మంచి నిద్ర పట్టాలంటే…

Feb 19,2024 10:59 #health

ప్రతిరోజూ మనిషికి కంటి నిండా నిద్ర అవసరం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు సరైన నిద్ర కూడా పోవాలి. కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. దానివల్ల మెదడు పనితీరు, జీర్ణక్రియ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలోని మలినాలు బయటకు పోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడు జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మెదడు బాగా అలిసిపోయి నిద్ర త్వరగా పడుతుంది. మెదడుపై ఒత్తిడి పెంచే మానసిక ఆలోచనలు తగ్గించాలి. శరీరంలో మెగ్నీషియం తగ్గినప్పుడు త్వరగా నిద్రపట్టదు. రాత్రి పడుకునే ముందు గుప్పెడు మెగ్నీషియం స్ఫటికలు గోరు వెచ్చని నీటిలో వేసి కాళ్లను అరగంట పాటు ఉంచాలి. అప్పుడు త్వరగా నిద్రపడుతుంది. రాత్రి భోజనం 8 గంటల లోపు త్వరగా జీర్ణం అయ్యే తక్కువ మోతాదులో ఆహారాన్ని తినాలి. సి విటమిన్‌ అధికంగా ఉండే అరటికాయ, నల్ల ద్రాక్ష, కమల పండ్లను తినాలి. రోజుకు ఐదు లీటర్ల మంచినీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. గోరువెచ్చని మంచినీళ్లు తాగితే ఇంకా మంచిది. రాత్రి వేళలో టీ, కాఫీలు తీసుకోకూడదు. ప్రతి రోజూ గ్లాసు పాలు తాగాలి. పడుకునేముందు పుస్తకం చదవడం, మంచి సంగీతాన్ని వినడం వల్ల త్వరగా నిద్రపడుతుంది.

గాఢ నిద్ర రావాలంటే…

ఎన్ని గంటలు నిద్రపోయామన్నది కాకుండా ఎంత గాఢంగా నిద్రపోయామన్నది ముఖ్యం. అలా నిద్ర పట్టాలంటే పడకగది కూడా సౌకర్యంగా ఉండాలి. అందుకోసం పడక గదిని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాలి. మనకు నిద్ర రావటానికి మొలటోనిన్‌ అనే హార్మోను ఉపయోగపడుతుంది. ఇది కేవలం చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే విడుదలవుతుంది. అందుకే పడకగదిలో చీకటి ఉండేలా చూసుకోవాలి.

దుప్పట్లు, దిండ్లు ఇలా…

కొన్ని రకాల రంగులూ నిద్ర రావటానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గులాబీ, నీలం, వంగపండు రంగులు కళ్లకు ప్రశాంతతనిస్తాయి. అందుకే పడకగదిలో ఈ రంగులతో పెయింట్‌ వేయిస్తే మంచిది. ముదురురంగుల జోలికి వెళ్లకపోవటమే మంచిది. పరుపు మీద దుప్పట్లూ, దిండ్ల విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. సిల్కు వాటికి బదులు కాటన్‌ వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. పరుపును ఎప్పుడూ ఒకే దిశలో కాకుండా అటు, ఇటూ మారుస్తుంటాలి.

పుస్తకం చదవటం మేలు

రాత్రిళ్లు పడుకునేముందు లావెండర్‌, వెనిల్లా వాసనలు వచ్చే పరిమళాలు రాసుకుంటే మంచి నిద్ర పడుతుంది. పడక గదిలో టీవీ, కంప్యూటర్‌ లాంటివి పెట్టుకోవద్దు. నిద్రపోవటం మానేసి వాటితో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాం. ఈ రెండూ నిద్రకు ఆటంకంగా మారతాయి. వాటికి బదులుగా ఓ పుస్తకం చదువుకునేలా చూసుకోవాలి. తద్వారా నిద్ర కూడా త్వరగా పడుతుంది.

➡️