కన్ను తెరవనివ్వని కర్కశత్వం!

May 18,2024 04:05 #Jeevana Stories

ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎంత పురోభివృద్ధి సాధించినా చాలాచోట్ల లింగ వివక్ష కనిపిస్తూనే ఉంది. చదువుకున్న వారు, చదువుకోని వారు.. అన్న తేడా లేదు. ఇంట్లో మొదటిసారి ఆడపిల్ల పుడితే కలిగే సంతోషం కన్నా, రెండో కాన్పులో ఏ బిడ్డ పుడుతుందో అన్న బెంగ, పైకి చెప్పకున్నా లోలోన మదన పడేవారు ఎంతోమంది. ఈ ఆతృతను, అవసరతను సొమ్ము చేసుకునే వారు ఎంతోమంది గుమ్మంలోనే ఎదురవుతారు. మగబిడ్డ కోసం ఎదురుచూసే కుటుంబాలే ఆదాయ వనరులుగా చేసుకున్న వ్యవస్థలు ఈ మధ్య కాలంలో అనేకం పుట్టుకొచ్చాయి. అలా హర్యానా రాష్ట్రంలో దశాబ్దకాలంగా లింగనిర్ధారణ పరీక్షల బ్లాక్‌ మార్కెట్‌ విస్తృతమైంది. ఈ పరీక్షల ఫలితంగా అక్కడ లింగ నిష్పత్తిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆందోళన చెందాల్సిన విషయమేమంటే చట్టవిరుద్ధమైన ఈ పనికి పూనుకున్న వారెవరూ దోషులుగా తేలడం లేదు. ఎన్నికల ముంగిట్లో ఉన్న ఆ రాష్ట్రంలో పాలకుల కుయుక్తులకు ప్రాణాలు కోల్పోతున్న ఎందరో ఆడబిడ్డల వ్యథాభరిత గాథ ఇది!

పాతగుడ్డలో చుట్టి, చెత్తకుప్పలో విసిరేసిన ప్రాణం లేని పసికందుల దృశ్యాలు అక్కడ కోకొల్లలు. కుక్కలు ఈడ్చుకెళ్లి, కోతులు ఎత్తుకు పోయే నెత్తుటిబిడ్డల ఆనవాళ్లు అక్కడ తరచూ కనిపిస్తాయి. ఎంత వెదికినా ఆ బిడ్డల ఆచూకీ ఎవరికీ తెలియదు. కావాలని వదిలించుకున్న బిడ్డ పక్కన ఏ ఆనవాళ్లు ఉంచని తల్లిదండ్రులు అక్కడ ఎంతోమంది. అయితే బలవంతం మీదో, బెదిరించో, భయపెట్టో పురిట్లో బిడ్డను పురిట్లోనే చంపేసే కర్కశత్వానికి బలయ్యేది పసిపాపే కాదు, కడుపులో పడ్డప్పటి నుంచి, బిడ్డ ప్రతి శ్వాసకు స్పందించిన ప్రతి తల్లీ అందుకు పెద్ద మూల్యం చెల్లించుకుంటోంది. ఆ తల్లుల మౌన రోదన ఎవరూ కొలవలేనిది.
సోనీ (28) రోహతక్‌లో నివసిస్తోంది. చదువుకోలేదు, ఉపాధి లేదు. ఏవిధమైన ఆసరా లేదు. అప్పటికే ఇద్దరు ఆడబిడ్డలకు తల్లి అయిన సోనీ మూడోసారి కాన్పులో ఎంతో ఒత్తిడి భరించింది. కడుపులో ఉండగానే ఆ బిడ్డను చంపేయమని భర్త, అత్తమామల నుంచి ఒత్తిడి మొదలైంది. దీంతో, ఆమె మానసికంగా, శారీరకంగా కుంగిపోయింది. అయినా అబార్షన్‌కు ఒప్పుకోకుండా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడా బిడ్డకు ఆరు నెలలు. ‘అప్పటి సంఘటనలు ఇప్పుడు గుర్తొచ్చినా నా శరీరం నీరుకారిపోతుంది. ఆ రోజు నేను గట్టిగా నిలబడకపోతే, బిడ్డను కడుపులోనే చంపేసుకోవాల్సి వచ్చేది. ఏ తల్లికీ ఇంత కష్టం రాకూడదు’ అంటూ తన ముద్దులలికే మూడో చిన్నారిని గట్టిగా హత్తుకుని చెమర్చిన కళ్లతో సోనీ చెబుతున్నప్పుడు ఎందరో తల్లుల ఆవేదన కనిపిస్తుంది.
బిడ్డను దగ్గరకు తీసుకున్న సోనీని నిశితంగా పరిశీలిస్తే, ఆమె కాళ్లు, చేతులు, శరీరంపై అక్కడక్కడా కాలిన గాయాలు కనిపిస్తున్నాయి. ‘లింగనిర్ధారణ పరీక్ష చేయించుకోమని నాపై ఒత్తిడి చేశారు. అబార్షన్‌కు ఒప్పుకో అని బలవంతం చేశారు. ఎంతకీ ఒప్పుకోలేదు. వాళ్లు చెప్పిన మాట వినలేదని, ఇస్త్రీపెట్టెతో వాతలు పెట్టారు. ఈ పరిస్థితి నా ఒక్కదానిదే కాదు, ఎంతోమంది తల్లులది’ అని ఆనాటి చేదు సంఘటనలను సోనీ గుర్తుచేసుకుంది.
‘ఆడపిల్లను రక్షించండి’, ‘జీవించడం అందరి హక్కు’, ‘భ్రూణహత్యలు నేరం’ అన్న నినాదాలు ఉన్న ప్లకార్డులు ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. గోడల మీద, దుకాణాల మీద, పెద్ద పెద్ద హోర్డింగుల పైన దర్శనమిస్తుంటాయి. ప్రచారానికి పెట్టిన శ్రద్ధ ఆచరణలో లేదు. ఫలితంగా అనాదిగా మగపిల్లవాడి కోసం ఎదురుచూసే ఆ కుటుంబాల్లో చైతన్యం రాలేదు. లింగనిష్పత్తిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 914 మంది అమ్మాయిలు ఉన్నట్లు ఈ ఏడాది మార్చిలో వెలువడిన ఓ నివేదికలో తేలింది. మూడేళ్ల కాలంలో ఈ నిష్పత్తి మధ్య వ్యత్యాసం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది.
ఇంత దారుణ పరిస్థితుల్లో కూడా అన్యాయంగా బలౌతున్న ఆ ఆడపిల్లల పక్షాన నిలబడేవారే అక్కడ కరువయ్యారు. గడిచిన పదేళ్లలో వెయ్యి కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొదట్లో ఏటా వందల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు పదుల సంఖ్యకు పడిపోయాయి. అసలు గర్భిణీల వివరాలు కూడా ప్రభుత్వ నివేదికలకు ఎక్కడం లేదు. అంతలా రహస్య ఒప్పందాలతో కడుపులో బిడ్డను కడుపులోనే చంపేస్తున్నారు.
ఇంటి గుమ్మం దాటకుండానే లింగనిర్ధారణ పరీక్షలు జరిగిపోతున్నాయి. తరువాత జరగాల్సిన మృత్యుహేలను చడీచప్పుడు లేకుండా కానించే ముఠాలు పెరిగిపోయాయి. ఈ దుర్మార్గానికి పాల్పడుతున్న కుటుంబాల్లో పేద, మధ్య తరగతి అన్న తేడా ఉండడం లేదంటున్నారు ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న నర్సు. పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని ఆమె కొన్ని కఠోర నిజాలు చెబుతున్నారు. లింగనిర్ధారణ పరీక్ష ఖర్చుతో కూడుకున్నది. లక్షల రూపాయలు వెచ్చించడానికి కూడా ప్రజలు వెనుకాడడం లేదు. పేదలు కూడా ఉన్న కాస్త పొలమో, ఇల్లో అమ్మైనా సరే పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇద్దరు ఆడబిడ్డల తరువాత కచ్చితంగా మగపిల్లవాడే కనాలన్న బలమైన కోరిక వారిలో ప్రబలంగా ఉంటోంది’ అని ఆమె చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం లింగనిష్పత్తి 1000 : 930 నుండి 980 మధ్య ఉండాలి. కానీ హర్యానాలో చాలా జిల్లాలు ఆ దరిదాపుల్లో కూడా లేవు. మహేంద్రగఢ్‌ (871), గురుగ్రామ్‌ (871), రోహతక్‌ (879), కైథాల్‌ (886), పానిపట్‌ (887), జింద్‌ (890), ఫరిదాబాద్‌ (898) తదితర జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య 900కు కూడా పెరగడం లేదు.
లింగ నిర్ధారణ, చట్టవిరుద్ధమైన అబార్షన్‌లను నిరోధించే లక్ష్యంతో ప్రీ-కాన్సెప్షన్‌, ప్రీ-నేటల్‌ డయాగ్నోస్టిక్‌ టెక్నిక్స్‌ (ూచీణు) చట్టం, మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (ఎంటిపి) చట్టాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. అయితే ఏ ప్రయోజనాల కోసం చట్టాలు తీసుకొచ్చారో, అవి నెరవేరే ఆచరణ శూన్యంగా కనిపిస్తోంది. దేశంలో ఎంతో అట్టహాసంగా ‘బేటీ బచావో బేటీ పడావో’ ప్రణాళికను తీసుకొచ్చిన పెద్దలు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలేమీ చేయలేదు. ఆడపిల్లలు, మహిళల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించే ఆ పెద్దలు ఆమె వేసుకున్న బట్టలు, తినే ఆహారం, పాటించే ఆచారాలపై నిత్యం ఆంక్షలు, నిర్బంధాలు విధిస్తునే ఉంటారు. అంతటి పాషాణ హృదయాలు ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో నిల్చున్నాయి. రానున్న రోజుల్లో ఈ దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజా చైతన్యం రావాలి. పాలకులకు బుద్ధి చెప్పాలి.

➡️