పుదీనాతో పుట్టెడు ఉపయోగాలు

Jun 17,2024 04:20 #health, #jeevana

పుదీనాని సువాసన కోసమే కాక, ఆరోగ్యపరంగా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మ, కేశ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఈ ఆకులను మాయిశ్చరైజర్లు, క్లెన్సర్లు, లిప్‌బామ్‌, షాంపు, కండిషనర్ల తయారీలో వాడతారు. పుదీనాలో అనాల్జేసిక్‌, యాంటీ ఇన్‌ఫ్ల్లమేటరీ, యాంటీమైక్రోబియాల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు మెండుగా ఉంటాయి.
బ్లాక్‌ హెడ్స్‌ : పుదీనా బ్లాక్‌హెడ్స్‌ను శుభ్రంగా తొలగిస్తుంది. కొన్ని ఆకులకు చిటికెడు పసుపు కలిపి ముద్ద చేయాలి. దీనిని ముఖానికి రాసుకొని, చేతి వేళ్లతో కాసేపు మృదువుగా మర్దన చేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ వుంటే బ్లాక్‌హెడ్స్‌ తగ్గి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
మొటిమలు, మచ్చలు : పుదీనా ఆకుల్లోని యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు మొటిమలను కలిగించే కణాలను తొలగిస్తాయి. చర్మంపై నల్లని మచ్చలు, ఇతర మరకలను తగ్గిస్తాయి. కొన్ని పుదీనా ఆకులను నలిపి మొటిమలపై రాయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొద్దిరోజుల్లో మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.
మేనిఛాయ : ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు, ఇతర గుణాల వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఇవి బాక్టీరియాను చంపి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యవంతంగా చేస్తాయి. కొన్ని పుదీనా ఆకులకు చిటికెడు పసుపు, కొన్ని చుక్కలు రోజ్‌ వాటర్‌ కలిపి ముద్ద చేయాలి. దీనిని ముఖం, మెడకు రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ముడతలు : పుదీనా ముఖంపై నుండి ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. వయసు రీత్యా వచ్చే ముడతల నుంచి సంరక్షిస్తుంది. పుదీనా ఆకులను నీళ్లలో మరిగించి, చల్లార్చాలి. ఈ నీటిని ముఖానికి రాసుకోవాలి.
దురద : కాలిన గాయాలు, ఎలర్జీలకు ఇది మంచి నివారణ. పుదీనా ఎలర్జీ కలిగించే బాక్టీరియాను చంపుతుంది. ఆకులను మెత్తగా నూరి ప్రభావిత ప్రాంతంపై రాసుకోవడం ఈ సమస్యకు అత్యుత్తమ పరిష్కారం.
జుట్టు రాలడం : యాంటీఆక్సిడెంట్‌ గుణాలు మెండుగా ఉండే పుదీనా ఆకులు జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాకుండా, ఎదుగుదలకు తోడ్పడతాయి. పుదీనా ఆకులను మరిగించిన నీటిని జుట్టు, మాడుకు బాగా మర్దన చేసుకోవాలి. పది నిమిషాల తరువాత మామూలు నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మాడుపై ఇన్ఫెక్షన్లూ తగ్గుతాయి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

➡️