వలస బతుకుల విషాదం!

కుటుంబ పోషణ కోసం, పిల్లల చదువుల కోసం ఇళ్లు వాకిళ్లు వదిలి, భార్యాబిడ్డలను విడిచి మన దేశం నుంచి లక్షలాదిమంది సుదూరాలకు వలస వెళతారు. ప్రమాదకరమని తెలిసినా ఇరుకు గదుల్లో, శిథిలమవుతున్న భవనాల్లోనే నివసిస్తారు. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా అదనపు పని గంటలు పనిచేస్తారు. ఇంతా చేస్తే, వాళ్ల బతుకులు ఎప్పుడు తెల్లారిపోతాయో వాళ్లకే తెలియదు. గత వారం దుబారు మంగాఫ్‌ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం ఈ పరిస్థితులకు ఒక ఉదాహరణ. ఆ రోజు 40 మందికి పైగా కార్మికులు చనిపోతే- అందులో భారతీయులే ఎక్కువ.

కొడుకును ఉన్నత చదువులు చదివించాలని, ఉన్నత స్థితిలో చూడాలని కలలు కన్న ఓ తండ్రి ఉన్న ఊరిలో బతుకు దెరువు లేక దుబాయికి పయనమయ్యాడు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం మరో తండ్రి కూడా దుబాయి విమానం ఎక్కాడు. తూర్పు గోదావరి పెరవలి మండలానికి చెందిన మీసాల ఈశ్వరుడు, మొల్లేటి సత్యనారాయణ, పక్కపక్క ఊర్లే అయినా వాళ్లెప్పుడూ కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. అయితే వలస జీవితం వాళ్లని ఒకటి చేసింది. విచారించాల్సిన విషయమేమంటే, అది జీవితంలో కాదు.. మరణంలో.
దుబారులోని సూపర్‌ మార్కెట్లో చాలా తక్కువ జీతానికే వాళ్లిద్దరూ పనికి కుదిరారు. ఆ జీతానికే తమ కడుపు నింపుకోవాలి. గూడు ఏర్పరచుకోవాలి. ఊళ్లో ఉన్న భార్యపిల్లలకు పంపాలి. అందుకే ప్రమాదమని తెలిసినా శిథిలస్థితిలో ఉన్న, పదుల సంఖ్యలో నివసించే వీలున్న ఓ ఇరుకు భవంతిలో వందలమంది ఆశ్రయం పొందిన చోటే తమ బతుకునూ బాగు చేసుకుందామనుకున్నారు. పదేళ్లుగా అదే వారి నివాసం. దశాబ్దం కాలంలో ఇంటికి వచ్చింది వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.

‘దూరాన ఉన్న నాన్న, మీ కోసం కష్టపడుతున్నాడని, నాన్న కనిపించడం లేదని ఏడ్వవద్దని ఆ తల్లులు ఎన్నో సార్లు ఆ బిడ్డలకు చెప్పి వుంటారు. కానీ అనుకోని ప్రమాదంలో ఆ తండ్రులిద్దరూ కాలిన గాయాలతో మాంసం ముద్దలుగా, గుర్తుపట్టడానికి వీళ్లేనటువంటి స్థితిలో ఆ ఇళ్లకు చేరారు. ఎంత విషాదం, ఎంత బాధాకరం! ఈ బాధ ఆ బిడ్డలది మాత్రమే కాదు. ఈ ప్రమాదంలో తండ్రులను కోల్పోయిన ఎందరో పిల్లలది.
భారతదేశం ఇటువంటి వలస జీవుల విషాదగాథలతో నిండిపోయింది. దేశం వెలుపలే కాదు. దేశంలో కూడా ఎందరో శ్రమజీవులు భార్యబిడ్డలను వదిలిపెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి జీవిస్తున్నారు. భవన నిర్మాణరంగ కార్మికులు, రైతు కూలీలు, డ్రైవర్లు, వంటపనివారు, ప్లంబర్లు, ఇంటి పనిచేసేవారు, వడ్రంగులు, కరెంటు పనిచేసేవారు.. ఇలా ఎంతోమంది కార్మికులు ఉపాధి కోసం, మెరుగైన జీవన స్థితుల కోసం విదేశాలకు వలసవెళ్తున్నారు. దేశ ఆర్థిక స్థితి మెరుగుపడడంలో ఈ వలసజీవుల కష్టం ఎంతో ఉంది. వాళ్ల ఇంట్లో వెలుగుతున్న పొయ్యి, దేశ అభివృద్ధిలో కీలకంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. దక్షిణ భారతదేశంలోకెల్లా, కేరళ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి చెందడం వెనుక, విదేశాల్లో స్థిరపడ్డ వలసదారులే ముఖ్యమని చెప్పొచ్చు.

ఈ ప్రమాదం జరిగిన తరువాత భారతదేశం నుంచి విదేశాలకు వలసపోతున్న కార్మికుల జీవితాలపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రపంచ దేశాలకు అత్యధిక సంఖ్యలో బ్లూ కాలర్‌ కార్మికులను ఎగుమతి చేస్తోన్న ఏకైక దేశం మనది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ సంఘటన జరిగినా, అందులో మన భారతీయులు తప్పక ఉంటారు. ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్నప్పుడు వందలమంది భారతీయులు స్వదేశానికి తిరిగివచ్చారు. చదువు కోసం, ఉపాధి కోసం వారంతా అక్కడ ఉన్నారని తెలిసి భారతీయులంతా అవాక్కయ్యారు. ఆ యుద్ధంలో మరణించిన వారిలో కూడా మన దేశీయులు ఉన్నారు. అలాగే, ఉపాధి కోసం, అక్రమంగా విదేశాల్లో స్థిరపడ్డ వారిలో కూడా మన వారే అధికంగా ఉంటున్నారని ఎన్నోసార్లు రుజువైంది. 2023లో 96 వేల పైచిలుకు భారతీయ కార్మికులు తమ దేశంలోకి చొరబడ్డానికి సిద్ధపడ్డారని యుఎస్‌ మీడియాలో అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతకుముందే, 2014లో తమకు తాముగా స్వీయ నిర్బంధం చేసుకొని ఓ కార్గోషిప్‌ ద్వారా అక్రమంగా ఇంగ్లీషు కెనాల్‌ దాటుతున్న 34 మంది భారతీయ కార్మికులు అస్వస్థతకు గురవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. లాక్‌డౌన్‌ సమయంలో యుఎస్‌, కెనడా సరిహద్దును అక్రమంగా దాటేందుకు ప్రయత్నించిన గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం, మంచు తుపానులో చిక్కుకుని ప్రాణాలు విడవడం కూడా చూశాం. అంటే ఉపాధి కోసం చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా కుటుంబాలకు కుటుంబాలు విదేశాల్లో తలదాచుకుంటున్నాయి.

విదేశాల్లో స్థిరపడ్డ భారతీయుల్లో ఎక్కువ శాతం మంది గల్ఫ్‌ దేశాల్లోనే ఉపాధి చూసుకుంటున్నారు. 1973లో చమురు రంగంలో వచ్చిన గణనీయ మార్పు, ఆ దేశ ఉపాధి రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. ఉపాధి కోసం, విదేశాల నుండి లక్షలాది కార్మికులు అక్కడికి చేరుకున్నారు. ఒక్క మన దేశం నుండే 85 లక్షల మంది కార్మికులు అక్కడ ఉపాధి పొందుతున్నారు. కేరళ నుండి అధికంగా, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తరువాత ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పంజాబ్‌ రాష్ట్రాలు వరుసగా ఆ జాబితాలో ఉన్నాయి.

ఉపాధి కోసం ఆయా దేశాలకు వలసవెళ్లిన కార్మికులు అక్కడ దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని అడపా దడపా వార్తలు వస్తూనే ఉంటాయి. యజమానుల వేధింపులు, పాస్‌పోర్టులు లాక్కుని నిర్బంధంగా పనులు చేయించుకోవడం, ఎక్కువ పనిగంటలు, అధిక శ్రమతో అనారోగ్యం పాలైన ఎంతోమంది వేతన జీవులు బతుకుజీవుడా అనుకుంటూ స్వదేశానికి వచ్చిన సంఘటనలు కూడా వింటూనే ఉంటాం. అనుకోని ప్రమాదాల్లో అశువులు బాస్తున్న వారి సంఖ్య కూడా ఏడాదికేడాది పెరుగుతూనే ఉంటుంది. కష్టాన్ని నమ్ముకుని, కోటి ఆశలతో, కలలతో సుదూరాలు తరలిపోతున్న ఈ వలసజీవులు, అర్థంతరంగా జీవితాలను కోల్పోతున్న బాధ ఆ కుటుంబాలకు తీరని వేదన. ఆ బిడ్డలకు అంతులేని విషాదం..

➡️