విజ్ఞాన, వినోదాల వేసవి శిబిరం

May 26,2024 05:30 #feachers, #jeevana, #summer camps

వేసవి సెలవులంటే పిల్లలకు సరదా. ఆ సెలవుల కోసం పిల్లలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. వేసవి సెలవులకు నువ్వెక్కడికి వెళ్తావంటే, నువ్వెక్కడికి వెళ్తావు? అంటూ చిన్నారుల మధ్య సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా జరుగుతాయి. ఒకప్పుడు వేసవి సెలవులన్నీ అమ్మమ్మ, నాన్నమ్మల ఒడిలో గడిపే బాల్యం నేడు అర చేతులో ఇమిడే సెల్‌ ఫోన్‌కు బందీ అయింది. దీంతో ఆప్యాయత, అనురాగం, ప్రేమ, లాలిత్యం బాల్యానికి దూరమయ్యాయి.

దీన్ని దష్టిలో పెట్టుకొని బాలలు కోల్పోతున్న నిజమైన బాల్యం… తల్లిదండ్రులు విస్మరించిన కుటుంబ సంబంధాలు… పాఠశాలలు వదిలేసిన మానవ సంబంధాలు… ఆధునిక శాస్త్ర, సాంకేతికత విజ్ఞానాల పరిచయం… వినోదాన్ని జోడించి, బాలలను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ (పిసిసి) ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవనంలో మూడేళ్ల నుంచి సమ్మర్‌ క్యాంప్‌ (వేసవి శిబిరం) నిర్వహిస్తున్నారు.
ఈ వేసవి శిబిరానికి బాలల నుంచి, వారి తల్లితండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్కూలికి వెళ్లడానికి అప్పుడప్పుడు మారాం చేసే బాలలు కూడా ఈ శిబిరానికి ఉత్సాహంగా క్రమం తప్పకుండా హాజరు కావడం విశేష స్పందనకు ఉదాహరణ. పిసిసి నిర్వహిస్తున్న ఈ సమ్మర్‌ క్యాంప్‌, ఎన్నో ప్రాంతాల్లో నిర్వహణకు స్ఫూర్తిదాయకమైంది. ఈ సమ్మర్‌ క్యాంపును తిలకించేందుకు వచ్చిన ఇతర ప్రాంతాలకు చెందిన ఎందరికో తమ తమ ప్రాంతాల్లో ఇటువంటి క్యాంపులు నిర్వహించాలని ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ ఏడాది మే 7న అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా ప్రారంభమైన సమ్మర్‌ క్యాంప్‌, జూన్‌ 9 వరకూ నడుస్తుంది. ప్రతి రోజూ 200 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రోజూ ఉదయం గంటన్నర పాటు సెల్ఫ్‌ డిఫెన్స్‌, కరాటే నిర్వహిస్తున్నారు. అనంతరం గంట పాటు చెస్‌, క్యారమ్స్‌, స్కిప్పింగ్‌లతో పాటు క్రీడలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మూడు గంటల పాటు క్యాంప్‌ జరుగుతుంది. మొదటి రెండు గంటలూ మాథమేటిక్స్‌, సైన్స్‌ ప్రయోగాలు, సైన్స్‌ మ్యాజిక్‌, మట్టితో బొమ్మల తయారీ, సోషల్‌, కథారచన, పద్య పఠనం, డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌, మెమెరీ గేమ్స్‌, కార్టున్‌ గీయడం, పప్పెట్రీ షో, కోలాటం, నాటికలు, మైమ్‌, డాన్స్‌, క్విజ్‌, ఆట, పాట, ఇసుకతో ఒంటె తయారీ, బియ్యానికి రంగులేసి సీతాకోకచిలుక తయారీ, లైవ్‌ జంతువుల గురించి వివరించడం… ఇలా రకరకాల ఆసక్తికరమైన అంశాలతో సాగుతోంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. ఇవికాక వారంలో ఒకరోజు ఒక డాక్టర్‌తో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని నింపుతున్నారు. ప్రత్యామ్నాయ విద్యా విధానానికి బాటలు వేస్తున్నారు. ఈ వేసవి శిబిరంలో పాల్గొంటున్న పిల్లలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు పాఠశాలల్లో నేర్పని అనేక విజ్ఞానపు విషయాలు నేర్పుతున్నారని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకుని, పాఠశాలలకు వెళ్లిన తరువాత అక్కడ వీటిని తోటి విద్యార్థులకు నేర్పుతున్నారు. దీంతో విద్యా అభిమానులు, విద్యావేత్తల నుంచి ఈ శిబిరాలనికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మర్‌ క్యాంప్‌ జరుగుతున్న విధానాన్ని సోషల్‌ మీడియాలో తెలుసుకుని, సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహణకు, విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్‌కు అనేకమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు.

వివిధ కార్యక్రమాల్లో …
పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ (పిసిసి) 20 మంది యువతీ యువకులతో పని చేస్తుంది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు బుద్దా శ్రీనివాస్‌ గౌరవ అధ్యక్షులుగా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పిసిసి ఒక్క సమ్మర్‌ క్యాంప్‌కే పరిమితం కాలేదు. అల్లూరి సీతారామరాజు 93వ జయంతి సందర్భంగా 93 మంది చిన్నారులకు అల్లూరి వేషధారణ వేసి, ర్యాలీ నిర్వహించారు. భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా చిన్నారులతో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు.

మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు కవుల వేషధారణ, పద్యాలు, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. పెద్దాపురం మండలంలో పదో తరగతి పరీక్షల్లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. అత్యాచార దాడులకు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన జరిపినపుడు వారికి మద్దతుగా ప్రదర్శన జరిపారు. ఇస్రో శాటిలైట్‌ ప్రయోగాన్ని ప్రొజెక్టర్‌పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనేక సందర్భాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన జాతీయ సౌత్‌ జోన్‌ కరాటే పోటీలకు ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులను తీసుకెళ్లారు. ఈ పోటీల్లో 15 మందికి బంగారు, వెండి, కాంస్య పతకాలు వచ్చాయి. పిసిసిలో వందలాది మంది చిన్నారులు భాగస్వామ్యం అయ్యారు. ఇలా పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానం, వినోదం, వికాసం అందిస్తుంది.

స్కూల్లో కంటే ఇక్కడే బాగుంది. ఇక్కడలానే స్కూల్‌ కూడా విద్యా విధానం ఉంటే బాగుంటుంది. చదువుతో పాటు క్రీడలు, మేజిక్‌ వంటి ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తున్నారు. నేను గత రెండేళ్లుగా విశాఖపట్నం నుంచి వచ్చి ఈ సమ్మర్‌ క్యాంప్‌కు హాజరవుతున్నా. – ఓ.లిఖిత్‌ చంద్ర, 9వ తరగతి, విశాఖపట్నం


పిసిసి సమ్మర్‌ క్యాంప్‌కు గత మూడేళ్లుగా హాజరవుతున్నా. ఈ సమ్మర్‌ క్యాంప్‌ కొత్త స్నేహితులను ఇస్తుంది. పెద్దాపురానికి బంధువుల ఇంటికి వచ్చిన అనేక మంది విద్యార్థులు ఈ సమ్మర్‌ క్యాంప్‌కు వస్తున్నారు. విద్యతో పాటు వినోదం, వికాసం వస్తుంది. – యాసలపు లీలా, పదో తరగతి, పెద్దాపురం


పిసిసి నిర్వహిస్తున్న బాలల వేసవి శిబిరం ప్రజాదరణ పొందుతోంది. విద్యార్థులను తరగతులుగా విభజించి, శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రకాల విజ్ఞానపు అంశాల్లో నిష్ణాతులైన ప్రముఖులతో శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులకు విద్యతో పాటు వినోదం, వికాసం కావాలనేది పిసిసి లక్ష్యం. – కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్‌ కుమార్‌, పిసిసి అధ్యక్ష, కార్యదర్శులు.

– జె.జగదీష్‌, చల్లా విశ్వనాథం

➡️