రాకెట్‌ ప్రయోగం

Jul 3,2024 04:40 #feachers, #Jeevana Stories, #kathalu

ఒకరోజు ఎనిమిదవ తరగతి చదువుతున్న కల్పన, అమ్మమ్మ ఇందిరతో కలసి పక్క ఊరిలోని తిరునాళ్లకెళ్లింది. ‘కల్పనా, చాలా జనం వున్నారు. తప్పిపోతే వెతకడం కష్టం. సెల్‌ ఫోన్‌ ఇంట్లోనే పెట్టి వచ్చాను. చేయి గట్టిగా పట్టుకో’ అంది ఇందిరమ్మ. ‘అమ్మమ్మా, నేను తప్పిపోయినా భయపడొద్దు. వెంటనే రాకెట్‌ పంపుతాను. ఒకదాని తరువాత ఒకటి రాకెట్‌ పంపుతూనే వుంటాను. ఆ రాకెట్‌ చూసావంటే అందులోని శాటిలైట్‌ ద్వారా నేనెక్కడున్నానో తెలిసిపోతుంది’ అంది కల్పన.
‘నీ తెలివి తెల్లారినట్టే వుంది. గట్టిగా పట్టుకో’ అంది అమ్మమ్మ. అయినా ఒక చోట బొమ్మ కొంటున్న సమయాన అమ్మమ్మ చేయి వదిలించుకుని, తోపులాటలో కల్పన కొంచెం దూరం ముందుకు వెళ్లిపోయింది. ఇందిరమ్మ భయంతో అటూ ఇటూ వెతక సాగింది. కొంత సమయం గడిచింది. ఏం చెయ్యాలో అర్థం కాక కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించింది. కల్పన చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అక్కడ అంగడి ముందున్న ఒక బల్ల ఎక్కి నిలబడి చూసింది.
గాలిలో ఒక కాగితం రాకెట్‌ వెళ్లడం గమనించింది. కొంతసేపటికి మరొక పేపర్‌ రాకెట్‌ వెళ్లడం గమనించగానే అమ్మమ్మ ఎంతో సంతోషించింది. మెల్లగా రాకెట్‌ వెళ్లిన వైపు వెళ్ళింది .అక్కడ కల్పన కింద పడిన చిత్తు కాగితంతో రాకెట్‌ చేసి అమ్మమ్మకి తానున్న స్థలం తెలపడానికి పైకి విసురుతూ ఉంది. అమ్మమ్మ దగ్గరకు రాగానే ‘అమ్మమ్మా, రాకెట్టులో ఉన్న శాటిలైట్‌ ద్వారా నేనెక్కడున్నానో గుర్తుపట్టావా’ అని ‘నవ్వుతూ అంది కల్పన. గాలిలో రాకెట్‌ చూడగానే నువ్వు పంపిన రాకెట్‌ అనే ఊహించాను. నీ రాకెట్‌ ప్రయోగం బాగానే వుంది. నువ్వు తప్పకుండా సైంటిస్ట్‌ అవుతావు కల్పనా’ అంటూ ప్రేమతో కల్పన తల నిమిరింది ఇందిరమ్మ.

– ఓట్ర ప్రకాష్‌ రావు
097874 46026.

➡️