విదేశీయులకూ మోడీ మెసేజ్‌లు

  •  ఎన్నికల వేళ హద్దుల్లేని ప్రధాని ప్రచారం

న్యూఢిల్లీ : ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం దేశ సరిహద్దులు దాటిపోతోంది. ‘వికసిత్‌ భారత్‌ సంపర్క్‌’ పేరిట వాట్సాప్‌లో ప్రధానమంత్రి లేఖ రూపంలో వస్తున్న మేస్సేజ్‌లతో ప్రజలు విస్మయానికి గురౌతున్నారు. విదేశాల్లో ఉన్నవారికీ ఈ తరహా సందేశాలు వెళ్తున్నాయి. తన లేఖకు సమాధానం ఇవ్వాలని కూడా కోరడం విశేషం. ఇదంతా బిజెపి ప్రచార వ్యూహం తప్ప మరోటి కాదు. వాట్సాప్‌లో వస్తున్న లేఖ ఇలా ఉంది..’గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం నుండి ఈ లేఖను పంపుతున్నాము. గత పది సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ద్వారా 140 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రయోజనం పొందుతారు. వికసిత్‌ భారత్‌ ఆకాంక్షల సాధనకు మీ సూచనలు ఎంతో ముఖ్యం. కాబట్టి దయచేసి మీ సలహాలు, సూచనలు అందించండి’ అని ఆ లేఖలో సూచించారు.
వికసిత్‌ భారత్‌, పబ్లిక్‌ అండ్‌ గవర్నమెంట్‌ సర్వీస్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, భారత ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్‌ నికేతన్‌, 6, సీజీఓ కాంప్లెక్స్‌, లోధీ రోడ్డు, న్యూఢిల్లీ చిరునామాతో ఈ సందేశాలు పంపుతున్నారు. సిటిజన్‌ వేదిక ‘మైగవ్‌’ ద్వారా ఈ ప్రచారం సాగుతోంది. డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌లో మైగవ్‌ ఓ భాగం. ఇది ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న సంస్థ. వాట్సప్‌ సందేశాలను గమనించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ వ్యవహారాన్ని మేటా వేదిక దృష్టికి తీసికెళ్లింది. సమాధానం రాకపోవడంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రధాని నుండి వచ్చిన వాట్సప్‌ సందేశాలపై వ్యాఖ్యానించేందుకు ఇసి కార్యాలయం నిరాకరించింది. ప్రధాని మోడీ.. వాయుసేన విమానాలను ఇప్పటికే తన ఎన్నికల ప్రచారం కోసం వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
అది కోడ్‌ ఉల్లంఘనే
అయితే ప్రధాని మోడీ పేరుతో పంపుతున్న బల్క్‌ మెసేజ్‌లు కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తాయని చండీగఢ్‌ ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. ఈ సందేశాలపై ‘సి – విజిల్‌’ ద్వారా ఈ నెల 17న ఫిర్యాదు అందడంతో వారు స్పందించారు. ఈ విషయం దేశవ్యాప్త అధికార పరిధిని కలిగి ఉన్నందున చండీగఢ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‘అవసరమైన చర్య’ కోసం దీనిని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇసిఐకి పంపించినట్లు తెలిపారు. తదుపరి చర్యలు ఇసిఐ తీసుకుంటుందని చండీగఢ్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌-కమ్‌-డిప్యూటీ కమిషనర్‌ వినరు ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు.

➡️