థిక స్వావలంభన సాధించాలనీ, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని కంకణం కట్టుకుని నెరవేర్చిన ఘనత సరబ్జీత్‌కౌర్‌కు దక్కుతుంది. ఆమె అందరిలాగా నడిచే వ్యక్తేమీ కాదు. రెండుపోలీయో కాళ్లతో చేతికర్రల సాయంతోనే ఆమె నడవగలరు. అయితేనేం ఆమె ఎంచుకున్న స్వయం ఉపాధి రంగంలో నిపుణత ద్వారా ఆర్థిక స్వావలంభన సాధించారు. మరెందరో మహిళలకు ఉపాధి అవకాశాలు చూపుతూ ముందుకు సాగుతున్నారామె.
పంజాబ్‌జిల్లా భటిండా జిల్లా సేఖు గ్రామానికి చెందిన సరబ్జీత్‌కౌర్‌ (44). పుట్టికతో వికలాంగురాలు. పోలియో కాళ్లతో పుట్టడంతో తల్లిదండ్రులు ఇదేమి ఖర్మ అంటూ వాపోయారు. ఎలా పెంచి పెద్ద చేయాలని భావించారు. ఆ తర్వాత చదివించారు. కుట్టు శిక్షణ కూడా నేర్పించారు. కాళ్లు లేకపోయినా చేతులు, కర్ర సాయంతో కుట్టుశిక్షణ చేయగలుగుతున్నారు. తల్లిదండ్రులకు చోదోడువాదోడుగా ఉంటూ బట్టలు కుట్టడం ద్వారా కొంతమేర సంపాదించగల్గుతున్నారు. శరీరం వికలాంగత్వంతో ఉందని ఆమె ఏ రోజూ బాధపడలేదు. తనలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీస్తే ఖచ్చితంగా అద్భుతమైన విజయం వరిస్తుందని ఆమెకు తెలుసు. అందుకే జీవితంలో కష్టపడి ఎదగాలని భావించింది. ఎంబ్రాయిడరీతోపాటుగా, ఎలక్ట్రికల్‌ మిషన్‌పైన వర్కు నేర్చుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులే ‘నువ్వు చెయ్యగలవా’ అంటూ అనుమానాలు..అవిటిదానివి ‘నువ్వేమి చేస్తావ్‌’ అంటూ చుట్టుపక్కల వారి హేళనలు. సామాజిక అసమానలు వంటివి సైతం ఎదుర్కొన్నారు. ఉన్న కళ, సృజనాత్మకత పెంపొందించుకోవటానికి నిరంతరం ఆమె కృషిచేస్తూనే ఉంది. ఈ క్రమంలో సోన్‌పాల్‌ అనే వికలాంగుడితో తల్లిదండ్రులు వివాహాన్ని జరిపించారు. కుటుంబ పోషణ నిమిత్తం భార్యాభర్తలు ఇద్దరూ కుట్టుమిషన్‌ ద్వారా దుస్తులు కుడుతూ వచ్చిన ఆదాయంతో జీవనోపాధి పొందుతున్నారు. ఇలా కుటుంబ జీవనయానం కొనసాగుతున్న క్రమంలో 2017లో హెచ్‌పిసిఎల్‌-మిట్టల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఇఎల్‌) ఎన్‌జిఒ ఆధ్వర్యంలో గ్రామంలోని స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జి) ఏర్పాటుచేస్తే ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందుతుందని నిర్వాహకులు ప్రకటించారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కొత్తగా ఎస్‌హెచ్‌జి ఏర్పాటు, నాయకత్వంలోకి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అప్పుడు కౌర్‌ తనే ముందుకు రావటంతో మరో 9మంది సభ్యులుగా చేరటానికి అంగీకరించారు. గురు రవిదాస్‌ స్వయం సహాయ సంఘం ఏర్పాటుచేశారు. సభ్యులు కొంత పొదుపు చేస్తే ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేస్తుందనటంతో సంఘ సభ్యులు ఒక్కొక్కరుగా రూ.100 చొప్పున పొదుపు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి రూ.15 వేలు చొప్పున రివాల్వింగ్‌ ఫండ్‌గా మంజూరైంది. తద్వారా గ్రూపులోని మిగతా సభ్యులు కూడా కుట్టుమిషన్లు కొనుక్కోగలిగారు. అప్పటికే తమ ఇంట్లో కౌర్‌ దంపతులు ఇద్దరూ కుట్టుశిక్షణ చేస్తున్నారు. వీరిద్దరూ మిగతా మహిళలకు శిక్షణ ఇవ్వటానికి పూనుకున్నారు. మహిళలు ఎక్కువ మంది చేరుతుండటంతో గ్రూపుల సంఖ్య కూడా పెరిగింది. ఇలా గ్రామంలోని అన్ని ప్రాంతాలకు ఆమె వెళ్లి మహిళలను శిక్షణకు ప్రోత్సహించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మహిళలను సమీకరించి మరో 29 ఎస్‌హెచ్‌జి గ్రూపులు ఏర్పాటుచేయటం ద్వారా నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసింది. కుట్టు పని నుంచి బేకరీ, డెయిరీ యూనిట్లు, బంగాళాదుంప, అరటి చిప్స్‌, పచ్చళ్ల ప్యాకింగ్‌, వాటర్‌ ఆర్‌ఒ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. తద్వారా మహిళలు వాటిలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని జీవనోపాధికి మార్గాన్ని ఎంచుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. కౌర్‌ చేస్తున్న కృషితో మిగతా మహిళలు కూడా ఈ తరహాలో ఏదో ఒక నైపుణ్యాన్ని పెంపొందింప జేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు.

ఇ-బైక్‌ సహాయంతో
కౌర్‌ చేస్తున్న కృషిని గమనించిన హెచ్‌ఎంఇఎల్‌ ప్రతినిధులు ఆమెకు ఇ.స్కూటర్‌ను అందజేశారు. ఆమె ప్రతిరోజూ గ్రామంతోపాటు ఇతర ప్రాంతాలకు ఈ బైక్‌పై వెళ్లి అక్కడి మహిళలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఎస్‌హెచ్‌జి గ్రూపులు ఏర్పాటుచేయటం, తద్వారా ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చేయటాన్ని దిన చర్యగా మార్చుకున్నారు.

మహిళలకు స్ఫూర్తిగా…
నైపుణ్య శిక్షణ అందించటమే కాకుండా యూనిట్ల ఏర్పాటుకు వరకూ ఆమే దగ్గరుండి ప్రోత్సహిస్తుండటంతో నిరుపేద మహిళలు, వితంతువులు, వృద్ధ మహిళలు, హేళనకు గురైన వారు సైతం హాజరవుతున్నారు. శానిటరీ ప్యాడ్ల ఉత్పత్తి నుంచి ఆర్‌ఒ సిస్టమ్‌ల నిర్వహణ వరకూ వ్యాపారాలు, స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా ఆయా గ్రూపులు సృష్టిస్తున్నాయి. ఆ తర్వాత ఆమె ఒక సాధారణ మహిళ నుంచి కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా మారారు. ఆ తర్వాత మహిళలు ఆర్థిక స్వాతంత్యం, నైపుణ్యాలను పెంపొందించుకోవటం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు.
వైకల్యం అనేది పరిమిది కాదనీ, మార్పు, ఆవిష్కరణలకు ఉత్ప్రేరకం అని కౌర్‌ భావించి ముందుకు సాగటం సాటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. స్ట్రాంగర్‌ ఉమెన్‌, క్రియేటివ్‌ ఉమెన్‌ అంటూ కౌర్‌కు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుతున్నాయి.

➡️